రన్ మిషన్ విరాట్ కోహ్లీ మరో కొత్త రికార్డు - ఏంటో తెలుసా?

First Published | Sep 21, 2024, 11:59 PM IST

Virat Kohli : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో మరో అరుదైన రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్ లో భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా కోహ్లీ సాధించిన ఆ కొత్త రికార్డు ఏంటో తెలుసా? 

Virat Kohli sets new world record in test cricket : రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా భారత్ - బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ  చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో అందరి కళ్లు స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై ఉంది. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా కెప్టెన్ రోహిత్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారించాలని అభిమానులు ఆశించగా, వీరిద్దరూ భారీ ఇన్నింగ్స్ లను ఆడలేకపోయారు.

భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్టులో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 23 పరుగులు చేశాడు. అయితే, ఈ 23 పరుగులు చేసిన కోహ్లీ అంతర్జాతీ క్రికెట్ లో మరో మైలురాయిని అందుకున్నాడు. 

చెన్నై టెస్టులో కోహ్లీ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. అదేంటంటే అంతర్జాతీయ క్రికెట్ లో తక్కువ మ్యాచ్‌ల్లో స్వదేశంలో 12 వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ విషయంలో దిగ్గజ ప్లేయర్లను అధిగమించాడు. ఇంతకుముందు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 267 ఇన్నింగ్స్‌ల్లో 12 వేల పరుగులు పూర్తి చేయగా.. ఈ రికార్డును కోహ్లీ 250 ఇన్నింగ్స్‌లలోనే అధిగమించి చరిత్ర సృష్టించాడు.


247వ ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన కోహ్లీ ఈ రికార్డు సాధించాడు. అతని తర్వాత సచిన్ టెండూల్కర్ (269 ఇన్నింగ్స్‌లు), కుమార్ సంగక్కార (271 ఇన్నింగ్స్‌లు), జాక్వెస్ కలిస్ (275 ఇన్నింగ్స్‌లు), రిక్కీ పాంటింగ్ (281 ఇన్నింగ్స్‌లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అలాగే స్వదేశంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్, రిక్కీ పాంటింగ్, కలిస్, సంగక్కార తర్వాత విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు. 

ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మ‌రో రికార్డును కూడా అధిగ‌మించే ఛాన్స్ ను మిస్స‌య్యాడు.  కోహ్లి ఇప్పటివరకు 26,942 అంతర్జాతీయ పరుగులు చేశాడు. 27,000 అంతర్జాతీయ పరుగులకు అత్యంత వేగంగా పరుగులు చేయడానికి 58 పరుగుల దూరంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పటివరకు 591 ఇన్నింగ్స్‌లు ఆడగా, సచిన్ టెండూల్కర్ 623 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును సాధించాడు.

ఇదిలా వుండ‌గా, గురువారం చెన్నైలో ప్రారంభ‌మైన‌ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో 1వ రోజు పేలవమైన ఇన్నింగ్స్ తర్వాత విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు తిరిగి రావడంలో విఫలమయ్యాడు. ఎంఏ చిదంబరం స్టేడియంలో హసన్ మహమూద్‌కి వికెట్ తీయ‌డానికి ముందు కోహ్లీ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేశాడు.

అంత‌కుముందు, ఈ స్టార్ క్రికెటర్ వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లండ్‌తో జరిగిన టీమిండియా చివరి టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. దులీప్ ట్రోఫీ 2024 మ్యాచ్‌లను కూడా ఆడ‌లేదు. ఇప్పుడు రెడ్-బాల్ క్రికెట్‌లో కోహ్లీ ఫామ్ మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగించింది. ఈ మాజీ కెప్టెన్ 2024లో వైట్-బాల్ క్రికెట్‌లో ఫామ్ కోసం కష్టపడుతున్నాడు.

కాగా, జూన్‌లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోవడానికి కోహ్లీ చిరస్మరణీయమైన నాక్ ఆడాడు. అయితే, ఇది ఈ ఏడాది అతని ఏకైక యాభైకి పైగా స్కోరు. 2023లో సంచలనాత్మక ఇన్నింగ్స్ లో క్రికెట్ లో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు.

అయితే, విరాట్ తన టెస్ట్ రిటర్న్‌లో కేవలం ఆరు పరుగులు చేసిన తర్వాత 2024లో అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ బ్యాటింగ్ సగటు 20 కంటే తక్కువకు పడిపోయింది. అతను ఈ సంవత్సరం మొత్తం 16 ఇన్నింగ్స్‌లలో కేవలం 18.87 సగటుతో కేవలం ఒక యాభై మాత్రమే చేశాడు. అతని అత్యధిక స్కోరు 76 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై సాధించాడు. టీమిండియా ఛాంపియ‌న్ గా నిలిచిన త‌ర్వాత కోహ్లీ టీ20Iల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.

కోహ్లి 2023లో అత్యధిక సగటు అయిన‌ 66.06 సగటుతో కేవలం 36 ఇన్నింగ్స్‌లలో 2048 పరుగులు చేశాడు. కానీ, 2024లో అతని ఫామ్ కోసం తీవ్రంగా క‌ష్ట ప‌డుతున్నాడు. 

Latest Videos

click me!