రాహుల్ ద్రావిడ్‌కి రెస్ట్... ఇంగ్లాండ్‌తో తొలి టీ20కి హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్...

First Published Jul 4, 2022, 7:34 PM IST

ఐర్లాండ్‌తో పర్యటించిన భారత జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు భారత మాజీ క్రికెటర్, ఎన్‌సీఏ ప్రస్తుత డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్. ఐర్లాండ్ నుంచి ఇంగ్లాండ్‌‌కి వచ్చిన భారత జట్టు, ఇంగ్లాండ్‌తో నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత టీ20, వన్డే సిరీస్‌ ఆడనుంది...

జూలై 5న ఇంగ్లాండ్‌, ఇండియా మధ్య నిర్ణయాత్మక ఐదో టెస్టు ఫలితం తేలనుంది. ఇప్పటికే మొదటి నాలుగు టెస్టుల్లో రెండు టెస్టులు గెలిచి, ఓ టెస్టు డ్రా చేసుకున్న టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఒకవేళ భారత జట్టు విధించిన 377 పరుగుల భారీ టార్గెట్‌ని ఇంగ్లాండ్ ఛేదిస్తే... టెస్టు సిరీస్ 2-2 తేడాతో సమం అవుతుంది...

Image Credit: Getty Images

ఈ టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక్క రోజు గ్యాప్‌లో ఇంగ్లాండ్ వైట్ బాల్ టీమ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది భారత జట్టు. సౌతింప్టన్ వేదికగా జరిగే తొలి టీ20 మ్యాచ్‌కి విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా వంటి ప్లేయర్లు దూరంగా ఉంటున్నారు...

సౌంతిప్టన్‌లో తొలి టీ20 మ్యాచ్ ఆడిన తర్వాత రెండో టీ20 కోసం బర్మింగ్‌హామ్‌కే రానుంది టీమిండియా. టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌‌లో ఉండే భారత ప్లేయర్లు, రెండో టీ20లో భారతజట్టుతో కలుస్తారు... ఈ కారణంగానే తొలి టీ20లో ఉన్న సంజూ శాంసన్, ఆవేశ్ ఖాన్, రాహుల్ త్రిపాఠి, వెంకటేశ్ అయ్యర్‌ వంటి ప్లేయర్లకు మిగిలిన రెండు టీ20ల్లో చోటు కల్పించలేదు సెలక్టర్లు...

కరోనా బారిన పడి కోలుకున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా కోలుకున్నప్పటికీ ఇప్పటిదాకా ఎడ్జ్‌బాస్టన్‌లోనే ఉన్నాడు. దీంతో అతను తొలి టీ20 కోసం సౌంతిప్టన్‌ వెళ్తాడా? లేక ఫిట్‌నెస్ సాధించడం కోసం ఆ మ్యాచ్‌కి దూరంగా ఉంటాడా? అనే అనుమానాలు రేగుతున్నాయి...

Image credit: Getty

అయితే ప్రధాన జట్టుతో ఉన్న హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా తొలి టీ20 మ్యాచ్‌కి అందుబాటులో ఉండడం లేదు. టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత బర్మింగ్‌హామ్‌లోనే ఉండే ద్రావిడ్, రెండో టీ20కి భారత జట్టుతో కలవబోతున్నాడని సమాచారం...

దీంతో ఐర్లాండ్ టూర్‌లో టీ20 సిరీస్‌కి టీమిండియా హెడ్ కోచ్‌గా వ్యవహరించిన భారత మాజీ క్రికెటర్, ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్... సౌంతిప్టన్‌ టీ20కి భారత హెడ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నాడట. అయితే దీనిపై ఇప్పటిదాకా అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు..

ఐర్లాండ్ టూర్‌లో హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ వంటి ప్లేయర్లకు మార్గనిర్దేశకత్వం చేసిన వీవీఎస్ లక్ష్మణ్, తొలి టీ20కి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తే... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి పనిచేయబోతున్నాడు..

click me!