RCB vs GT: సిరాజ్ మియా విధ్వంసం.. జోస్ బట్లర్ జోరు దెబ్బకు ఆర్సీబీ చిత్తు
RCB vs GT IPL 2025: సొంత గ్రౌండ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గుజరాత్ టైటాన్స్ చిత్తుగా ఓడించింది. సిరాజ్, బట్లర్ అద్భుతమైన ఇన్నింగ్స్ లతో అదరగొట్టారు.
RCB vs GT IPL 2025: సొంత గ్రౌండ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గుజరాత్ టైటాన్స్ చిత్తుగా ఓడించింది. సిరాజ్, బట్లర్ అద్భుతమైన ఇన్నింగ్స్ లతో అదరగొట్టారు.
RCB vs GT IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 14వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గుజరాత్ టైటాన్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్ లో డామినేటింగ్ ఆటతో బెంగళూరును చిత్తుగా ఓడించింది గుజరాత్ టైటాన్స్. జోస్ బట్లర్, సిరాజ్, సాయి సుదర్శన్ సూపర్ షో చూపించారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ టీమ్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. గుజరాత్ కు 170 పరుగుల టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన గుజరాత్ 17.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 170 పరుగులతో టార్గెట్ ను అందుకుంది.
ఆర్సీబీ తరఫున లియామ్ లివింగ్‌స్టోన్ అత్యధికంగా 54 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. అలాగే, జితేష్ శర్మ 33, టిమ్ డేవిడ్ 32 పరుగులు ఇన్నింగ్స్ లతో ఆర్సీబీ 169 పరుగులు చేసింది. మరోసారి విరాటట్ కోహ్లీ నిరాశపరిచాడు. గుజరాత్ తరఫున బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ విధ్వంసం సృష్టించాడు.
అద్భుతమైన బౌలింగ్ తో ఆర్సీబీ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. సిరాజ్ తన 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అతనికి తోడుగా ఆర్ సాయి కిషోర్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీశారు.
గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే మంచి ఆరంభం లభించింది. శుభ్ మన్ గిల్ 14 పరుగుల వద్ద అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు అద్భుమైన నాక్ లు ఆడారు. టాపార్డర్ మంచి ఇన్నింగ్స్ తో గుజరాత్ కు విజయాన్ని అందించారు.
ఓపెనర్ సాయి సుదర్శన్ మరోసారి అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. అయితే, ఒక్క పరుగు దూరంలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. తన 49 పరుగల ఇన్నింగ్స్ లో సాయి సుదర్శన్ 7 ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు.
జోస్ బట్లర్, రూథర్ ఫర్డ్ లు అజేయ ఇన్నింగ్స్ లతో గుజరాత్ కు విజయాన్ని అందించారు. జోస్ బట్లర్ సూపర్ షాట్స్ తో అద్భుతమైన నాక్ ఆడాడు. 39 బంతుల్లో 73 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు. తన హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు.
అతనికి తోడుగా రూథర్ ఫర్డ్ 18 బంతుల్లో 30 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. తన ఇన్నింగ్స్ లో 1 ఫోర్, 3 సిక్సర్లు బాదాడు. బ్యాటింగ్ లో అదరగొట్టలేకపోయిన ఆర్సీబీ బౌలింగ్ లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. భువనేశ్వర్ కుమార్, హాజిల్ వుండ్ లు చెరో ఒక వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో గుజరాత్ టీమ్ పాయింట్ల పట్టికలో 4వ స్థానంలోకి వచ్చింది. బెంగళూరు టీమ్ 4 పాయింట్లతో 3వ స్థానంలోకి పడిపోయింది. టాప్ లో పంజాబ్ కింగ్స్ ఉంది.