శుభ్‌మన్ గిల్ సెంచరీ మిస్ - WTC ఎలైట్ గ్రూప్ లోకి ఎంట్రీ

First Published | Nov 2, 2024, 10:25 PM IST

Shubman Gill: టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ శుభ్‌మన్ గిల్ టెస్టు క్రికెట్‌లో తన ఆరో సెంచరీని 10 ప‌రుగుల దూరంలో కోల్పోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన 3వ‌, చివరి టెస్టులో 2వ రోజు అద్భుత‌మైన ఆట‌తో 90 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.
 

Shubman Gill : ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ అద్భుత‌మైన ఇన్నింగ్స్ భార‌త జ‌ట్టుకు చాలా విలువైన‌దిగా మారింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 236 పరుగులను ఛేదించే క్రమంలో భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో భారత్ 84-4 పరుగులతో క‌ష్టాల్లో ప‌డ్డ సమ‌యంలో శుభ్‌మన్ గిల్, రిష‌బ్ పంత్ లు మంచి ఇన్నింగ్స్ ల‌ను ఆడారు. 

రిష‌బ్ పంత్ 60 పరుగుల ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్లు బాదాడు. గిల్ 90 పరుగులతో సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే,  అజాజ్ పటేల్ చేతిలో గిల్ ఔటయ్యాడు. 10 ప‌రుగుల దూరంలో సెంచ‌రీ కోల్పోయాడు. మొదట జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన గిల్ ఆ త‌ర్వాత అద్భుత‌మైన షాట్స్ తో ప‌రుగులు రాబ‌ట్టాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్ప‌ర్చాడు. 

గిల్ 146 బంతుల్లో 90 పరుగులు చేసి, ఏడు బౌండరీలు, ఒక సిక్స‌ర్ తో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తన 29వ టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న గిల్ 1,799 పరుగులు పూర్తి చేశాడు. ఈ ఫార్మాట్‌లో అత‌ని సగటు 38.27 కాగా, అతని ఖాతాలో ఇప్పుడు ఐదు సెంచ‌రీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక న్యూజిలాండ్ పై 40.37 సగటుతో 323 పరుగులు చేయ‌గా, ఇందులో రెండు హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. 


చెతేశ్వర్ పుజారాను అధిగ‌మించిన‌ గిల్

శుభ్‌మన్ గిల్ చెతేశ్వర్ పుజారాను వెనక్కి నెట్టి, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన నాల్గవ ఆటగాడిగా నిలిచాడు. WTCలో భారత్ తరఫున పుజారా 1769 పరుగులు చేశాడు. డబ్ల్యుటిసిలో రోహిత్ శర్మ 2,674 పరుగులతో భార‌త్ త‌ర‌ఫున‌ అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్ గా ఉన్నాడు. కోహ్లీ 2,426 పరుగులతో ఆ త‌ర్వాతి స్థానంలో ఉన్నాడు. రిషబ్ పంత్ 1933 పరుగులతో WTCలో భారతదేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడు.

న్యూజిలాండ్ ఫైట్ బ్యాక్

శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ మూడో టెస్ట్‌లో భారత్‌ను మెరుగైన స్థానంలో నిల‌బెట్టారు. అయితే, న్యూజిలాండ్ రెండో రోజు రెండో సెషన్‌లో 47 పరుగులకు నాలుగు వికెట్లు తీయ‌డంతో భారత్ 180-4 నుండి 227-8 ప‌రుగుల‌కు పడిపోయింది.

Rishabh Pant-Shubman Gill

తొలిరోజు న్యూజిలాండ్‌ను భారత్ 235 పరుగులకు ఆలౌట్ చేసింది. విల్ యంగ్ (71), డారిల్ మిచెల్ (82) అర్ధసెంచరీలు చేశారు. రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో 14వ సారి ఐదు వికెట్లు సాధించగా, వాషింగ్టన్ సుందర్ కూడా నాలుగు వికెట్లు పడగొట్టాడు. గిల్ ఔటయ్యే సమయానికి భార‌త్ 227/8తో మంచి స్పందనను కనబరిచింది. తొలి ఇన్నింగ్స్ లో భార‌త్ 263-10 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. 

భారత ప్లేయర్లలో జైస్వాల్ 30, గిల్ 90, రిషబ్ పంత్ 60, వాషింగ్టన్ సుందర్ 38 పరుగులు చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మరోసారి నిరాశపరిచారు. న్యూజిలాండ్ తరఫున అజాజ్ పటేట్ 5 వికెట్లు తీసుకున్నాడు. ఇక న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో పెద్దగా పరుగులు చేయకుండా భారత బౌలర్లు అడ్డుకున్నారు. ఆట ముగిసే సమయానికి కీవీస్ జ్టు 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ 3, రవీంద్ర జడేజా 4 వికెట్లు తీసుకున్నారు. న్యూజిలాండ్ ప్లేయర్లలో విల్ యంగ్ 51, డేవాన్ కాన్వే 22, గ్లెన్ ఫిలిప్స్ 26 పరుగులు చేశారు. ఇప్పటివరకు కీవీస్ జట్టుకు 143 పరుగుల ఆధిక్యం లభించింది.

కాగా, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్ మూడో టెస్టులో విజయం సాధించాలి. WTC ఫైనల్ ఆడటానికి టీమిండియా హాట్ ఫేవరెట్‌గా ఉంది, అయితే న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి జ‌ట్టును వెనక్కి నెట్టింది. భారత్ ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరిగే చివరి టెస్టులో విజయం సాధించి, ఫైనల్‌కు చేరుకోవాలనే ఆశలు స‌జీవంగా ఉండాలంటే రాబోయే సిరీస్ లో భార‌త జ‌ట్టు ఆస్ట్రేలియాను క‌నీసం 3-0తో ఓడించాలి.

Latest Videos

click me!