బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆసీస్ జట్లు 5 మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను ఆడుతున్నాయి. అయితే, ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భారత్ ఒక మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. రెండు మ్యాచ్ లలో ఘోరంగా ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా అయ్యింది. ఈ నేపథ్యంలో సిడ్నీలో జరుగుతున్న కీలక మ్యాచ్ నుంచి భారత కెప్టెన్ రోహిత్ శర్మ వైదొలిగారు.
ఆస్ట్రేలియా సిరీస్ మొత్తంలో రోహిత్ శర్మ బ్యాటింగ్, కెప్టెన్సీ రెండూ పేలవంగా ఉన్నాయి. దీంతో ఆయన చివరి టెస్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే, రోహిత్ శర్మ స్వయంగా చివరి మ్యాచ్ నుంచి తప్పుకున్నట్లు బీసీసీఐ వర్గాలు చెబెతున్నాయి. దీనికి భిన్నింగా రోహిత్ ను తప్పించారని అంతకుముందు మీడియా కథనాలు పేర్కొన్నాయి. రోహిత్ రిటైర్మెంట్ అంశం కూడా క్రికెట్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.
సీనియర్ స్టార్ ప్లేయర్లపై గంభీర్ ఆగ్రహం
4వ టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఘోర పరాజయంతో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహించి, డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్లతో కోపంగా మాట్లాడినట్లు సమాచారం. సీనియర్ ఆటగాళ్ల పేర్లు ప్రస్తావించకుండా, 'టీమ్ కు సరిగ్గా ఆడేవాళ్లే నాకు కావాలి. సరిగ్గా ఆడని వాళ్లకు నమస్తే చెప్పి బయటకు పంపిస్తా' అని గంభీర్ అన్నట్లు తెలుస్తోంది.
దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ నిరాశలో ఉన్నారనీ, ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అవుతారని వార్తలు వచ్చాయి. క్రికెట్ వర్గాల్లో ఇదే అంశం హాట్ టాపిక్ అయిన క్రమంలో తన రిటైర్మెంట్ గురించి రోహిత్ శర్మ స్వయంగా స్పందించారు.
భారత జట్టు నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నాడా? తప్పించారా?
రోహిత్ శర్మ బ్యాటింగ్
రోహిత్ శర్మ ఏం చెప్పారంటే..
సిడ్నీలో స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ చివరి మ్యాచ్ మాకు చాలా ముఖ్యమనీ, అందుకే తాను జట్టు నుంచి తప్పుకున్నానని రోహిత్ చెప్పారు. ''నేను ఫామ్ లో లేను. పరుగులు చేయలేకపోతున్నా. 5వ టెస్ట్ మ్యాచ్ మాకు చాలా ముఖ్యం. అందుకే నేను చివరి మ్యాచ్ నుంచి తప్పుకున్నా. ఈ విషయం కోచ్, సెలెక్టర్లకు చెప్పా. వాళ్లు అంగీకరించారు'' అని రోహిత్ చెప్పాడు.
అలాగే, 'మెల్ బోర్న్ టెస్ట్ తర్వాత నుంచే ఈ ఆలోచన నా మనసులో ఉంది. ఎక్కువగా రన్స్ చేసినా నేను సంతృప్తి చెందలేదు. అందుకే ఈ మ్యాచ్ నుంచి తప్పుకోవడం ముఖ్యం అనుకున్నా' అని రోహిత్ శర్మ చెప్పారు. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత టెస్ట్ క్రికెట్ కు రిటైర్ అవుతారా అని రోహిత్ ను అడిగారు.
రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ
తన రిటైర్మెంట్ గురించి నెట్టింగ్ హాట్ టాపిక్ నడుస్తున్న క్రమంలో రోహిత్ శర్మ స్పందించారు. 'నేను రిటైర్ అవ్వట్లేదు. చివరి మ్యాచ్ నుంచి మాత్రమే తప్పుకున్నా. ఐదు నెలల తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. ప్రస్తుతం నేను నా ఆట మీదే దృష్టి పెట్టాలనుకుంటున్నా. ఈ సిరీస్ లో నేను రన్స్ చేయలేదు కాబట్టి ఐదు నెలల తర్వాత కూడా రన్స్ చేయలేనని చెప్పలేం. ప్రతిరోజూ జీవితం మారుతుంది. నాపై నాకు నమ్మకముంది' అని రోహిత్ శర్మ తెలిపారు.
అలాగే, 'నేను వాస్తవికంగా ఉండాలనుకుంటున్నా. చాలా కాలంగా ఆడుతున్నా. నేను ఎప్పుడు రిటైర్ అవ్వాలి, ఎప్పుడు బయట కూర్చోవాలి, ఎప్పుడు టీమ్ ను లీడ్ చేయాలి అనేది బయటి వాళ్లు నిర్ణయించలేరు. నేను తెలివైనవాడిని, పరిణతి చెందినవాడిని. ఇద్దరు పిల్లల తండ్రిని. జీవితంలో నాకేం కావాలో నాకు తెలుసు' అని రోహిత్ శర్మ అన్నారు.
రోహిత్ శర్మ తన కెరీర్ చివరి టెస్టు ఆడేశాడా?
బుమ్రాపై రోహిత్ శర్మ ప్రశంసలు
ప్రస్తుతం సిడ్నీలో భారత క్రికెట్ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఈ సిరీస్ లో బుమ్రా తొలి మ్యాచ్ కు కెప్టెన్ వ్యవహరించాడు. జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. డ్రెస్సింగ్ రూమ్ లో జరిగిన దాని గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. 'భారత ఆటగాళ్లు తమ పని బాగా చేస్తున్నారు. బుమ్రా టీమ్ ను బాగా లీడ్ చేస్తున్నాడు. కోచ్, సెలెక్టర్లతో మాట్లాడటం చాలా సులువుగా ఉంది. టీమ్ అవసరాలకు తగ్గట్టుగా అందరం ఆడుతున్నాం' అని అన్నారు.
కాగా, ఫామ్ లేకపోవడంతో భారత కెప్టెన్ సిరీస్ మధ్యలో వైదొలగడం ఇదే మొదటిసారి. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో రోహిత్ శర్మ కేవలం 6 సగటుతో 31 రన్స్ మాత్రమే చేశారు. దీంతో బ్యాటర్ గా, కెప్టెన్ గా తీవ్రమైన ఒత్తిడిలోకి జారుకున్నాడు. ఫ్యాన్స్, మాజీ దిగ్గజాల నుంచి తీవ్ర విమర్శలకు గురయ్యాడు. ఈ క్రమంలోనే కీలకమైన సిడ్నీ టెస్టు నుంచి తప్పుకున్నాడు. భారత జట్టుకు మరింత భారం కాకూడదని భావించాడు.