షమీ ఆసీస్‌లో టీ20 ప్రపంచకప్ ఆడాల్సినోడు.. ఆసియా కప్ కోసం ఎంపిక చేయలేదెందుకు..?

First Published Aug 9, 2022, 1:45 PM IST

Asia Cup: ఈనెల 27 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కాబోయే టీ20 ప్రపంచకప్ కోసం సోమవారం రాత్రి భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ జట్టులో  సీనియర్ వెటరన్ పేసర్ మహ్మద్ షమీ పేరు లేదు. 

ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో షమీ లేకపోవడంపై టీమిండియా మాజీలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతడు త్వరలో ఆసీస్ వేదికగా జరగాల్సి ఉన్న టీ20  ప్రపంచకప్ ఆడాల్సినోడని.. అతడిని  ఆసియా కప్ కోసం ఎంపిక చేయకపోవడమేమిటని  సెలక్షన్ కమిటీ చైర్మెన్ కిరణ్ మోరె ప్రశ్నించాడు. మరో  దిగ్గజ ఆటగాడు కృష్ణమచారి శ్రీకాంత్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.  

మోరె స్పందిస్తూ.. ‘పొట్టి ప్రపంచకప్ లో హార్ధిక్ పాండ్యా కీలకంగా మారనున్నాడు.  అతడు బ్యాట్, బంతితోనే కాదు ఫీల్డింగ్ లో సైతం అద్భుతాలు చేయగలడు. హార్ధిక్  తో పాటు  షమీ కూడా కీలక బౌలర్. అతడు లేకుండా ఆసీస్ కు వెళ్తే అది భారత జట్టుకు తీరనిలోటు. 

వచ్చే టీ20  ప్రపంచకప్ లో భారత్ తరఫున కచ్చితంగా ఆడాల్సిన క్రికెటర్లలో షమీ ఒకడు.  నేనిప్పటికీ అదే చెబుతాను. ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో బుమ్రా లేడు. అతడి గాయం చిన్నదా..? పెద్దదా..? అనే విషయం నాకు తెలియదు. 

రాహుల్ ద్రావిడ్ కు బ్యాకప్ ఆటగాళ్లను ఉంచుకోవడం అలవాటు. ఒక సీనియర్ బౌలర్ ఎవరైనా గాయపడితే అతడి స్థానంలో అవేశ్ ఖాన్  వస్తాడు. ఒకవేళ బుమ్రా గాయం చిన్నదే అయితే అతడితో పాటుగా షమీ  ప్రపంచకప్ ఆడేందుకు వెళ్తాడు..’ అని తెలిపాడు. 

ఇక శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘నా జట్టులో అయితే షమీకి కచ్చితంగా చోటిస్తా. నేనే గనక ప్రస్తుత సెలక్టర్ అయ్యుంటే కచ్చితంగా అతడిని ఎంపికచేసేవాడిని. బిష్ణోయ్ ను పక్కనబెట్టి  షమీకి తీసుకునేవాడిని. కానీ నలుగురు స్పిన్నర్లు ఎందుకు..? వారి బదులు షమీని తుది జట్టులోకి ఎంపిక చేసి ఉంటే బాగుండేది..’ అని అన్నాడు. 

గతేడాది యూఏఈ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ తర్వాత షమీ మళ్లీ జాతీయ జట్టు తరఫున టీ20లు ఆడలేదు. కానీ టెస్టులు, వన్డేలలో మాత్రం మెరుస్తున్నాడు. ఇక ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన అతడు.. ఆ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.  16 మ్యాచుల్లో 20 వికెట్లు తీశాడు.  అంత చేసినా షమీకి జాతీయ టీ20 జట్టులో స్థానం దక్కకపోవడం గమనార్హం. 
 

ఆసియా కప్‌-2022కు భారత జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కెఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), దినేశ్‌ కార్తిక్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, యజ్వేంద్ర చహల్‌, రవి బిష్ణోయ్, భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేశ్‌ ఖాన్‌

click me!