ఆసియా కప్ వేదికపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు.. బోర్డు పెద్దలే ఏం మాట్లాడాలో ఆలోచిస్తుంటే ఇంత మాట అన్నాడేంటి..?

First Published Feb 7, 2023, 11:44 AM IST

Asia Cup Row:   బీసీసీఐలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు మినహా   బోర్డులో గానీ, భారత  మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, విమర్శకులు గానీ ఆసియా కప్ వేదికకు సంబంధించిన అంశంలో   ఇంతవరకూ ఏమీ స్పందించలేదు.  

వచ్చే సెప్టెంబర్ లో జరగాల్సి ఉన్న ఆసియా కప్ - 2023ని ఎక్కడ నిర్వహించాలనేదానిపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సభ్య దేశాలలో చర్చోపచర్చలు సాగుతున్నాయి.  ఈ విషయంలో ఇటు  బీసీసీఐ ఒకవైపు అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోవైపు కత్తులు దువ్వుకుంటుండగా  పాక్ మాజీ క్రికెటర్లు  కూడా ఎవరికి  తోచిన విధంగా వాళ్లు   వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.  

అయితే ఈ విషయంలో  బీసీసీఐలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు మినహా   బోర్డులో గానీ, భారత  మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, విమర్శకులు గానీ  ఇంతవరకూ ఏమీ స్పందించలేదు.   ఇరు దేశాల మధ్య  సున్నితాంశం కావడంతో  ఏం మాట్లాడితే ఎటు దారితీస్తుందోనని  అందరూ  కామ్ గా ఉన్నారు.  

కానీ టీమిండియా ఆఫ్ స్పిన్నర్  రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఈ విషయంలో  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆసియా కప్  - 2023 వేదికపై  అశ్విన్  మాట్లాడాడు.   పాకిస్తాన్ లో కాకుంటే దుబాయ్ లో ఈ టోర్నీని నిర్వహించాలని  అభిప్రాయపడుతున్నవారితో అశ్విన్ విభేదించాడు.  

అశ్విన్ మాట్లాడుతూ... ‘నా అభిప్రాయం ప్రకారం ఆసియా కప్ శ్రీలంకకు తరలిపోవచ్చు.   అక్టోబర్ లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ కు ముందు ఇది చాలా కీలకమైన టోర్నీ.  దుబాయ్ లో ఇటీవల కాలంలో చాలా టోర్నీలు జరుగుతున్నాయి.  కానీ  చాలాకాలంగా లంకలో మేజర్ టోర్నీ జరుగలేదు.  ఈ ఆసియా కప్ లంకలో ఆడితే నేను చాలా సంతోషిస్తాను...’ అని అన్నాడు. 
 

ఇక  పాకిస్తాన్ లో ఆసియా కప్ ను నిర్వహిస్తే తాము అక్కడికి వెళ్లబోమన్న   బీసీసీఐ.. అలా అయితే మేము  వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు భారత్ కు రామని  పాకిస్తాన్ చెప్పడంపై  కూడా  అశ్విన్ స్పందించాడు.  ఇలా జరగడం ఇదేం కొత్త కాదని, ఇలా జరగడం చాలా సార్లు చూశామని అశ్విన్ చెప్పాడు.  

ఇదిలాఉండగా ఆసియా కప్ నిర్వహణకు సంబంధించి  పీసీబీ అధ్యక్షుడు  నజమ్ సేథీ,  ఏసీసీ అధ్యక్షుడు జై షా  (బీసీసీఐ సెక్రటరీ)  ఇటీవలే బహ్రెయిన్ లో చర్చలు జరిపారు.   అయితే ఈ చర్చలు సఫలం కాలేదు.   దీంతో వచ్చే నెలలో మళ్లీ ఒకసారి ఏసీసీ సభ్యులు  సమావేశం కానున్నారు.  ఎన్ని సమావేశాలు జరిగినా తాము పాకిస్తాన్ కు వెళ్లే ఛాన్స్ లేదని  బీసీసీఐ స్పష్టం చేసింది. 

click me!