స్వదేశానికి కెప్టెన్ రోహిత్ శర్మ! ఆ ఇద్దరూ కూడా అవుట్... టెస్టు సిరీస్‌కి కూడా డౌటే...

First Published Dec 8, 2022, 12:49 PM IST

బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియాకి ఊహించిన షాక్‌లు తగిలాయి. ఇప్పటికే రెండు వన్డేల్లో ఓడి వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు, మూడో వన్డేలో ముగ్గురు కీ ప్లేయర్లు లేకుండా బరిలో దిగనుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కుల్దీప్ సేన్, దీపక్ చాహార్ స్వదేశానికి పయనం అవుతున్నట్టు రాహుల్ ద్రావిడ్ ప్రకటించాడు...

బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో గాయపడిన రోహిత్ శర్మ, దాదాపు 85 ఓవర్ల పాటు మ్యాచ్‌కి దూరమయ్యాడు... ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో బంగ్లా ఓపెనర్ అనమోల్ హక్ ఇచ్చిన క్యాచ్‌ని అందుకునే ప్రయత్నంలో రోహిత్ శర్మ చేతికి గాయమైంది...

Rohit Sharma

అప్పుడు ఫీల్డ్ వదిలిన రోహిత్, చికిత్స తర్వాత ఆసుపత్రికి వెళ్లి బొటనవేలికి స్కానింగ్ తీయించుకుని... తిరిగి వచ్చి బ్యాటింగ్ చేశాడు.  28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేసి చివరి బంతి వరకూ పట్టువదలని పోరాటం ప్రదర్శించాడు హిట్ మ్యాన్...

Rohit Sharma

‘రోహిత్ శర్మ ఈ మ్యాచ్ తర్వాత ముంబై వెళ్తాడు. గాయానికి అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటాడు. అలాగే కుల్దీప్ సేన్, దీపక్ చాహార్ కూడా వన్డే సిరీస్ నుంచి దూరమయ్యారు. వీళ్లు కూడా రోహిత్‌తో పాటు స్వదేశానికి వెళ్తారు...’ అంటూ ప్రకటించాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్...

రోహిత్ శర్మ గాయపడడంతో వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో మూడో వన్డే ఆడనుంది టీమిండియా. కెప్టెన్‌గా కెఎల్ రాహుల్, సౌతాఫ్రికాలో మూడు వన్డేల్లో ఓడాడు. జింబాబ్వేలో వన్డే సిరీస్ గెలవడమే రాహుల్‌కి టీమిండియా వన్డే కెప్టెన్‌గా దక్కిన విజయం...

kuldeep sen

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన కుల్దీప్ సేన్... మొట్టమొదటి మ్యాచ్‌లో 5 ఓవర్లలో 37 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు... వెన్నునొప్పితో ఇబ్బందిపడడంతో తన ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయాడు కుల్దీప్ సేన్...

Image credit: PTI

వెన్నునొప్పి నుంచి కోలుకోకపోవడంతో రెండో వన్డేలో అతను బరిలో దిగలేదు. కుల్దీప్ సేన్ సెలక్షన్‌కి అందుబాటులో లేని కారణంగా అతని స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ని ఆడిస్తున్నట్టు ప్రకటించాడు కెప్టెన్ రోహిత్ శర్మ.. వాస్తవానికి బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపికైన యశ్ దయాల్ గాయపడడంతో కుల్దీప్ సేన్‌కి అవకాశం దక్కింది...

Image credit: Getty

ఏడాదిగా గాయాలతో సహవాసం చేస్తున్న దీపక్ చాహార్ కూడా వన్డే సిరీస్ నుంచి దూరమయ్యాడు. రెండో వన్డేలో 3 ఓవర్లు బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చిన దీపక్ చాహార్, తొడ కండరాలు పట్టేయడంతో మళ్లీ బౌలింగ్‌కి రాలేదు. 

దీపక్ చాహార్ అందుబాటులో లేని కారణంగా సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్ పదేసి ఓవర్లు వేయగా అక్షర్ పటేల్ 7 ఓవర్లు బౌలింగ్ చేశాడు... దీపక్ చాహార్, కుల్దీప్ సేన్ దూరం కావడంతో మూడో వన్డేలో భారత జట్టును బౌలింగ్ కష్టాలు వెంటాడబోతున్నాయి.

రోహిత్ శర్మ స్థానంలో ఆడించేందుకు రజత్ పటిదార్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి  రూపంలో ముగ్గురు బ్యాటర్లు అందుబాటులో ఉన్నారు. అయితే భారత రిజర్వు బెంచ్‌లో కూడా బౌలర్లు లేరు. ఇప్పటికే వన్డే సిరీస్ ఆరంభానికి ముందు మహ్మద్ షమీ... గాయంతో సిరీస్‌కి దూరమయ్యాడు.
 

మహ్మద్ షమీ స్థానంలోనే ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు దీపక్ చాహార్, కుల్దీప్ సేన్ దూరం కావడంతో మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్‌లతో పాటు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, షాబజ్ అహ్మద్‌ల రూపంలో ముగ్గురు స్పిన్నర్లను ఆడించే అవకాశమే ఎక్కువగా ఉంది. 

click me!