ధోనీ లక్కీ కెప్టెన్ అయితే కోహ్లీది బ్యాడ్ లక్... రోహిత్ శర్మ అంతకుమించి...

First Published | Sep 30, 2022, 11:13 AM IST

వరల్డ్ కప్ గెలవాలంటే సత్తా ఉన్న ప్లేయర్లు టీమ్‌లో ఉండడం, మ్యాచులు గెలవడానికి కావాల్సిన వ్యూహాలు రచించగల సామర్థ్యం మాత్రమే ఉండడం సరిపోదు... అంతకుమించి లక్ ఫ్యాక్టర్ తోడవ్వాలి. అదృష్టం లేకపోతే అన్నీ ఉన్నా, హాట్ ఫెవరెట్‌గా టోర్నీలను మొదలెట్టినా రిజల్ట్ మాత్రం తేడా కొట్టేస్తది...

dhoni rohit

కెప్టెన్‌గా తన కెరీర్‌లో మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ ఈ అదృష్టాన్ని జతేసుకుని జట్టులోకి వచ్చాడు. లేకపోతే టీమ్‌లో తన కంటే సీనియర్లు ఎందురున్నా, అందరినీ కాదని టీమిండియా పగ్గాలు, రాంఛీ కుర్రాడికి దక్కేవి కావు...

టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో జోగిందర్ శర్మకు బాల్ అందించినా, మిస్భా వుల్ హక్ అలా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యేవాడు కాదు.. అంతకుమించి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ వంటి మ్యాచ్ విన్నర్లను పుష్కలంగా తన టీమ్‌లో ఆడించగలిగాడు ధోనీ...


విరాట్ కోహ్లీ విషయానికి వచ్చేసరికి ఈ లక్ ఫ్యాక్టర్ అతనికి ఏ మాత్రం కలిసి రాలేదు. ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న విరాట్, టెస్టుల్లో భారత జట్టును ఐదేళ్ల పాటు నెం.1 టీమ్‌గా నిలిపాడు. వన్డేల్లో, టీ20ల్లో అద్భుత విజయాలు అందుకోగలిగాడు...
 

Image credit: PTI

అయితే ఐసీసీ టోర్నీతో పాటు ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేకపోయాడు విరాట్ కోహ్లీ. అందుకే విరాట్‌కి టన్నుల్లో టాలెంట్, కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నా... కూసింత అదృష్టం లేదని కామెంట్లు చేసేవాళ్లు అభిమానులు. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరినా భారత జట్టు, టైటిల్ గెలవలేకపోయిందంటే ఈ లక్ ఫ్యాక్టర్ కలిసి రాకపోవడం కూడా ఓ కారణం...

ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాతావరణం బౌలింగ్‌ టీమ్‌కి అనుకూలంగా మారడం, న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బ్యాటింగ్‌కి అనుకూలంగా మారడం చూసి క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు... ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి వరుణుడు కూడా ఓ కారణం... 

Rohit Sharma

విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న రోహిత్ శర్మకు మరో కథ. ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగ్రేటం చేసిన 13 ఏళ్లకు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు రోహిత్ శర్మ. రాక రాక కెప్టెన్సీ వచ్చిందని సంతోషించేలోపు... ఆటగాళ్ల గాయాలు, రోహిత్‌కి శాపంగా మారాయి.

bumrah

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ గెలుస్తాడని భారీ ఆశలు పెట్టుకున్న రోహిత్, ఆసియా కప్ 2022 టోర్నీని గెలవలేకపోయాడు. ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియా వైఫల్యానికి ఆటగాళ్ల గాయాలే కారణం. జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్, రవీంద్ర జడేజా గాయపడడం, టీమిండియాపై తీవ్రంగా ప్రభావం చూపింది...

Jasprit Bumrah

ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇద్దరు మ్యాచ్ విన్నర్లు లేకుండా బరిలో దిగనుంది టీమిండియా. టోర్నీ ప్రారంభానికి 20 రోజుల ముందే పరిస్థితి ఇలా ఉంటే... మొదలయ్యాక ఇంకా ఎంత మంది గాయపడతారో చెప్పలేని పరిస్థితి...

Image credit: PTI

దీంతో ఐపీఎల్‌లో, ద్వైపాక్షిక సిరీసుల్లో బోలెడంత అదృష్టాన్ని జేబుల్లో పెట్టుకుని తిరిగిన రోహిత్ శర్మ, ఐసీసీ టోర్నీల విషయానికి వచ్చే సరికి అష్ట దరిద్రాలను వెంటేసుకు తిరుగుతున్నాడని... విరాట్ కోహ్లీకి బ్యాడ్ లక్ ఉంటే, రోహిత్‌కి అంతకుమించిదేదో తోడుగా ఉందని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు..
 

Latest Videos

click me!