టీమ్‌లో అందరూ శార్దూల్‌ను అలా అంటారు.. కుల్దీప్ మాకు చాలా కీలకం.. మూడో వన్డే హీరోలపై రోహిత్ ప్రశంసలు

First Published Jan 25, 2023, 12:50 PM IST

ఇండోర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ముగిసిన మూడో వన్డేలో భారత్ ఘన విజయాన్ని అందుకుంది.  తొలుత బ్యాటింగ్ లో అదరగొట్టిన భారత్.. బౌలింగ్ లో కాస్త తడబడ్డా  మళ్లీ పుంజుకుని  కివీస్ ను చిత్తు చేసింది. 

టీమిండియా  పేసర్ శార్దూల్ ఠాకూర్ ను  అతడి ఫ్యాన్స్ తో పాటు టీమ్ లో పలువురు ‘లార్డ్’ అని పిలుస్తుంటారన్న విషయం తెలిసిందే.   పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఇంకా తంటాలు పడుతున్నా టెస్టులలో  శార్దూల్  రెచ్చిపోతాడు. కీలక సమయంలో వికెట్లు తీసి భారత్ కు విజయాలు అందించడంలో  ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. 

నిన్న న్యూజిలాండ్ తో మ్యాచ్ లో కూడా శార్దూల్  సూపర్ స్పెల్ తో  ఆ జట్టు కోలుకోలేదు. ధాటిగా ఆడుతూ  కివీస్ ఇన్నింగ్స్ ను ముందుకునడిపిస్తూ లక్ష్యం దిశగా సాగుతున్న ఆ జట్టును  దెబ్బతీసింది శార్దూలే.  సెంచరీ హీరో  కాన్వేతో కలిసి  మ్యాచ్ లో పోరాడుతున్న  డారిల్ మిచెల్ ను ఔట్ చేసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు.  

కివీస్ ఇన్నింగ్స్ 26వ ఓవర్లో  తొలి బంతికి మిచెల్ ను ఔట్ చేసిన శార్దూల్.. తర్వాత బంతికి కెప్టెన్ టామ్ లాథమ్ ను డకౌట్ చేశాడు.  తన తర్వాతి ఓవర్లో  ప్రమాదకర గ్లెన్ ఫిలిప్స్ ను కూడా  బోల్తా కొట్టించాడు.  శార్దూల్ ఇచ్చిన షాకులతో  కివీస్ తర్వాత కోలుకోలేకపోయింది.  శార్దూల్ ఇచ్చిన బ్రేక్ ను వినియోగించుకున్న కుల్దీప్ కూడా  కివీస్ కీలక ఆటగాడు  బ్రాస్‌వెల్ ను ఔట్ చేశాడు. ఆ తర్వాత లోయరార్డర్ పని కూడా పట్టాడు. 

మ్యాచ్ అనంతంర ఈ ఇద్దరిపై   రోహిత్  ప్రశంసలు కురిపించాడు.  రోహిత్ మాట్లాడుతూ... ‘మేం చేసింది భారీ స్కోరే అయినా ఈ గ్రౌండ్ లో అది సరిపోదని మాకు తెలుసు.   మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు.  శార్దూల్ చాలాకాలం నుంచి టీమ్ లో ఉన్నాడు. 

ఇలాంటి పరిస్థితులను గతంలో కూడా చూశాడు. జట్టులో అందరూ అతడిని మెజిషీయన్ అంటారు.  ఏదో మాయ చేస్తాడని  మా నమ్మకం. అనుకున్నట్టుగానే మ్యాచ్ లో కూడా మాయ చేశాడు. అతడు ఇలాంటి  మ్యాచ్ లు మరిన్ని గెలిపించాలి. 

ఇక కుల్దీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి.  నేను కుల్దీప్ కు ఎప్పుడు బంతినిచ్చినా అతడు వికెట్ తీస్తున్నాడు.   గత ఆరు వన్డేలలో  అతడు కీలకంగా వ్యవహరించాడు. మణికట్టు స్పిన్నర్ల వల్ల ఉండే అడ్వాంటేజ్ అది...’అని చెప్పాడు.  కీలక సిరీస్ లు ముందుండటంతోనే సిరాజ్, షమీకి రెస్ట్ ఇచ్చి చాహల్, ఉమ్రాన్ లకు ఛాన్స్ ఇచ్చామని  వాళ్లు కూడా వారికిచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్నారని రోహిత్ తెలిపాడు.

click me!