అది నా హోమ్ గ్రౌండ్.. ప్రపంచకప్‌లో అక్కడ టీమిండియాకు చుక్కలు చూపిస్తా.. పాక్ పేసర్ హెచ్చరిక

First Published Sep 30, 2022, 10:32 AM IST

IND vs PAK:  చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్  తో  భారత్  అక్టోబర్ 23న తొలి మ్యాచ్ ఆడనుంది. టీ20 ప్రపంచకప్ లో ఈ మ్యాచ్ తోనే భారత కప్ వేట  ప్రారంభం కానున్న నేపథ్యంలో పాక్ పేసర్ టీమిండియాకు ముందస్తు హెచ్చరికలు  జారీ చేశాడు. 

వచ్చే నెలలో  ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు  తమ తొలి మ్యాచ్ ను  దాయాది దేశం పాకిస్తాన్ తో ఆడనున్న విషయం తెలిసిందే.  అక్టోబర్ 23న భారత్-పాక్ లు  ప్రఖ్యాత మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో  తలపడతాయి. 
 

ఈ నేపథ్యంలో  మ్యాచ్ కు ఇంకా మూడు వారాల కంటే ఎక్కువ సమయమే ఉన్నా పాకిస్తాన్ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది.  టీ20 ప్రపంచకప్ లో ఆ జట్టుకు ఎంపికైన పేసర్ హరీస్ రౌఫ్.. టీమిండియాకు  మెల్‌బోర్న్ లో చుక్కలు చూపిస్తానంటున్నాడు. మ్యాచ్ కు ముందే  భారత జట్టుకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాడు. 

స్వదేశంలో ఇంగ్లాండ్ తో సిరీస్ ఆడుతున్న  హరీస్  ఆరో టీ20 అనంతరం మాట్లాడుతూ.. ‘అవును. మేం భారత్ తో మ్యాచ్ ద్వారా  మా  ప్రపంచకప్ వేటను మొదలుపెట్టబోతున్నాం. ఈ మ్యాచ్ లో నేను నా బెస్ట్ ఇవ్వగలిగితే  భారత్ నన్ను ఆడటం చాలా కష్టం. ఈ మ్యాచ్ మెల్‌బోర్న్ లో జరుగుతుండటం నాకు ఇంకా సంతోషాన్నిచ్చేదే. 

ఎందుకుంటే అక్కడ నేను  బిగ్ బాష్ లీగ్ లో భాగంగా మెల్‌బోర్న్ ఫ్రాంచైజీ (మెల్‌బోర్న్ స్టార్స్) తరఫున ఆడుతున్నాను. ఒకరకంగా చెప్పాలంటే అది నా హోమ్ గ్రౌండ్. అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు  పూర్తి అవగాహన ఉంది. ఇప్పటికే నేను  టీమిండియాను ఎలా బోల్తా కొట్టించాలనేదానిపై వ్యూహాలు రచిస్తున్నా... 

ఇండియా-పాకిస్తాన్ అంటే ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంలో నేను కూడా చాలా ఒత్తిడికి లోనయ్యా. కానీ ఆసియా కప్ లో మాత్రం ఆ ఒత్తిడి లేదు.  నేను నా బెస్ట్ ఇస్తే ఫలితాలు అవే వస్తాయని నాకు తెలుసు..’ అని   హరీస్ చెప్పుకొచ్చాడు. 

ఐసీసీ టోర్నీలలో భారత్ పై చెత్త రికార్డు కలిగి ఉన్న పాకిస్తాన్.. గతేడాది మాత్రం తన రాతను మార్చుకుంది. దుబాయ్ లో ముగిసిన ఆ మ్యాచ్ లో  టీమిండియాను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఇటీవల ముగిసిన ఆసియా కప్ లో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా   గ్రూప్ స్టేజ్ లో భారత్.. సూపర్-4లో పాకిస్తాన్ గెలిచాయి. 

click me!