చెన్నైలో తుఫాన్ సెంచరీతో ధోని రికార్డ్‌ను టార్గెట్ చేసిన రిష‌బ్ పంత్

First Published | Sep 21, 2024, 7:21 PM IST

Rishabh Pant : బంగ్లాదేశ్‌తో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ మ‌రోసారి త‌న ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు. 26 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అద్భుత‌మైన పున‌రాగ‌మ‌నంతో టెస్టుల్లో మ‌రో సెంచ‌రీ కొట్టాడు.
 

Rishabh Pant

Rishabh Pant : చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టీమిండియా స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ బ్యాట్ నుంచి సూప‌ర్ షో క‌నిపించింది. అద్భుత‌మైన బ్యాటింగ్ తో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూ సెంచ‌రీ కొట్టాడు. ఘోర కారు ప్ర‌మాదం త‌ర్వాత టెస్టు క్రికెట్ ఆడుతున్న రిష‌బ్ పంత్ త‌న‌దైన షాట్ల‌తో బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌ను చెడుగుడు ఆడుకున్నాడు. 

శనివారం చెన్నైలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మొదటి టెస్టులో మూడో రోజున రిష‌బ్ పంత్ సూప‌ర్ బ్యాటింగ్ తో 124 బంతుల్లో సెంచరీని సాధించాడు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత టెస్ట్ క్రికెట్‌కు విజయవంతంగా తిరిగి వ‌చ్చి త‌న బ్యాట్  ప‌వ‌ర్ ఎలాంటిదో మ‌రోసారి చూపించాడు. 

రిష‌బ్ పంత్ త‌న సెంచ‌రీ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 4  సిక్సర్లు బాదాడు. క్రీజులో ఉన్నంత సేపు అద్భుత‌మైన షాట్ల‌తో అల‌రించాడు. 56వ ఓవర్లో స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్ చేతిలో పంత్ 109 పరుగుల వద్ద ఔటయ్యాడు. అయితే, పంత్ ఆడిన ఇన్నింగ్స్ తో అనేక రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు. దిగ్గ‌జ ప్లేయ‌ర్ల స‌ర‌స‌న చేరాడు. 


పంత్ కు తోడుగా శుభ్ మ‌న్ గిల్ కూడా సూప‌ర్ బ్యాటింగ్ తో సెంచ‌రీ బాదాడు. శుభ్‌మన్ గిల్ (119* ప‌రుగులు), కేఎల్ రాహుల్ (22* ప‌రుగులు) అజేయంగా నిలవడంతో భారత్ 287/4 ప‌రుగుల‌ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో బంగ్లాదేశ్ ముందు 515 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది భార‌త్.

రిష‌బ్ పంత్ ఈ సూప‌ర్ ఇన్నింగ్స్ కు ముందు చాలా కాలం పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. పంత్ ఘోర ప్ర‌మాదానికి గురి కాక‌ముందు భారతదేశం కోసం డిసెంబర్ 2022లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అది కూడా బంగ్లాదేశ్‌తో మిర్పూర్‌లో జరిగింది. ఆ మ్యాచ్‌లో పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో 93, రెండవ ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ లో భార‌త్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Rishabh Pant-Shubman Gill

ఆ టెస్ట్ జరిగిన కొద్ది రోజులకే అంటే 30 డిసెంబర్ 2022న, ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై రిష‌బ్ పంత్ ఘోర ప్ర‌మాదానికి గుర‌య్యాడు.  అతని మెర్సిడెస్ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో పంత్ అనేక తీవ్ర‌ గాయాలకు గురయ్యాడు. కోలుకోవ‌డానికి అనేక సర్జరీలు చేయించుకున్నాడు. అప్ప‌టి నుంచి దాదాపు ఏడాది కాలం పైగా, 2023లో పూర్తిగా క్రికెట్ ఆడేందుకు దూరమయ్యాడు.

26 ఏళ్ల అతను నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కోలుకుంటూ ప్రాక్టిస్ చేశాడ‌. ఈ ఏడాది మార్చిలో బీసీసీఐ రిష‌బ్ పంత్ ను ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) లో ఆడేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.  దీంతో రిషబ్ పంత్ ఐపీఎల్ తో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కెప్టెన్‌గా క్రికెట్ గ్రౌండ్ లో మ‌ళ్లీ బ్యాట్ ప‌ట్టాడు. ఇక్క‌డ కూడా అద్బుత‌మైన ఇన్నింగ్స్ లు ఆడాడు. 

Rishabh Pant

రిషబ్ పంత్ ఇండియా తరపున ఇప్పటివరకు 33 టెస్టులు ఆడాడు (ఇప్పుడు ఆడుతున్నది 34వ టెస్టు). 56 ఇన్నింగ్స్‌లలో 2271 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. చెన్నైలో జ‌రుగుతున్న భార‌త్-బంగ్లాదేశ్ టెస్టులో సెంచ‌రీ చేసిన త‌ర్వాత పంత్ పై క్రికెట్ వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. 

భార‌త లెజెండ‌రీ ప్లేయ‌ర్ ఎంఎస్ ధోని రికార్డును కూడా రిష‌బ్ పంత్ స‌మం చేశాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత వికెట్ కీపర్లలో పంత్ 6 సెంచ‌రీలు చేశాడు. ఎంఎస్ ధోని కూడా 6 సెంచ‌రీలు చేశాడు.  

పంత్ కు ప్ర‌స్తుతం 34వ టెస్టు కాగా ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ ఇన్ని మ్యాచ్ ల గ‌ణాంకాలు పోలిస్తే.. పంత్ 2,419 పరుగులు చేయగా, ఆసీస్ లెజెండ్ 2,282 పరుగులు మాత్రమే చేశాడు. పంత్ ఆరు టెస్టు సెంచరీలు సాధించగా, గిల్ క్రిస్ట్ 12 హాఫ్ సెంచ‌రీలు సాధించాడు. పంత్ కూడా 11 హాఫ్ సెంచ‌రీలు సాధించాడు. అయితే, రిషబ్ పంత్ (44.80) కంటే గిల్ క్రిస్ట్ మెరుగైన సగటు (58.51) కలిగి ఉన్నాడు.

Latest Videos

click me!