యజ్వేంద్ర చాహాల్‌కి చెక్ పెట్టే ఆలోచనలో రోహిత్ శర్మ... మూడు ఫార్మాట్లలోనూ ఆ బౌలర్‌ను ఆడించాలని...

First Published Dec 12, 2021, 5:29 PM IST

విరాట్ కోహ్లీ నుంచి వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ, జట్టుపై తనదైన ముద్ర వేసేందుకు గట్టిగా ప్రయత్నాలు మొదలెట్టేశాడట. అందుకే విరాట్ కోహ్లీ టీమ్‌లో ఉన్న ప్లేయర్లలో కొందరినీ సైడ్ చేసేందుకు రోహిత్ ప్రయత్నిస్తున్నాడని టాక్ వినబడుతోంది...

హర్భజన్ సింగ్ భారత జట్టుకి దూరమైన తర్వాత రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా టీమిండియాకి ప్రధాన స్పిన్నర్లుగా ఉండేవాళ్లు. అయితే చాహాల్, కుల్దీప్ యాదవ్ ఎంట్రీతో వీరిద్దరూ టెస్టులకే పరిమితమయ్యారు..

ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో రవీంద్ర జడేజా తిరిగి మూడు ఫార్మాట్లలోనూ కీలక సభ్యుడిగా మారితే... వన్డే, టీ20ల్లో స్పిన్ బౌలర్‌గా యజ్వేంద్ర చాహాల్, టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్ కొనసాగేవాళ్లు...

అయితే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో యజ్వేంద్ర చాహాల్‌కి చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్‌ని ఏ కారణంతో పక్కనబెట్టారనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే...

ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా, రోహిత్ శర్మ రికమెండేషన్‌తో నాలుగేళ్ల తర్వాత రోహిత్ శర్మకు టీ20 ఫార్మాట్‌లో చోటు దక్కింది. ఈ అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీతో పాటు ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లోనూ మంచి ఎకానమీతో బౌలింగ్ చేసిన అశ్విన్, కీలక సమయాల్లో వికెట్లు కూడా తీశాడు...

‘అశ్విన్ లాంటి ప్లేయర్ దొరకడం ఏ జట్టుకైనా వరమే. ఎందుకంటే అశ్విన్‌ను పవర్ ప్లేలో వాడి, వికెట్లు రాబట్టొచ్చు. మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేయించి, పరుగులను నియంత్రించవచ్చు...

రవి అశ్విన్ ఓ పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్ బౌలర్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎక్కడైనా ఎలా బౌలింగ్ చేయాలో బాగా తెలిసిన బౌలర్... జట్టుకి అలాంటి బౌలర్లే కావాలి...

పవర్ ప్లే ముగిసిన తర్వాతే బౌలింగ్‌కి వచ్చే బౌలర్ల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయలేని, కుడి చేతివాటం బ్యాట్స్‌మెన్‌కి మాత్రమే వేస్తాను, లేదా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు మాత్రమే వేస్తాననే బౌలర్లతో పెద్దగా లాభం ఉండదు...

అందుకే జట్టు అవసరాలకు తగ్గట్టుగా తనని తాను మార్చుకునే బౌలర్, టీమ్‌కి చాలా అవసరం. రవిచంద్రన్ అశ్విన్‌ అలాంటి ప్లేయర్. అతని రీఎంట్రీ సాధారణమైనది కాదు...

నాలుగేళ్ల తర్వాత వైట్ బాల్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చినా, ఇక్కడే ఉండడానికి వచ్చాడు. అశ్విన్‌ను కరెక్టుగా ఎలా వాడుకోవాలో ఆలోచిస్తున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు రోహిత్ శర్మ...

రోహిత్ శర్మ కామెంట్ల ద్వారా ఇన్‌డైరెక్టుగా పవర్ ప్లే ముగిసిన తర్వాతే ఎక్కువగా బౌలింగ్ చేసే యజ్వేంద్ర చాహాల్‌ను విమర్శించాడు. కాబట్టి చాహాల్‌కి రోహిత్ టీమ్‌లో చోటు దక్కడం అనుమానమే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

ఇప్పటికే అరుదైన చైనామెన్ యాక్షన్‌‌తో బౌలింగ్ చేసే కుల్దీప్ యాదవ్‌ని ఎలా వాడుకోవాలో తెలియక, అతన్ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టి జట్టుకి దూరమయ్యేలా చేసింది టీమ్ మేనేజ్‌మెంట్...

ఇప్పుడు యజ్వేంద్ర చాహాల్ కూడా అలాంటి డేంజర్‌లో పడతాడా? అని అనుమానిస్తున్నారు అభిమానులు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కి ఎంపికైన చాహాల్, కేవలం ఆఖరి మ్యాచ్ మాత్రమే ఆడిన విషయం తెలిసిందే.

click me!