పాకిస్తాన్ ఓడింది.. రమీజ్‌కు మూడింది.. పీసీబీ చీఫ్‌ను తొలగించేందుకు రంగం సిద్ధం..!

First Published Dec 18, 2022, 1:15 PM IST

Pakistan Cricket Board: పాక్ మాజీ  ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అండదండలతో  2021 లో  పీసీబీ   చీఫ్ గా  పదవీ బాధ్యతలు స్వీకరించిన  రమీజ్ రాజాపై నాటి నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. పాక్ మాజీ క్రికెటర్లు అతడి వ్యవహార శైలిపై వరుసగా  విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. 

స్వదేశంలో  వరుసగా సిరీస్ లు కోల్పోతున్నా అవే చెత్త పిచ్ లతో  తాను అబాసుపాలవడమే గాక   అంతర్జాతీయ పాక్ పరువు కూడా తీస్తున్న  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజాకు ఆ పోస్టు నుంచి తప్పించేందుకు రంగం సిద్ధమవుతున్నదా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. 

పాక్ మాజీ  ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అండదండలతో  2021 లో  పీసీబీ   చీఫ్ గా  పదవీ బాధ్యతలు స్వీకరించిన  రమీజ్ రాజాపై నాటి నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. పాక్ మాజీ క్రికెటర్లు అతడి వ్యవహార శైలిపై వరుసగా  విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అదీగాక రమీజ్ హయాంలో పాకిస్తాన్.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతుల్లో అత్యంత దారుణంగా  ఓడి సిరీస్ లను కోల్పోయింది. 
 

సిరీస్ లు కోల్పోవడంతో పాటు అతడి  తీరు పట్ల అసహనంగా ఉన్న  పీసీబీ పెద్దలు (పాకిస్తాన్ ప్రధాని కూడా  పీసీబీలో సభ్యుడే) అతడిని తప్పించేందుకు సిద్ధమయ్యారని  అక్కడి మీడియాలో జోరుగా చర్చ నడుస్తున్నది.  పాక్ ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా  రమీజ్ రాజాను తప్పించడానికే  మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది. 

రమీజ్ ను తప్పించి  ఆ స్థానంలో  పీసీబీ మాజీ చైర్మెన్ నజమ్ సేథీని  నియమించే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.  ఈ  ఊహాగానాలకు  బలాన్ని చేకూర్చేలా నజమ్ ఇటీవలే లాహోర్ లో  ఓ కార్యక్రమానికి హాజరైన  ప్రధాని  షెహబాజ్  షరీఫ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు. దీంతో   ఈ ఇద్దరి మధ్య పీసీబీ  చైర్మెన్ గిరి గురించే చర్చ జరిగిందని పాక్ మీడియా కోడై కూస్తున్నది. 

ఇదే విషయమై పీసీబీ సభ్యుడొకరు మాట్లాడుతూ.. ‘అవును. తెర వెనకాల జరుగుతున్నది కొట్టిపారేయలేకుండా ఉన్నది.  బయట వినిపిస్తున్న రూమర్స్ ను బలం చేకూర్చేలా ఇటీవలే   నజమ్  సేథీ  ప్రధానిని కలవడం వెనుక ఆంతర్యం కూడా ఇదే.  కొద్దిరోజుల్లోనే  రమీజ్  పీసీబీ చైర్మన్ పదవికి శుభంకార్డు పడనుంది..’అని  నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

ఇక  రమీజ్ తొలగింపునకు తెరవెనుక మంత్రాంగం జోరుగా సాగుతున్నది. ఇప్పటికే పాకిస్తాన్ న్యాయ మంత్రిత్వ శాఖ.. రమీజ్ రాజా ను ఆ పదవి నుంచి తొలగించాలని  ప్రధాని షరీఫ్  ను కోరిందట.  దీనిపై ఆయన త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అన్నీ కుదిరితే  న్యూజిలాండ్ సిరీస్ కు ముందే  రమీజ్ ను తొలగించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నాయి పీసీబీ  వర్గాలు. 

click me!