రేపు ఏసీసీ ఎమర్జెన్సీ మీటింగ్.. ఆసియా కప్ వేదికపై తేలనున్న స్పష్టత..?

First Published Feb 3, 2023, 6:57 PM IST

Asia Cup 2023: ఈ ఏడాది సెప్టెంబర్ వేదికగా జరుగబోయే  ఆసియా కప్ కు పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చే విషయంలో  శనివారం  (ఫిబ్రవరి 4న) కీలక సమావేశం జరుగనున్నది.  ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చకు రానున్నాయి. 

గత కొంతకాలంగా  భారత్, పాకిస్తాన్ ల మధ్య  తీవ్ర వివాదంగా మారిన  ఆసియా కప్ - 2023 వేదికపై  త్వరలోనే స్పష్టత రానున్నదా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ ఈ  ఏడాది సెప్టెంబర్ లో పాకిస్తాన్ వేదికగా  జరగాల్సి ఉంది.  

కానీ  సరిహద్దు వివాదాలు, భద్రతా సమస్యల కారణంగా.. పాకిస్తాన్ లో ఈ టోర్నీని నిర్వహిస్తే తాము పాల్గొనబోమని, తటస్థ వేదిక అయితేనే తాము ఆడతామని  బీసీసీఐ కార్యదర్శి జై షా గతేడాది టీ20 ప్రపంచకప్ సమయంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.   జై షా వ్యాఖ్యలకు  పాక్ కూడా ధీటుగానే బదులిచ్చింది.  ఆసియా కప్ ఆడటానికి పాకిస్తాన్ కు రాకుంటే  2023లో జరిగే వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు తాము ఇండియాకు   వెళ్లమని తెలిపింది.

ఈ అంశం   ఇరు బోర్డుల వరకే పరిమితం కాకుండా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కూడా  స్పందించాల్సి వచ్చింది.  ఆ తర్వాత ఇరు బోర్డులు పలు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాయి. అయితే  పీసీబీకి కొత్త అధ్యక్షుడు (నజమ్ సేథీ) వచ్చాక  ఆ బోర్డు  దీనిపై  ప్రత్యేక దృష్టి కనబరుస్తోంది. గత నెలలో  దుబాయ్ లో ప్రారంభమైన  ఇంటర్నేషనల్ లీగ్ టీ20 ఓపెనింగ్  సందర్భంగా  ఆసియా కప్ విషయమై  తాను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రెసిడెంట్ జై షా తో చర్చిస్తానని చెప్పాడు. అయితే  అప్పుడు ఈ మీటింగ్ జరుగలేదు. 

కానీ తాజాగా నజమ్ సేథీ.. ఏసీసీ ఎమర్జెన్సీ మీటింగ్ కు  పిలుపునిచ్చారు. బహ్రెయిన్ వేదికగా రేపు ఈ సమావేశం జరుగనున్నది.  ఈ మీటింగ్  లో ప్రధాన ఎజెండా  ఆసియా కప్ - 2023  ను ఎక్కడ నిర్వహించాలన్నదే  పాకిస్తాన్ క్రికెట్ వర్గాల వాదన.  ఇదే విషయమై సభ్య దేశాలతో పాటు జై షా తోనూ నజమ్ సేథీ  చర్చించనున్నట్టు సమాచారం.  

అయితే  పాకిస్తాన్ లో  జరిగితే తాము వచ్చే సమస్యే లేదంటున్న  భారత్.. నజమ్ సేథీ  చెప్పే వివరణలకు  కన్విన్స్ అవుతుందా..?  టీమిండియాను పాకిస్తాన్ కు పంపిస్తుందా..? అన్నది  తేలాల్సి ఉంది. నజమ్ సేథీ  ఎంత  మొత్తుకున్నా  ఏసీసీ ఆయన వాదనలు  పరిగణనలోకి తీసుకునే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.  

పాకిస్తాన్ కాకుండా తటస్థ వేదికలో నిర్వహిస్తే  తమకేమీ అభ్యంతరం లేదని భారత్ బల్లగుద్ది చెబుతుండటంతో ఈ టోర్నీ పాక్ నుంచి మళ్లీ  దుబాయ్ కే తరలించనున్నారని ఏసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తున్నది. దుబాయ్ తో పాటు ఈసారి ఖతార్ కూడా పోటీలో ఉంది.  గత కొంతకాలంగా అక్కడ స్థానిక టోర్నీలతో పాటు లీగ్ లకు  కూడా ఆ దేశం ఆతిథ్యమిస్తోంది. 

గతేడాది ఫిఫా వరల్డ్ కప్ ను విజయవంతంగా నిర్వహించింది. ఈసారి   ఆసియా కప్ నిర్వహణలో దుబాయ్ తో పాటు ఖతార్ కూడా  గట్టిగానే యత్నిస్తున్నది.  మరి రేపటి సమావేశానికి జై షా వెళ్తారా..? వెళ్లినా  నజమ్ సేథీ వాదనలు  వింటారా..?   ఆసియా కప్ ను ఏ దేశంలో నిర్వహిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 

click me!