బుమ్రాకు గాయం.. ప్రపంచకప్‌కు షమీని రెడీ చేసేందుకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్..

First Published Sep 30, 2022, 10:02 AM IST

IND vs SA:బుమ్రా గాయంతో భారత టీ20 ప్రపంచకప్ జట్టులో మార్పులు చోటు చేసుకోనున్నాయి. దక్షిణాఫ్రికా సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఇప్పటికే ఎంపిక చేసిన 15 మందిలో బుమ్రా కు రిప్లేస్‌మెంట్‌గా సిరాజ్ ను చేర్చగా ఇప్పుడు షమీ కూడా ప్రపంచకప్ జట్టులో లైన్ లోకి వచ్చాడు. 

Image credit: Getty

మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టయింది భారత జట్టు పరిస్థితి. పదిహేనండ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ ను స్వదేశానికి తీసుకురావాలని భావిస్తున్న భారత జట్టుకు ఆదిలోనే కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. వెన్ను నొప్పి గాయంతో  ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. 

Image credit: Getty

అతడి స్థానంలో సెలక్టర్లు హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్ (దక్షిణాఫ్రికాతో మిగిలిన రెండు టీ20లకు) ను ఎంపిక చేశారు. అయితే ఇప్పటికే ఎంపిక చేసిన పేస్ బౌలింగ్ విభాగంలో  భువనేశ్వర్ కుమార్ కు తప్ప అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ కు ప్రపంచకప్ ఆడిన అనుభవం లేదు. దీంతో సెలక్టర్లు ఆలోచనలో పడ్డారు.  
 

Image credit: Getty

ఈ నేపథ్యంలో  స్టాండ్ బై గా ఎంపిక చేసిన మహ్మద్ షమీని  తిరిగి జట్టులో చేర్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే  షమీని త్వరలో దక్షిణాఫ్రికాతో జరుగబోయే  వన్డే సిరీస్ లో ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నారు. అక్టోబర్ 6 నుంచి  వన్డే సిరీస్ మొదలుకానున్నది. 

వాస్తవానికి షమీ దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. కానీ కరోనా వల్ల అతడు సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు బుమ్రా గాయం వల్ల టీమిండియాకు బౌలింగ్ కష్టాలు వచ్చిపడటంతో సెలక్టర్లు మళ్లీ షమీ వైపు చూస్తున్నారు. దీంతో అతడిని దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో ఎంపిక చేసి తద్వారా   టీ20  ప్రపంచకప్ కు రెడీ చేయాలని భావిస్తున్నారు. 

ప్రపంచకప్ కు ఎంపిక చేసిన భారత జట్టు.. అక్టోబర్ 4న ఇండోర్ లో మూడో టీ20 ముగిసిన తర్వాత రోజు ఆస్ట్రేలియా విమానమెక్కనున్నది.  రోహిత్ సేన అక్టోబర్ 5నే ఆసీస్ వెళ్లనుంది. కానీ షమీ మాత్రం.. 11 వరకు  జరిగే వన్డే సిరీస్ లో ఆడి తర్వాత ఆసీస్ కు పయనమవుతాడు. 

ప్రపంచకప్ జట్టులో మార్పులు చేర్పులు చేయడానికి ప్రతి బోర్డుకు అక్టోబర్ 9వరకు సమయముంది. దీంతో ఆలోపు మళ్లీ ఒకసారి జట్టును పున:సమీక్ష చేసుకుని మళ్లీ జట్టును కన్ఫర్మ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అప్పటికీ కాకుంటే.. ఐసీసీ అనుమతితో అక్టోబర్ 15 వరకు జట్టులో మార్పులు చేసుకోవచ్చు. కానీ దానికి ఐసీసీ  చెప్పే సవాలక్ష నిబంధనలను పాటించాలి.  మరి బీసీసీఐ ఏం చేయనుందనేది ఇప్పుడు ఆసక్తికరం. 

అయితే గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత షమీ  జాతీయ జట్టులో ఒక్క మ్యాచ్ (టీ20 ఫార్మాట్) కూడా ఆడలేదు. మధ్యలో ఐపీఎల్ లో ఆడాడు. ఐపీఎల్ ముగిసి దాదాపు మూడు నెలలు కావస్తున్నది. మరి  ప్రపంచకప్ వరకు షమీ రెడీ అవుతాడా..?  అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. 

click me!