కోహ్లీ కంటే నేనే తోపును.. కానీ నన్నెవరూ పట్టించుకోవడం లేదు : పాక్ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు

First Published Jan 25, 2023, 12:08 PM IST

Virat Kohli: ఆధునిక క్రికెట్ లో  దిగ్గజంగా వెలుగొందుతున్న  టీమిండియా  వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కంటే తనే గొప్ప బ్యాటర్ ను అంటున్నాడు ఓ పాకిస్తాన్  క్రికెటర్.  పాక్ క్రికెట్ లో రాజకీయాల వల్ల తాను టీమ్ లోకి రాలేకపోయానని  వాపోతున్నాడు. 

క్రికెట్ లో ప్రతీ  పది పదిహేనేండ్లకు తరం మారుతుంది.  సీనియర్లు రిటైర్ అయిపోయి  జూనియర్లు వస్తుంటారు. ఇలా వచ్చిపోయే క్రమంలో ఆటపై తీవ్ర ప్రభావం చూపిన  కొంతమంది దిగ్గజాలు మాత్రం  చరిత్రలో చిరకాలం నిలిచిపోతారు. క్రికెట్ నుంచి తప్పున్నా వారి ముద్ర  ఆ ఆట మీద ఉంటుంది. 

క్రికెట్ లో అలాంటి పేర్లు సంపాదించుకున్నవారిలో  డాన్ బ్రాడ్‌మన్, వివ్ రిచర్డ్స్, సునీల్ గవాస్కర్,  వసీం అక్రమ్,   సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్ వంటి వాళ్లు అగ్రగణ్యులు. వాళ్లు క్రికెట్ ఆడే సమయంలోనే గాక తర్వాత తరాలకు కూడా వీళ్లు మార్గనిర్దేశకులయ్యారు. 

ఆధునిక కాలంలో ఈ జాబితాలో చేర్చదగ్గ ఆటగాడు విరాట్ కోహ్లీ.   గడిచిన దశాబ్దంన్నర కాలంగా కోహ్లీ.. భారత జట్టుకే గాక ప్రపంచ క్రికెట్ కు అందిస్తున్న సేవలు  ఎనలేనివి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది  మంది అభిమానులను సంపాదించుకున్న  కోహ్లీకి.. తన ఆటతో శత్రు దేశం పాకిస్తాన్ లో కూడా అభిమానులు ఉన్నారు. అయితే అదే దేశానికి చెందిన ఓ క్రికెటర్ మాత్రం తాను కోహ్లీ కంటే గొప్ప బ్యాటర్ ను అని.. తన రికార్డులే దానికి సాక్ష్యమని అంటున్నాడు.  

తాను కోహ్లీ కంటే గ్రేట్ అంటున్న క్రికెటర్ పేరు ఖుర్రం  మంజూర్. కరాచీకి చెందిన ఈ  38 ఏండ్ల  బ్యాటర్.. లిస్ట్ ఏ క్రికెట్ లో తన రికార్డులు  కోహ్లీ కంటే గొప్పగా ఉన్నాయని వాపోయాడు.  ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో   ఖుర్రం ఈ వ్యాఖ్యలు చేశాడు. ఖుర్రం మాట్లాడుతూ.. ‘నన్ను నేను కోహ్లీతో పోల్చుకోవడం లేదు.  కానీ వాస్తవం ఏమిటంటే 50 ఓవర్ల క్రికెట్ లో  టాప్ 10 లో ఎవరున్నా  నేను మాత్రం నెంబర్ వన్ బ్యాటర్ ను. లిస్ట్ ఏ క్రికెట్ లో నా రికార్డులు కోహ్లీ కంటే బెటర్ గా ఉన్నాయి. కోహ్లీ ప్రతీ ఆరు ఇన్నింగ్స్ కు ఒక సెంచరీ చేస్తే  నేను  5.68 ఇన్నింగ్స్ కే చేస్తున్నాను. 

అంతేగాక నా బ్యాటింగ్ సగటు  53. అది నిలకడగా కొనసాగుతోంది. గడిచిన పదేండ్లుగా నేను దానిని మెయింటెన్ చేస్తున్నాను. ప్రపంచ లిస్ట్ ఏ క్రికెట్ ర్యాంకింగ్స్ లో  నేను ఐదో స్థానంలో ఉన్నాను. గడిచిన 48 ఇన్నింగ్స్ లలో నేను 24 సెంచరీలు చేశాను.  2015 నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్  అంతర్జాతీయ టీమ్ కు ఆడిన ఓపెనర్లందరికంటే నేను చేసిన పరుగులే ఎక్కువ. 

ఇక పాకిస్తాన్  క్రికెట్ నిర్వహించే నేషనల్ టీ20 లో కూడా  నేనే లీడింగ్ స్కోరర్ ను.  అయినా  నన్ను జాతీయ జట్టులోకి తీసుకోరు.  అసలు నన్ను ఎందుకు పక్కనబెడుతున్నారో ఇంతవరకు నాకు ఒక్కరు కూడా సరైన  సమాధానం చెప్పలేదు...’ అని వాపోయాడు.ఇదిలాఉండగా.. కోహ్లీ-ఖుర్రంలు ఆసియా కప్ లో ఓసారి ప్రత్యర్థులుగా నిలిచారు. ఆ మ్యాచ్ లో కోహ్లీ.. ఖుర్రంను రనౌట్ చేశాడు.  

ఖుర్రం లిస్ట్ ఏ క్రికెట్ లో  భాగంగా  166 మ్యాచ్ లు ఆడి  7,992 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు ఉన్నాయి.  అంటే ప్రతి 6.11 ఇన్నింగ్స్ కు ఒక సెంచరీ ఉంది.    ఈ క్రమంలో అతడి సగటు 53.42గా ఉంది.  అంతర్జాతీయ క్రికెట్ లో అతడు పాక్ తరఫున 16 టెస్టులు,  7 వన్డేలు,  3 టీ20లు ఆడాడు. టెస్టులలో ఓ   సెంచరీ కూడా చేశాడు. 

ఇక  కోహ్లీ తన వన్డే కెరీర్ లో   270 మ్యాచ్ లు ఆడి 12,773 పరుగులు చేశాడు. బ్యాటింగ్ సగటు  57.79గా  ఉండగా  46 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలూ ఉన్నాయి.  ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కోహ్లీ..  136 మ్యాచ్ లలో 10,368  రన్స్ చేశాడు.  బ్యాటింగ్ సగటు 52.73గా ఉండగా  34 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలూ ఉన్నాయి. 
 

click me!