గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్..! టీమ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

First Published Mar 23, 2023, 6:55 PM IST

IPL 2023: ఈనెల 31 నుంచి అహ్మదాబాద్ వేదికగా జరుగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ -16వ  సీజన్ కోసం  డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ సిద్ధమవుతోంది. 

మరో 8 రోజుల్లో మొదలుకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్  - 2023 ఎడిషన్  లో  భాగంగా   హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్.. డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో  బరిలోకి దిగనున్నది. ఈ సీజన్ లో  తొలి మ్యాచ్  గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్యే జరుగనున్న విషయం తెలిసిందే. 

అయితే  ఈ సీజన్  ఓపెనింగ్ మ్యాచ్ కు ముందే గుజరాత్ టైటాన్స్  టీమ్ సారథి విక్రమ్ సోలంకి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  తమ జట్టులో ఓపెనర్ గా ఉన్న  టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్   భవిష్యత్ లో గుజరాత్ కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు. 

ఐపీఎల్-16 ప్రారంభానికి ముందు నిర్వహించిన వర్చువల్ మీటింగ్ లో  విక్రమ్ సోలంకి మాట్లాడుతూ.. ‘శుభ్‌మన్ లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. తొలి సీజన్ లో అతడు చాలా   బాధ్యతలు తీసుకున్నాడు.  వృత్తి పట్ల అతడికున్న నిబద్ధత కూడా గిల్ నాయకత్వ లక్షణాలను  పెంపొందించుకునే విధంగా ఉన్నాయి. 
 

గిల్ సమీప భవిష్యత్ లో  గుజరాత్ కు  సారథిగా వ్యవహరిస్తాడా..? అంటే   అవుననే చెప్పగలను నేను.  అయితే ఈ విషయంలో ఇంతవరకూ అధికారికంగా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.  ప్రస్తుతం  హార్ధిక్ పాండ్యా జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు.  గిల్ చాలా టాలెంటెడ్ క్రికెటర్.  జట్టుకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో మేం అతడి అభిప్రాయాలను గౌరవిస్తాం.’ అని  తెలిపాడు. 

గత సీజన్ లో  గిల్..  గుజరాత్ తరఫున 16 మ్యాచ్ లు ఆడి  132.32 సగటుతో  432 పరుగులు చేశాడు.  గుజరాత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో హార్ధిక్ పాండ్యా తర్వాతి స్థానం గిల్‌దే..  ఇక ఈ  ఏడాది మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తర్వాత గిల్  పై భారీ అంచనాలున్నాయి.   

కాగా గుజరాత్ తరఫున ఆడుతున్న  మహ్మద్ షమీ  వర్క్ లోడ్ మేనేజ్మెంట్ గురించి అడిగిన ప్రశ్నపై  సోలంకి సమాధానం చెబుతూ..  ‘షమీ మా టీమ్ లో కీలక ప్లేయర్. గతేడాది మా టీమ్ తరఫున  అద్భుతంగా రాణించాడు. ఫాస్ట్ బౌలర్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి.  ఈ విషయంలో మేం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది...’అని తెలిపాడు.  

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత  నేరుగా ఐపీఎల్ ఆడుతున్న షమీ.. అది ముగిశాక ఇంగ్లాండ్ వేదికగా జరుగబోయే  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడనున్నాడు. గుజరాత్ టీమ్ నుంచి శుభ్‌మన్ గిల్ కూడా  భారత జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఇద్దరి విషయంలో గుజరాత్..  వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ఎలా నిర్వహిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. 

click me!