పంత్ మ్యాచ్ విన్నర్.. శాంసన్‌ను ఇంకొన్నాళ్లు పక్కనబెట్టాల్సిందే.. ధావన్ షాకింగ్ కామెంట్స్

First Published Dec 1, 2022, 11:35 AM IST

భారత జట్టు కూర్పుపై  దుమారం కొనసాగుతూనే ఉంది.  పంత్, శాంసన్ లలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై  చర్చ నడుస్తున్న తరుణంలో టీమిండియా తాత్కాలిక సారథి శిఖర్ ధావన్ ఈ విషయంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

టీమిండియా యువ వికెట్ కీపర్లు రిషభ్ పంత్, సంజూ శాంసన్ లలో ఎవరిని కొనసాగించడం, ఎవరిని పక్కనబెట్టడం అని గత కొన్నిరోజులుగా చర్చ  జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో తాజాగా టీమిండియా తాత్కాలిక సారథి శిఖర్ ధావన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  

పదే పదే విఫలమవుతున్నా రిషభ్ పంత్  ను జట్టులో కొనసాగించడం.. సంజూ శాంసన్ ను బెంచ్ కే పరిమితం చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. న్యూజిలాండ్ పర్యటనలో రెండు సిరీస్ లకు ఎంపికైనా  శాంసన్ మాత్రం ఆడింది ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్. కానీ ప్రతీ మ్యాచ్ లో ఆడిన పంత్.. పట్టుమని పది పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డాడు. 

ఈ నేపథ్యంలో పంత్ ను జట్టు నుంచి పక్కనబెట్టాలని, సంజూకు అవకాశాలివ్వాలని వస్తున్న విమర్శలపై  ధావన్   స్పందించాడు. పంత్ మ్యాచ్ విన్నర్ అని.. అతడి స్కిల్స్ మీద తమకు నమ్మకముందని, టీమ్ లోకి రావాలంటే సంజూ శాంసన్ మరికొన్నాళ్లు వేచి చూడాలని కామెంట్స్ చేశాడు. 

న్యూజిలాండ్ తో మూడో వన్డే అర్థాంతరంగా ముగిసిన తర్వాత ధావన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘మొత్తమ్మీద మీరు మ్యాచ్ విన్నర్ ఎవరో చూడాలి. మీరే విశ్లేషించండి. సంజూ శాంసన్ మంచి ఆటగాడే కాదనను. తనకు వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. 

కానీ కొన్నిసార్లు అవకాశాల కోసం వేచి చూడాలి.  ఎందుకంటే మన తోటి క్రికెటర్ మనకంటే బాగా రాణించినప్పుడు కొన్నిసార్లు నిరీక్షణ తప్పదు.  పంత్ స్కిల్స్ గురించి మాకు తెలుసు. అతడు మ్యాచ్ విన్నర్. అటువంటి ఆటగాడికి మద్దతుగా నిలవాలి.  కొన్నిసార్లు అతడు  ఆడకున్నా  సపోర్ట్ ఇవ్వాలి..’ అని అన్నాడు. 

అయితే ధావన్ కామెంట్స్ పై సంజూ ఫ్యాన్సే గాక టీమిండియా అభిమానులు కూడా మండిపడుతున్నారు.  అసలు శాంసన్ కంటే పంత్ గొప్పగా ఏం ఆడాడని..? వరుసగా విఫలమవుతున్న పంత్  ను ఎందుకు పక్కనబెట్టకూడదని ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ రాసిచ్చిన స్క్రిప్ట్ ను ధావన్ తూచా తప్పకుండా  చదువుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే ధావన్.. రెండో వన్డేలో సంజూను ఎందుకు పక్కనబెట్టారు..? అని విలేకరులు ప్రశ్నించినప్పుడు  జట్టులో ఆరో బౌలర్ అవసరముందని.. దీపక్ హుడా కోసం  సంజూను  బెంచ్ లో ఉంచకతప్పలేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

click me!