ఒకే ఒక్క విజయంతో రోహిత్‌కి సాధ్యంకాని రికార్డు కొట్టేసిన కెఎల్ రాహుల్... ధోనీ, కోహ్లీ, రహానేలతో...

First Published Dec 18, 2022, 11:35 AM IST

2022 ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికా పర్యటనకి వెళ్లింది భారత జట్టు. ఆ సిరీస్‌కి టెస్టులకు వైస్ కెప్టెన్‌గా, వన్డేలకు కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ, టోర్నీ ఆరంభానికి ముందు గాయంతో తప్పుకున్నాడు. దీంతో లక్కీగా టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ, వన్డేల్లో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు కెఎల్ రాహుల్...

బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంతో టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్న విరాట్ కోహ్లీ... సెంచూరియన్ టెస్టు విజయం తర్వాత జోహన్‌బర్గ్ టెస్టులో ఆడలేదు. అప్పటిదాకా టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడని జోహన్‌బర్గ్‌లో కెప్టెన్‌గా ఎంట్రీ ఇచ్చాడు కెఎల్ రాహుల్..

KL Rahul

జోహన్‌బర్గ్‌లో టీమిండియా చిత్తుగా ఓడింది. ఆ తర్వాత వన్డే సిరీస్‌లోనూ 3-0 తేడాతో వైట్ వాష్ అయ్యింది భారత జట్టు. రోహిత్ శర్మ ఒక్కడు మినహా జస్ప్రిత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, సూర్యకుమార్ యాదవ్ టాప్ క్లాస్ ప్లేయర్లు అందరూ ఉన్నా ఒక్క విజయం అందుకోలేకపోయాడు కెఎల్ రాహుల్...

కెప్టెన్సీ లక్షణాలు ఏ కోశాన కనిపించడం లేదని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కెఎల్ రాహుల్, 2022 ఏడాది చివరన డిసెంబర్‌లో కెప్టెన్‌గా బంగ్లాదేశ్‌పై టెస్టు మ్యాచ్ గెలిచి లెజెండరీ కెప్టెన్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు...

Kuldeep Yadav

రోహిత్ శర్మ గాయం కారణంగా స్వదేశానికి పయనం కావడంతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు కెఎల్ రాహుల్. ఈ మ్యాచ్‌లో బంగ్లాపై 188 పరుగుల తేడాతో గెలిచి టీమిండియా ఘన విజయం అందుకుంది. కెప్టెన్‌గా రాహుల్‌కి దక్కిన తొలి టెస్టు విజయం ఇదే...

ఈ విజయంతో విదేశాల్లో టెస్టు, వన్డే, టీ20 విజయాలు అందుకున్న ఐదో భారత కెప్టెన్‌గా నిలిచాడు కెఎల్ రాహుల్. ఇంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, అజింకా రహానే మాత్రమే విదేశాల్లో మూడు ఫార్మాట్లలో విజయాలు అందుకోగలిగారు...

KL Rahul

జింబాబ్వే టూర్‌లో కెప్టెన్‌గా వన్డే సిరీస్ గెలిచిన కెఎల్ రాహుల్, ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘాన్‌పై టీ20 విజయం అందుకున్నాడు. బంగ్లాదేశ్‌తో మూడో వన్డేకి కెప్టెన్‌గా వ్యవహరించిన ఘన విజయం అందుకున్న కెఎల్ రాహుల్, తొలి టెస్టులో విజయం దక్కించుకున్నాడు...

పేరుకి టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నా... ఇప్పటిదాకా విదేశాల్లో ఒక్క టెస్టుకి కూడా కెప్టెన్సీ చేయలేదు రోహిత్ శర్మ. రోహిత్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన సౌతాఫ్రికా టూర్‌కి, ఇంగ్లాండ్ టూర్‌లో జరిగిన ఐదో టెస్టుకి గాయాలతో దూరమయ్యాడు రోహిత్...

బొటనవేలి గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ, రెండో టెస్టులో ఆడే అవకాశం ఉంది. ఢాకాలో డిసెంబర్ 22 నుంచి జరిగే ఈ టెస్టులో రోహిత్ శర్మ ఆడి, విజయాన్ని అందుకుంటే ఈ లిస్టులో చేరతాడు.అయితే కెఎల్ రాహుల్ తర్వాతే రోహిత్ ఈ ఫీట్ సాధించినట్టు అవుతుంది.

click me!