మాహీ రికార్డులు బ్రేక్ చేస్తున్న రిషబ్ పంత్... ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రికార్డు ఫీట్...

First Published Jul 4, 2022, 5:37 PM IST

‘కేజీఎఫ్’ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ‘ఎవ్వడ్రా అల్లాటప్పా రౌడీలను కొట్టి డాన్ అయ్యానని చెప్పింది. నేను ఇప్పటిదాకా కొట్టిన ప్రతీవోడు డాన్‌యే...’ అని. ఈ డైలాగ్, ఇప్పుడు రిషబ్ పంత్‌కి కరెక్ట్‌గా సెట్ అవుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి... సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్ వంటి లెజెండ్స్ రికార్డులను చెరిపేసిన రిషబ్ పంత్, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ బాది సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో 349 పరుగులు చేసిన రిషబ్ పంత్, విదేశాల్లో టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఇంతకుముందు 2014లో ధోనీ, ఇంగ్లాండ్ టూర్‌లో సరిగ్గా 349 పరుగులు చేయగా రిషబ్ పంత్ 349 పరుగులతో నిలిచాడు. ఇంతకుముందు ఆస్ట్రేలియా టూర్‌లో 350 పరుగులు చేసిన రిషబ్ పంత్, ఈ జాబితాలో టాప్‌లో ఉన్నాడు... 

తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులు చేసిన రిషబ్ప పంత్, రెండో ఇన్నింగ్స్‌లో 50+ స్కోరు చేశాడు. విదేశాల్లో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో 50+ స్కోరు చేసిన మొట్టమొదటి భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు రిషబ్ పంత్. 

ఇంతకుముందు భారత వికెట్ కీపర్లు ఎవ్వరూ విదేశాల్లో ఈ ఫీట్ సాధించలేకపోగా, స్వదేశంలో ఒకే ఒక్క భారత వికెట్ కీపర్ ఈ ఫీట్ సాధించాడు. 1973లో భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్, ముంబైలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 121, రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేశాడు.

ఇంగ్లాండ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 50+ స్కోర్లు చేసిన భారత వికెట్ కీపర్‌గా ఎమ్మెస్ ధోనీ రికార్డును సమం చేశాడు రిషబ్ పంత్. ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో 200+ పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు రిషబ్ పంత్...

విరాట్ కోహ్లీ 4 ఇన్నింగ్స్‌ల్లో 231 పరుగులు చేసి టాప్‌లో ఉండగా సునీల్ గవాస్కర్ 6 ఇన్నింగ్స్‌ల్లో 216 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. కేవలం 2 ఇన్నింగ్స్‌ల్లో 203 పరుగులు చేసిన రిషబ్ పంత్, ఆ ఇద్దరి తర్వాతి స్థానంలో నిలిచాడు..

ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో 200లకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి ప్రత్యర్థి వికెట్ కీపర్‌గా నిలిచాడు రిషబ్ పంత్. ఇంతకుముందు ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఎమ్మెస్ ధోనీ, కుమార సంగర్కర వంటి ఏ వికెట్ కీపర్ కూడా ఇంగ్లాండ్‌లో ఈ ఫీట్ సాధించలేకపోయారు...

ఐదు, అంతకంటే కింద బ్యాటింగ్‌కి వచ్చి ఇంగ్లాండ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో 50+ స్కోరు చేసిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు రిషబ్ పంత్. ఇంతకుముందు 1967లో పటౌడీ, 1990లో సచిన్ టెండూల్కర్ ఈ ఫీట్ సాధించారు..

click me!