లంకతోనే కాదు.. కివీస్ సిరీస్ లోనూ సీనియర్లకు మొండిచేయే.. రోహిత్, కోహ్లీలకు పొమ్మనలేక పొగబెడుతున్న బీసీసీఐ..?

First Published Jan 5, 2023, 1:25 PM IST

INDvsSL:బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో గాయపడ్డ తర్వాత  శ్రీలంకతో టీ20 సిరీస్ కు  రోహిత్ కు రెస్ట్ ఇచ్చారు సెలక్టర్లు. కోహ్లీ కూడా ఈ సిరీస్ కు విశ్రాంతి కావాలన్నాడని వార్తలు వినిపించాయి.  అయితే లంకతో పాటు రాబోయే కివీస్ సిరీస్ లో కూడా... 

గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు ప్రక్షాళన మొదలైంది.   కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు  జట్టులోని సీనియర్లందరినీ తప్పించి వారి స్థానంలో యువ ఆటగాళ్లను  ఎంపిక  చేయాలన్న డిమాండ్లు వినిపించాయి.  టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని యువ భారత్ తో  టీ20 సిరీస్ ఆడించింది.  

తాజాగా స్వదేశంలో శ్రీలంకతో  జరుగుతున్న మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో కూడా   రోహిత్, కోహ్లీ, భువనేశ్వర్, అశ్విన్, షమీలను పక్కనబెట్టింది.   వన్డే సిరీస్ లో  వీళ్లలో పలువురు రీఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే లంక తో సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా..  న్యూజిలాండ్ తో  మూడు వన్డేలు, మూడు టీ20 లు ఆడాల్సి ఉంది. 
 

న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు రోహిత్, కోహ్లీలతో పాటు మరికొంతమంది సీనియర్లను పక్కనబెట్టాలని  బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం.  టీ20ని మొత్తం యువరక్తంతో నింపి వారిని  2024 టీ20 ప్రపంచకప్ వరకు సన్నద్ధం చేయాలనే  లక్ష్యంతో ఉన్న  బీసీసీఐ.. ఆ దిశగా అడుగులు వేస్తున్నది. 
 

బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో గాయపడ్డ తర్వాత  శ్రీలంకతో టీ20 సిరీస్ కు  రోహిత్ కు రెస్ట్ ఇచ్చారు సెలక్టర్లు. కోహ్లీ కూడా ఈ సిరీస్ కు విశ్రాంతి కావాలన్నాడని వార్తలు వినిపించాయి.  అయితే వీరిద్దరికీ విరామమిచ్చినా తిరిగి కివీస్ తో సిరీస్ లో జట్టుతో చేరతారని  అంతా భావించారు.  కానీ  ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్, వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ల కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న టీమిండియా..  అందులో భాగంగానే  ముందుకు వెళ్తున్నది.  

ఈ ఏడాది స్వదేశంలో జరుగబోయే  ఐసీసీ  వన్డే ప్రపంచకప్ భారత్ కు అత్యంత కీలకం. దిగ్గజ  ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు  ఈ మెగా టోర్నీ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ కు గుడ్ బై చెప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదీగాక వన్డే  ప్రపంచకప్ లో ఈ ఇద్దరూ భారత్  కు చాలా కీలకం.  అందుకే ఆచితూచి వ్యవహరించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది.   

ఈ ఇద్దరినీ వన్డేలకు మాత్రమే పరిమితం చేసి  కోహ్లీ, రోహిత్ లను శాశ్వతంగా  టీ20ల నుంచి తప్పించడమే మేలని అటు టీమిండియా ఫ్యాన్స్,   క్రికెట్ విశ్లేషకులు  విశ్లేషణలు చేస్తున్న నేపథ్యంలో  బీసీసీై కూడా  ఇదే ప్లాన్  ను అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. 

రోహిత్, కోహ్లీలతో పాటు కివీస్ తో సిరీస్ కు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ ల పేర్లను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదని  బోర్డు వర్గాల  సమాచారం. ఇదే నిజమైతే  భారత క్రికెట్ లో సీనియర్లకు మళ్లీ టీ20 జట్టులో చోటు దక్కడం గగనమే. ఫలితాల సంగతి ఎలా ఉన్నా యువ భారత్ తో ప్రయోగాలు చేయించాల్సిందే. 

click me!