వద్దని చెప్పే కొద్దీ, వీరబాదుడు బాదాడు... సెహ్వాగ్ గురించి ఫన్నీ విషయం బయటపెట్టిన గంగూలీ...

First Published Sep 4, 2021, 7:00 PM IST

సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో ప్రపంచానికి పరిచయమైన స్టార్ క్రికెటర్లలో వీరేంద్ర సెహ్వాగ్ ఒకడు. యువరాజ్ సింగ్, ఇర్పాన్ పఠాన్, జహీర్ ఖాన్ వంటి స్టార్లతో పోలిస్తే.. సెహ్వాగ్‌కి, గంగూలీకి మధ్య మంచి అనుబంధం ఉంది. తాజాగా ఈ ఇద్దరూ అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రామ్‌కి హాజరయ్యారు...

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో దాదాతో తనకున్న అనుబంధం గురించి వీరూ బయటపెట్టగా... సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌తో తనకి ఎదురైన ఓ ఫన్నీ సంఘటన గురించి చెప్పాడు..

‘2002లో నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాం. అంతకుముందు ఏడాదికాలంగా అన్నీ ఫైనల్స్ ఓడిపోయామని, నేను చాలా కోపంగా ఉన్నాను... ఇంగ్లాండ్ అప్పటికే 325 భారీ స్కోరు చేసింది...

సెహ్వాగ్ మాత్రం మనం నిలబడితే ఈ మ్యాచ్‌ గెలవగలమని చెప్పాడు. ఆశించినట్టే మాకు మంచి ఆరంభం కూడా దొరికింది. కావాల్సిన ఓపెనింగ్ వచ్చిన తర్వాత ఏదైనా మూర్ఖంగా ప్రయత్నించి వికెట్ పడేసుకోవద్దని నేను వీరూకి చెప్పాను..

ఇరానీ బౌలింగ్‌కి వచ్చాడు. రోనీ ఇరానీ అప్పటికే సిరీస్‌లో చాలా వికెట్లు తీశాడు. కాబట్టి అతని బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడమని చెప్పాను. అయితే సెహ్వాగ్, ఇరానీ బౌలింగ్‌లో మొదటి బంతినే బౌండరీకి బాదాడు...

ఆ తర్వాత మళ్లీ అతని దగ్గరికి వెళ్లి, మొదటి బాల్‌కే ఫోర్ వచ్చింది... ఇక సింగిల్ తీయమని చెప్పా. అతను సరే అన్నాడు... కానీ ఆ తర్వాతి బాల్ మళ్లీ బౌండరీకి బాదాడు...

నా మైండ్‌సెట్ ఏమో ఒక్క ఫైనల్ అయినా గెలవాలని ఆలోచిస్తోంది. అలా వీరూ దగ్గరికి వెళ్లి సింగిల్ తీయమని చెబుతూ ఉన్నా, అతను బౌండరీ బాదుతూనే ఉన్నాడు. అలా అదే ఓవర్‌లో ఐదు ఫోర్లు బాదాడు... 

వద్దని చెప్పే కొద్ది, సరే అంటూ బౌండరీ బాదుతున్నాడు... అందుకే అతనికేమీ చెప్పకూడదని నేను కూడా స్పీడ్ పెంచి, బౌండరీలు బాదడం మొదలెట్టా...’ అంటూ చెప్పుకొచ్చాడు సౌరవ్ గంగూలీ...

2002 జూలై 13న లార్డ్స్ స్టేడియంలో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 5 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది... 326 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన భారత్‌కి ఓపెనర్లు సెహ్వాగ్, గంగూలీ కలిసి శుభారంభం అందించారు...

తొలి వికెట్‌కి 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 43 బంతుల్లో 10 ఫోర్లు, ఓ  సిక్సర్‌తో 60 పరుగులు చేసిన సౌరవ్ గంగూలీ అవుట్ అయ్యాడు... 

ఆ మ్యాచ్‌లో 49 బంతుల్లో 7 ఫోర్లతో 45 పరుగులు చేసిన వీరేంద్ర సెహ్వాగ్ అవుటైన తర్వాత దినేశ్ మోంగియా, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ వికెట్లను త్వరత్వరగా కోల్పోయింది టీమిండియా...

146 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ కలిసి ఆరో వికెట్‌కి 121 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 63 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 69 పరుగులు చేసిన యువరాజ్ సింగ్ అవుటైన తర్వాత మళ్లీ వరుస వికెట్లు కోల్పోయింది భారత్...

హర్భజన్ సింగ్ 15 పరుగులు చేసినా... కుంబ్లే డకౌట్ అయ్యాడు. 75 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన మహ్మద్ కైఫ్ ఆఖరి ఓవర్‌లో భారత్‌కి విజయాన్ని అందించాడు...

ఈ మ్యాచ్‌లో ఉత్కంఠ విజయం అందుకున్న తర్వాత లార్డ్స్ బాల్కనీలో ఉన్న టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ, తన షర్ట్ విప్పి గాల్లో తిప్పుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఈ సెలబ్రేషన్స్ ఓ బెస్ట్ మూమెంట్‌గా నిలిచిపోయింది.

click me!