పూజారాకి ఎలా ఆడాలో తెలుసు, టెస్టుల్లో స్లోగా బ్యాటింగ్ చేస్తే తప్పేంటి... - అజింకా రహానే...

First Published Aug 24, 2021, 4:38 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత జట్టు, అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో అదరగొడుతోంది. అయితే టీమిండియాను ఇబ్బందిపెడుతున్న ఒకే ఒక్క విషయం... ఫ్యాబ్ త్రీ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే ఫామ్...

ఛతేశ్వర్ పూజారా నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 70 పరుగులు చేస్తే, అజింకా రహానే మూడు ఇన్నింగ్స్‌ల్లో 67, విరాట్ కోహ్లీ 62 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచారు. లోయర్ ఆర్డర్‌లో వచ్చే షమీ, బుమ్రా వీరికంటే మెరుగ్గా పరుగులు చేయడం విశేషం...

లార్డ్స్ టెస్టులో కీలకమైన మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత అజింకా రహానే 146 బంతుల్లో 61 పరుగులు, ఛతేశ్వర్ పూజారా 206 బంతుల్లో 45 పరుగులు చేసి... నాలుగో వికెట్‌కి అమూల్యమైన శతాధిక భాగస్వామ్యం అందించారు...

అయితే ఈ 100 పరుగుల భాగస్వామ్యం నమోదుచేయడానికి దాదాపు 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశారు అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ వచ్చింది...

‘జనాలు, నా గురించి మాట్లాడుకుంటున్నారంటే నాకు చాలా సంతోషం. ఎందుకంటే జనాలు ఎప్పుడూ కూడా ముఖ్యమైన వ్యక్తుల గురించే కదా మాట్లాడుకుంటారు. నేను అందులో ఒకడిని అనేగా...

నేను ఇవన్నీ పట్టించుకోను. జట్టుకి నా వంతు సహకారం అందించడమే నా ప్రధాన లక్ష్యం. భారత జట్టుకి ఆడడమే చాలా గొప్ప విషయం. అందుకే ఇలాంటి ట్రోల్స్‌ను పట్టించుకోని, అలాంటి గొప్ప అవకాశాన్ని తక్కువ చేయలేను...

నేనెప్పుడూ నా ఆటను సమీక్షించుకుంటూనే ఉంటాను. జట్టు గెలిచినప్పుడు, అందులో నావంతు పాత్ర ఎంత? జట్టు ఓడినప్పుడు, ఆ ఓటమి నుంచి తప్పించేందుకు నేనెంత ప్రయత్నించానని లెక్కవేసుకుంటాను. నా పర్ఫామెన్స్ నాకు సంతృప్తినిస్తే చాలు...

లార్డ్స్ టెస్టులో మూడు వికెట్లు పడేసరికి భారత జట్టుకి 50 పరుగుల ఆధిక్యం కూడా లేదు. ఆ ఆధిక్యాన్ని సాధ్యమైనంత పెంచడంపైనే ఫోకస్ పెట్టాం. టెస్టుల్లో ఎన్ని ఓవర్లు బ్యాటింగ్ చేశామనేది అసలు విషయమే కాదు...

ఛతేశ్వర్ పూజారా చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడని అంటున్నారు. అయితే నా ఉద్దేశంతో అతను చేసినవి 45, 46 పరుగులే కావచ్చు. అయితే అతను 200+ బంతులు ఎదుర్కొన్నాడు. అది చాలా విలువైన విషయం...

పూజారా, నేను కలిసి చాలా ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాం. ఒత్తిడిని ఎలా అధిగమించాలో మాకు బాగా తెలుసు. ఓ భాగస్వామ్యం నిర్మించేటప్పుడు కొంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది...

మాలో ఎవ్వరికీ లీడ్స్‌లో ఆడిన అనుభవం లేదు. అయితే ఇంగ్లాండ్‌లో లైన్ అండ్ లెంగ్త్ చాలా అవసరం. బౌలర్లు దీన్ని చూసుకుని బౌలింగ్ చేయాలి. బ్యాట్స్‌మెన్ కూడా లైన్ అండ్ లెంగ్త్‌కి తగ్గట్టుగా బ్యాటింగ్ చేయాలి...

శార్దూల్ ఠాకూర్ గాయం నుంచి కోలుకున్నాడు. అతను మూడో టెస్టులో బరిలో దిగొచ్చు. ఆటగాళ్లపై భారం పడకుండా రొటేషన్‌‌ని పాటించాల్సిన అవసరం ఉంది. ఫాస్ట్ బౌలర్లు అందరూ అద్భుతంగా రాణిస్తుండడం టీమిండియాకి కలిసొచ్చే అంశం...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత టెస్టు వైస్ కెప్టెన్ అజింకా రహానే...

click me!