ఒక్క ఓవర్లో ఏడు సిక్సర్లు కొట్టి డబుల్ సెంచరీ సాధించిన రుతురాజ్.. ప్రపంచ రికార్డు సొంతం

First Published Nov 28, 2022, 1:49 PM IST

Ruturaj Gaikwad: టీమిండియా యువ బ్యాటర్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న  పూణే కుర్రాడు రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనత సాధించాడు.  విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా  రుతురాజ్ సిక్సర్ల మోత మోగించాడు.  

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 2021  సీజన్ లో  చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మెరుపులు మెరిపించడమే గాక దేశవాళీలో అదరగొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన పూణే (మహారాష్ట్ర) కుర్రాడు  రుతురాజ్ గైక్వాడ్ మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 

Ruturaj Gaikwad

దేశవాళీలో భాగమైన విజయ్ హాజారే ట్రోఫీలో  మహారాష్ట్ర తరఫున ఆడుతున్న (సారథి కూడా అతడే)  గైక్వాడ్.. ఉత్తరప్రదేశ్ తో జరుగుతున్న  మ్యాచ్ లో  డబుల్ సెంచరీతో  దుమ్ము దులిపాడు.  అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో 159 బంతుల్లోనే  220 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.  డబుల్ సెంచరీ సాధించే క్రమంలో రుతురాజ్.. 10 బౌండరీలు, 16 సిక్సర్లు బాదాడు. 

అయితే ఈ మ్యాచ్ లో  డబుల్ సెంచరీతో పాటు  గైక్వాడ్ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు.  ఒకే ఓవర్లో ఏకంగా ఏడు సిక్సర్లు బాదిన బ్యాటర్ గా చరిత్ర పుటల్లోకెక్కాడు. యూపీ బౌలర్ శివ సింగ్ వేసిన 49వ ఓవర్లో ఈ అధ్బుతం ఆవిష్కృతమైంది.  

47 ఓవర్ ముగిసేసరికి  మహారాష్ట్ర స్కోరు  5 వికెట్ల నష్టానికి 272 పరుగులుగా ఉంది.  అప్పటికీ రుతురాజ్.. 147 బంతుల్లో 165 పరుగులు, సౌరభ్ నవలే (1) క్రీజులో ఉన్నారు.  శివ సింగ్ 49వ ఓవర్ విసిరాడు. తొలి నాలుగు బంతులు సిక్స్. ఐదో బంతికి శివ సింగ్ భయపడి నోబాల్ గా వేశాడు.  గైక్వాడ్ మాత్రం దానిని కూడా వదలలేదు.  ఆ బంతి కూడా సిక్స్. 

ఐదు, ఆరో  బాల్ కూడా స్టాండ్స్ లోకే వెళ్లింది. ఐదో బాల్ సిక్సర్ బాదాక  రుతురాజ్ డబుల్ సెంచరీ పూర్తయింది. ఈ ఓవర్లో మహారాష్ట్రకు మొత్తంగా 43 పరుగులొచ్చాయి.  ఏడు బంతుల్లోనే రుతురాజ్  42 పరుగులు రాబట్టి  డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  కార్తీక్  త్యాగి వేసిన చివరి ఓవర్లో కూడా   రుతురాజ్ మరో రెండు భారీ సిక్సర్లు బాదాడు.  దీంతో నిర్ణీత 50 ఓవర్లలో మహారాష్ట్ర 5 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. రుతురాజ్ 220 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 

ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు బాదడంతో  రుతురాజ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. లిస్ట్ ఏ క్రికెట్ లో ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన  వారిలో  రవిశాస్త్రి, యువారజ్ సింగ్, హెర్షలీ గిబ్స్, హజ్రతుల్లా జజాయ్, లియో కార్టర్, కీరన్ పొలార్డ్, తిషారా పెరీరా ఉన్నారు. కానీ  ఏడు సిక్సర్లు బాదిన బ్యాటర్ మాత్రం రుతురాజ్ ఒక్కడే కావడం గమనార్హం. ఇది ప్రపంచ రికార్డు. 

click me!