Shubman Gill: ఎడ్జ్‌బాస్టన్‌లో మరో సెంచరీ.. శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర

Published : Jul 05, 2025, 09:57 PM IST

Shubman Gill: ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్ లో 269 పరుగుల డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. రెండో ఇన్నింగ్స్‌లో మరో సెంచరీతో దుమ్మురేపాడు. రికార్డుల మోత మోగించాడు.

PREV
17
గిల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదరగొట్టిన శుభ్ మన్ గిల్

Shubman Gill: ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో శుభ్‌మన్ గిల్ మరోసారి దుమ్మురేపాడు. తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులతో సంచలనం రేపిన భారత కెప్టెన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆత్మవిశ్వాసంతో ఆడి మరో సెంచరీ సాధించాడు. 

తన ఎనిమిదో టెస్ట్ సెంచరీని అందుకున్నాడు. ఒక ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ, మరో ఇన్నింగ్స్ సెంచరీ కొట్టి రికార్డుల మోత మోగించాడు. 161 పరుగుల ఇన్నింగ్స్ లో గిల్ 13 ఫొర్లు, 8 సిక్సర్లు బాదాడు. దీంతో భారత్ కు 607 పరుగుల ఆధిక్యం లభించింది.

27
పంత్‌తో గిల్ కీలక భాగస్వామ్యం

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించినప్పుడు 96/2 వద్ద కరుణ్ నాయర్ అవుట్ కావడంతో, గిల్ మైదానంలో అడుగుపెట్టాడు. రిషభ్ పంత్‌తో కలిసి 110 పరుగుల వేగవంతమైన భాగస్వామ్యం ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత పంత్ 65 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జడేజాతో కలిసి గిల్ మరో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నిర్మించాడు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ను 427/6 డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్  587 పరుగులు చేసింది. ఇప్పుడు ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల టార్గెట్ ను ఉంచింది. 

37
ఇంగ్లాండ్‌పై ఐదో సెంచరీ కొట్టిన శుభ్ మన్ గిల్

ఈ టెస్ట్ సెంచరీతో గిల్ తన టెస్ట్ కెరీర్‌లో 8వ సెంచరీని పూర్తి చేశాడు. ప్రస్తుతం అతనికి టెస్ట్‌లలో మొత్తం 2,400పైగా పరుగులు ఉన్నాయి సగటు 42+ గా ఉంది. అయితే, ఇందులోని 1,100కు పైగా పరుగులు ఒక్క ఇంగ్లాండ్‌పైనే సాధించడం విశేషం.

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌ల్లో గిల్ 5 సెంచరీలు సాధించాడు. అలాగే, నాలుగు హాఫ్ సెంచరీలు బాదాడు. ప్రత్యర్థి దేశంలో ఆడిన టెస్ట్‌ల్లో అతనికి ఇప్పటికే 1,100కి పైగా పరుగులు ఉన్నాయి. ఇక ఇంగ్లాండ్‌లో మాత్రమే 600 పరుగుల మైలురాయిని దాటిన గిల్.. ఇక్కడ మూడు సెంచరీలు సాధించాడు.

47
269 పరుగుల అరుదైన ఇన్నింగ్స్ ఆడిన గిల్

తొలి ఇన్నింగ్స్‌లో గిల్ ఆడిన 269 పరుగుల అద్భుత ప్రదర్శనతో భారత్‌ 587 పరుగుల భారీ స్కోరు సాధించింది. 387 బంతులు ఎదుర్కొన్న గిల్ 30 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. ఇది విదేశీ మైదానాల్లో భారత బ్యాట్స్‌మన్ సాధించిన మూడవ అత్యధిక స్కోరు. 

అలాగే, ఇంగ్లాండ్‌లో ఒక భారత టెస్ట్ కెప్టెన్ చేసిన అత్యధిక స్కోరు కూడా ఇదే. గిల్, ఇంగ్లాండ్‌లో డబుల్ సెంచరీ సాధించిన మూడవ భారత బ్యాట్స్‌మన్‌గా కూడా రికార్డు సాధించాడు.

57
ఈ సిరీస్‌లో ఇప్పటికే 500కి పైగా పరుగులు చేసిన గిల్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 2025 టెస్ట్ సిరీస్‌లో గిల్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనే 500 పరుగులు దాటాడు. లీడ్స్‌లో జరిగిన హెడింగ్లీ టెస్టులో గిల్ 147, 8 పరుగులు సాధించాడు. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో 269 పరుగులు, 161 పరుగులు చేశాడు.

గిల్ అరుదైన రికార్డులు

గిల్ ఒకే టెస్ట్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన రెండవ భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇంతకు ముందు 1971లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌పై సునీల్ గవాస్కర్ ఈ ఘనత సాధించారు. 

మొత్తం ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇది తొమ్మిదవసారి మాత్రమే జరిగింది. కెప్టెన్ గా ఈ రికార్డు సాధించిన రెండో ప్లేయర్ గిల్ నిలిచాడు.  అతని కంటే ముందు 1990లో ఇంగ్లాండ్‌కు చెందిన గ్రాహం గూచ్ ఇండియాపై లార్డ్స్‌లో ఈ రికార్డు సాధించాడు.

67
గవాస్కర్, కోహ్లీ సరసన గిల్

టెస్ట్‌ క్రికెట్ లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించిన మూడవ భారత కెప్టెన్‌గా శుభ్ మన్ గిల్ నిలిచాడు. గతంలో గవాస్కర్ 1978 కోల్ కతాలో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. 

ఆ తర్వాత విరాట్ కోహ్లీ 2014లో అడిలైడ్ లో ఆస్ట్రేలియా పై ఈ ఘనత సాధించారు. ఇప్పుడు గిల్ ఈ లెజెండరీ ప్లేయర్ల సరసన చేరాడు.

77
గిల్ కెప్టెన్సీలో ఘనమైన ఆరంభం

తన కెప్టెన్సీ తొలి రెండు టెస్ట్‌ల్లో మూడు సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా గిల్ నిలిచాడు. మొదట ఈ ఘనతను విరాట్ కోహ్లీ సాధించాడు. అలాగే, విజయ్ హజారే, గవాస్కర్, గ్రెగ్ చాపెల్, స్టీవెన్ స్మిత్, అలెస్టేర్ కుక్ లాంటి దిగ్గజాలు కెప్టెన్సీలో తొలి రెండు టెస్ట్‌ల్లో రెండు సెంచరీలు సాధించారు.

ఈ టెస్ట్ మ్యాచ్ ద్వారా శుభ్‌మన్ గిల్ కొత్త శిఖరాలను అధిరోహించాడని చెప్పవచ్చు. బ్యాటింగ్ నైపుణ్యం, ఆటలో స్థిరత్వం, కెప్టెన్ ఇన్నింగ్స్ లు భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా మారాయి.

Read more Photos on
click me!

Recommended Stories