KKR: ఆరుసార్లు రంజీ విన్నింగ్ కోచ్‌ను హెచ్‌కోచ్‌గా నియమించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

First Published Aug 17, 2022, 6:35 PM IST

Kolkata Knight Riders: ఐపీఎల్ లో రెండు సార్లు ట్రోఫీ నెగ్గిన కోల్కతా నైట్ రైడర్స్ కొత్త కోచ్ ను నియమించుకుంది.  సుదీర్ఘకాలం ఆ జట్టుకు సేవలందించిన బ్రెండన్ మెక్‌కల్లమ్ ఇటీవలే కేకేఆర్ ను వదిలి ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు హెడ్ కోచ్ గా వెళ్లాడు. 
 

కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కొత్త కోచ్ ను నియమించుకుంది.  తమ జట్టుకు సుదీర్ఘకాలం సేవలందించిన బ్రెండన్ మెక్‌కల్లమ్  గత సీజన్  తర్వాత తప్పుకోవడంతో కొత్త హెడ్ కోచ్ ను నియమించుకోక తప్పనిసరి పరిస్థితుల్లో కేకేఆర్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఆరు సార్లు రంజీ ట్రోఫీలు గెలిచిన  కోచ్ గా దేశవాళీ క్రికెట్ లో గుర్తింపు దక్కించుకున్న  చంద్రకాంత్ పండిట్ ను కేకేఆర్ హెడ్ కోచ్ గా నియమించింది. చంద్రకాంత్.. 2023 సీజన్ నుంచి కేకేఆర్ తో కలిసి పని చేయనున్నాడు. ఈ మేరకు కోల్‌కతా యాజమాన్యం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. 
 

కేకేఆర్ కు సుదీర్ఘకాలం సేవలందించిన బ్రెండన్.. 2022 సీజన్ తర్వాత ఆ జట్టు నుంచి తప్పుకున్నాడు. అతడు ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు హెడ్ కోచ్ గా వెళ్లాడు. అయితే  అక్కడా, ఇక్కడా  పని చేయడం కుదరదని.. కేకేఆర్ కు వీడ్కోలు చెప్పాడు. 

ఇక చంద్రకాంత్ విషయానికొస్తే.. 1986 నుంచి 1992 వరకు భారత జట్టు తరఫున ఆడిన ఆయన 5 టెస్టులు, 36 వన్డేలలో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. కానీ  అక్కడ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో దేశవాళీకే పరిమితమయ్యాడు. ఆట నుంచి వైదొలిగాక కోచ్ గా బాధ్యతలు చేపట్టిన చంద్రకాంత్..  రికార్డు స్థాయిలో ఆరు రంజీ ట్రోఫీలు గెలిచిన జట్లకు హెడ్ కోచ్ గా ఉన్నాడు. ఇందులో ముంబై జట్టు తరఫున కోచ్ గా ఉండి 3 ట్రోఫీలు, సౌరాష్ట్రకు రెండు ట్రోఫీలు అందించాడు.  ఇటీవలే మధ్యప్రదేశ్ కు తొలి రంజీ ట్రోఫీని అందించి రికార్డు సృష్టించాడు. 

గతంలో మధ్యప్రదేశ్ తరఫునే ఆడినా ఆ జట్టుకు ట్రోఫీ అందించలేకపోయిన చంద్రకాంత్.. హెడ్ కోచ్ గా తన కలను నెరవేర్చుకున్నాడు.  తన పనితనం మెచ్చిన షారుక్ ఖాన్.. ఆయనను కేకేఆర్ కు హెడ్ కోచ్ గా నియమించాడు. 
 

ఇక తనకు కేకేఆర్ హెడ్ కోచ్ పదవి దక్కడంపై చంద్రకాంత్ స్పందిస్తూ.. తాను  శ్రేయాస్ అయ్యర్ అండ్ కో తో పనిచేయడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. కేకేఆర్ యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని తెలిపాడు. 
 

click me!