శ్రేయాస్ అయ్యర్‌కి 15 రోజుల్లో సర్జరీ... నాలుగైదు నెలల పాటు క్రికెట్‌కి దూరం...

First Published | Mar 26, 2021, 1:53 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్... దాదాపు నాలుగైదు నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉండబోతున్నట్టు సమాచారం. ఫీల్డింగ్ చేస్తూ డ్రైవ్ చేసిన శ్రేయాస్ అయ్యర్, భుజం ఎముక పక్కకు జరిగినట్టు గుర్తించిన వైద్యులు, మరో 15 రోజుల్లో శస్త్రచికిత్స ద్వారా దాన్ని సరిచేయనున్నారు.

గాయం కారణం వన్డే సిరీస్‌కి దూరమైన శ్రేయాస్ అయ్యర్, ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి కూడా దూరం కానున్నాడు. మొదట ఐపీఎల్ సీజన్ మధ్యలో అయ్యర్ రీఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగినా, తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం అది వీలుకాదని తెలిసింది.
సర్జరీ తర్వాత దాదాపు నాలుగైదు నెలల పాటు శ్రేయాస్ అయ్యర్‌కి పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారట వైద్యులు. దీంతో ఐపీఎల్ 2021 సీజన్‌తో పాటు ఆ తర్వాత జరిగే క్రికెట్‌కి అయ్యర్ దూరం కానున్నాడు...

మొదటి వన్డేకి ముందు ఇంగ్లాండ్ కౌంటీ క్లబ్ లాన్‌షైర్ తరుపున ఆడబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 157 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉన్న లాన్‌షైర్ క్రికెట్ క్లబ్ తరుపున గర్వంగా ఉందని తెలిపాడు అయ్యర్.
రాయల్ లండన్ వన్డే కప్ టోర్నీ జూలై 22న ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం జూలై 15న శ్రేయాస్ అయ్యర్, ఇంగ్లాండ్‌కి బయలుదేరి వెళ్లాలి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సమయం కల్లా శ్రేయాస్ అయ్యర్ కోలుకోవడం కష్టమే...
నాలుగో స్థానంలో అద్భుతంగా రాణిస్తూ, ఫ్యూచర్ టీమిండియా కెప్టెన్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్న శ్రేయాస్ అయ్యర్, ఇలా గాయం కారణంగా నాలుగైదు నెలల పాటు క్రికెట్‌కి దూరం కావడం నిజంగా దురదృష్టకరమే..
అయితే సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి యంగ్ ప్లేయర్లు టీమిండియాలో చోటు కోసం పోటీపడుతున్నారు. కాబట్టి అయ్యర్ లేని లోటు టీమిండియాకి పెద్దగా తెలియకపోవచ్చు.
అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌ను 2020 సీజన్‌లో ఫైనల్ చేర్చిన అయ్యర్, ఈ సీజన్‌లో బరిలో దిగడం లేదు. అయ్యర్ లేకపోవడం ఢిల్లీ ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉంది...
శ్రేయాస్ అయ్యర్ గైర్హజరీతో ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను నడిపించే నాయకుడిని వచ్చేవారం నిర్ణయించబోతోంది ఫ్రాంఛైజీ...
శిఖర్ ధావన్‌తో పాటు స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్, అజింకా రహానే, రవిచంద్రన్ అశ్విన్... డీసీ కెప్టెన్సీ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరికి కెప్టెన్సీ దక్కుతుందో తెలియాలంటే వచ్చేవారం దాకా ఆగాల్సిందే..
‘నా గాయం గురించి తెలిసి, నాకు మెసేజ్ చేస్తున్నవారందరికీ ధన్యవాదాలు. మరింత దృఢంగా కమ్‌బ్యాక్ ఇస్తాను... త్వరలో మళ్లీ వస్తా’ అంటూ ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు శ్రేయాస్ అయ్యర్...

Latest Videos

click me!