మా పాప అలా చేస్తుంటే, ఏడుపు వచ్చేసింది... చారిత్రక సిడ్నీ టెస్టుకి ముందు రవిచంద్రన్ అశ్విన్...

First Published Dec 26, 2021, 3:23 PM IST

టీ20ల యుగంలో టెస్టు ఫార్మాట్‌ అందాన్ని నేటి తరానికి గుర్తు చేసిన టెస్టుల్లో సిడ్నీ టెస్టు ఒకటి. ఈ ఏడాది ఆరంభంతో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి మ్యాచ్ సేవింగ్ ఇన్నింగ్స్‌లు ఆడారు.  

సిడ్నీ వేదికగా జనవరి 7న మొదలైన ఇండియా, ఆస్ట్రేలియా మూడో టెస్టు ఐదు రోజుల పాటు సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 338 పరుగులకి ఆలౌట్ అయ్యింది...

స్టీవ్ స్మిత్ 131 పరుగులు చేసి రనౌట్ కాగా, మార్నస్ లబుషేన్ 91 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రవీంద్ర జడేజాకి నాలుగు వికెట్లు దక్కాయి...

తొలి ఇన్నింగ్స్‌‌లో భారత జట్టు 244 పరుగులకి ఆలౌట్ అయ్యింది. శుబ్‌మన్ గిల్ 50, ఛతేశ్వర్ పూజారా 50 పరుగులు చేసి అవుట్ అయ్యారు.. ఆసీస్‌కి తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. 

రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ 81, లబుషేన్ 73 పరుగులు చేయడంతో  6 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది ఆస్ట్రేలియా. టీమిండియా ముందు 418 పరుగుల భారీ టార్గెట్‌ను పెట్టింది...

రోహిత్ శర్మ 52, శుబ్‌మన్ గిల్ 31, ఛతేశ్వర్ పూజారా 77, రిషబ్ పంత్ 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 

272 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది భారత జట్టు. రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. అయితే గాయంతోనే వికెట్ పడితే బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు జడ్డూ...

అయితే హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ కలిసి వికెట్లకు అడ్డుగా నిలబడ్డారు. 45 ఓవర్ల పాటు వికెట్లకు అడ్డుగా నిలబడి, భారత జట్టుకి చారిత్రక డ్రా మ్యాచ్ అందించారు...

‘సిడ్నీ టెస్టుకి ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో నేను గాయపడ్డాను. ఆ గాయం నన్ను మ్యాచ్ మొత్తం వెంటాడింది. నాలుగో రోజు బౌలింగ్ చేయడానికి ముందు ఫిజియో నితిన్ నాకు హెవీ పెయిన్ కిల్లర్ ఇచ్చాడు...

స్టీవ్ స్మిత్‌కి, లబుషేన్‌కి రెండేసి ఓవర్లు బౌలింగ్ చేశాను. దాంతో నా నొప్పి తీవ్రంగా పెరిగింది. అజింకా రహానేకి, రోహిత్ శర్మకు ముందుగానే చెప్పేశాను...

ఇప్పుడు నన్ను ఆపితే, మళ్లీ బౌలింగ్ చేయలేను. అందుకే బౌలింగ్ కొనసాగించి 14 ఓవర్లు వేశాను. ఆ రాత్రి మొత్తం నొప్పిని భరిస్తూనే నిద్ర లేకుండా గడిపాను...

పడుకోవడానికి కూడా నా నడుము సహకరించలేదు. నా నడుముు కింద టవల్ పెట్టుకుని పడుకున్నా. ఆ తర్వాతి రోజు లేవడానికి కూడా వీలుకాలేదు...

నా పిల్లలు వచ్చి లేపుతున్నారు, కానీ లేవలేకపోతున్నా. ఫిజియోను పిలిచా. వేడినీళ్లతో స్నానం చేశాను. షార్ట్స్ తొడుక్కోవడానికి కూడా వంగడానికి రాలేదు...

మా అమ్మాయి నా షార్ట్స్ తొడిగింది, ఆ నొప్పితో గట్టిగా ఏడ్చేశాను. నా భార్య ఇదంతా చూసి, ఇప్పుడు నువ్వు ఆడడం అవసరమా అని అడిగింది. నేను తప్పదని చెప్పాను...’ అంటూ చెప్పుకొచ్చాడు రవిచంద్రన్ అశ్విన్...

ఓ ఎండ్‌లో హనుమ విహారి, మరో ఎండ్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరూ ఆసీస్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో గాయపడ్డారు. అయినా పట్టువదలకుండా అలాగే బ్యాటింగ్ కొనసాగించారు...

128 బంతులు ఆడి 7 ఫోర్లతో 39 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, 161 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేసిన హనుమ విహారి కలిసి ఆరో వికెట్‌కి 259 బంతుల్లో 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

click me!