ఈ 60 ఓవర్లు, వాళ్లకి నరకం కనిపించాలి! లార్డ్ టెస్టులో విరాట్ కోహ్లీ స్పీచ్‌కి...

First Published Aug 16, 2022, 4:42 PM IST

విరాట్ కోహ్లీ... టీమిండియాకి అత్యధిక టెస్టు విజయాలు అందించిన కెప్టెన్. వన్డేల్లో అత్యధిక విజయాల శాతం అందుకున్న సారథి. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ స్కిల్స్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే 2021 ఆగస్టులో ఇంగ్లాండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్టు చూస్తే సరిపోతుంది...

లార్డ్స్ టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్‌కి బౌన్సర్లు వేసి ఇబ్బందిపెట్టాడు జస్ప్రిత్ బుమ్రా. ఈ సంఘటన తర్వాత మూడో రోజు ఆట ముగిసిన తర్వాత పెవిలియన్‌కి వెళ్తున్న సమయంలో అండర్సన్, బుమ్రాని ఏదో అనడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది...

బుమ్రాపై రివెంజ్ తీర్చుకోవాలని ఫిక్స్ అయిన ఇంగ్లాండ్ జట్టు, అతను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బాడీని టార్గెట్ చేస్తూ బౌన్సర్లు వేశారు. దీన్ని డగౌట్ నుంచి చూసిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కోపంతో రగిలిపోయాడు.. 

అయితే ఇంగ్లాండ్ బౌలర్ల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్న జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీతో కలిసి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పి భారత జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. ఆఖరి రోజు చివరి 60 ఓవర్లు ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది... 60 ఓవర్లలో ఆలౌట్ చేయడమంటే మామూలు విషయం కాదు, దీంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని భావించారంతా...

కెఎల్ రాహుల్ ‘మాలో ఒక్కడిని మీరు టార్గెట్ చేస్తే, మేమంతా కలిసి మీదపడిపోతాం...’ అని చెప్పినట్టుగా బుమ్రాకి జరిగిన అనుభవానికి అతని కంటే ఎక్కువగా విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ రగిలిపోయారు... అది ఆఖరి రోజు ఆటలో స్పష్టంగా కనిపించింది...

లంచ్ సెషన్ తర్వాత 9 బంతులు ఆడిన తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది టీమిండియా. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌కి వచ్చే ముందు విరాట్ కోహ్లీ, టీమ్‌ మేట్స్‌కి ఇచ్చి లఘు స్వీచ్ వీడియా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది... స్టేడియంలో ప్రేక్షకుల అరుపులతో విరాట్ కోహ్లీ ఏం మాట్లాడింది... పూర్తిగా వినిపించకపోయినా... ‘ఈ 60 ఓవర్లలో వారికి నరకం కనిపించాలి...’ అంటూ చెప్పిన మాటలు మాత్రం స్పష్టంగా వినిపించాయి... 

విరాట్ కోహ్లీ ఇచ్చిన స్పీచ్, భారత బౌలర్ల నరాలను ఆవేశంతో ఊగేలా చేసింది.  కెప్టెన్ చెప్పినట్టే ఆ గంటన్నర ఇంగ్లాండ్‌కి చుక్కలు కనిపించాయి. లార్డ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ల ఒక్కో వికెట్ పడుతున్నప్పుడు మహ్మద్ సిరాజ్‌తో పాటు రోహిత్ శర్మ, అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా కూడా ఆవేశంగా ముందుకొచ్చి ఊగిపోతూ సెలబ్రేట్ చేసుకున్నారు...

డ్రాగా ముగుస్తుందని అనుకున్న టెస్టు మ్యాచ్‌ని 52 ఓవర్లలోనే ముగించేసి చారిత్రక విజయం అందుకుంది భారత జట్టు. ఈ టెస్టు మ్యాచ్‌, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చరిత్రలో భారత క్రికెట్ చరిత్రలో అరుదైన విజయంగా ఎప్పటికీ నిలిచిపోతుంది...
 

జో రూట్ సెంచరీ చేసిన ప్రతీసారీ విజయాన్ని అందుకుంటూ వచ్చిన ఇంగ్లాండ్, ఈ మ్యాచ్‌లో ఊహించని పరాజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ కెప్టెన్‌గా జో రూట్ పతనం ప్రారంభమైంది కూడా ఈ టెస్టు మ్యాచ్‌తోనే. ఈ టెస్టు తర్వాత వరుస పరాజయాలు ఎదుర్కొన్న జో రూట్, కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. 

click me!