సచిన్ వర్సెస్ కోహ్లీ.. ఎవరు గ్రేట్..? కపిల్ దేవ్ షాకింగ్ రిప్లై..

First Published Jan 22, 2023, 5:53 PM IST

మూడేండ్లుగా శతకం లేక కరువుతో అల్లాడిపోయిన విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఇప్పుడు మళ్లీ ఖుషీ అవుతున్నారు. గతేడాది అఫ్గాన్ తో సెంచరీ తర్వాత  కోహ్లీ మళ్లీ శతకాల బాట పట్టి రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు. 

వన్డేలలో సచిన్ టెండూల్కర్ శతకాల రికార్డును బ్రేక్ చేసేందుకు దూసుకొస్తున్నాడు పరుగుల యంత్రం  విరాట్ కోహ్లీ. ప్రస్తుతం  కోహ్లీ.. వన్డేలలో 46 సెంచరీలతో ఉండగా  సచిన్ 49 శతకాలు చేశాడు.  మరో మూడు సెంచరీలు చేస్తే  కోహ్లీ.. సచిన్ ను సమం చేస్తాడు. నాలుగోది  కూడా కొడితే చరిత్రే. 

ప్రస్తుతం కోహ్లీ ఫామ్ చూసిన అతడి అభిమానులు, క్రీడా విశ్లేషకులు అతడు ఇదే ఫామ్ ను కొనసాగిస్తే సచిన్ శత శతకాలను బద్దలుకొట్టడం  అసాధ్యమేమీ కాదని అంటున్నారు.  ఈ నేపథ్యంలో సోషల్ మీడియాతో పాటు క్రికెట్ వర్గాలలో కూడా  సచిన్ వర్సెస్ కోహ్లీ చర్చ జోరుగా సాగుతున్నది. 

ఈ క్రమంలో   టీమిండియాకు తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ స్పందించాడు.   ప్రతీ జనరేషన్ లోనూ పాత తరానికి మించిన ఆటగాళ్లు వస్తుంటారని, తనవరకైతే  సునీల్ గవాస్కర్ గొప్ప బ్యాటర్ అని చెప్పాడు. గల్ఫ్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

కపిల్ దేవ్ మాట్లాడుతూ... ‘ఎవరు గొప్ప అనే విషయంలో ఒకరో ఇద్దరినో ఎంచుకోవాల్సిన అవసరం లేదు. క్రికెట్ అనేది 11 మంది  కలిసికట్టుగా ఆడాల్సిన ఆట. నా వరకైతే నేను అదే నమ్ముతాను. అంతేగాక నాకు వ్యక్తిగతంగా సొంత ఇష్టాలు,  అయిష్టాలు ఉంటాయి. ప్రతి తరంలోనూ మనకు  మెరుగైన ఆటగాళ్లు వస్తూనే ఉన్నారు.  

గత తరంలో సచిన్, రాహుల్, వీరేంద్ర సెహ్వాగ్ లు  గొప్పగా ఆడారు. ఇప్పుడు ఆ వంతు రోహిత్, కోహ్లీలది.  తర్వాత తరం కూడా బాగుంటుందని నేను కోరుకుంటున్నా. నా అభిప్రాయం ప్రకారమైతే అత్యుత్తమమైన  వారిలో సునీల్ గవాస్కర్ ఒకరు. ఒక మంచి క్రికెటర్ మాత్రమే నిలకడగా మెరుగైన ప్రదర్శనలు చేయగలడు...’అని  అన్నాడు. 

అయితే సచిన్ ను ఆరాధించే కోహ్లీ.. ఈ చర్చకు దూరంగా ఉన్నాడు. గతంలో కూడా  ఓ సందర్భంలో  కోహ్లీని ఓ పాత్రికేయుడు ‘మిమ్మల్ని అందరూ గోట్ అని పిలుస్తారు కదా. మీ దృష్టిలో గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) ఎవరు..?’ అని అడగ్గా  దానికి కోహ్లీ  మరోమాట లేకుండా సచిన్ పేరుతో పాటు విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ పేరు చెప్పడం గమనార్హం.  గోట్ అనే పదం వారికి మాత్రమే సూట్ అవుతుందని  అన్నాడు. 

click me!