టీ20 వరల్డ్‌కప్‌కి జట్టును ప్రకటించిన పాకిస్తాన్... కోచ్‌ పదవులకు మిస్బా వుల్ హక్, వకార్ యూనిస్ రాజీనామా...

First Published Sep 6, 2021, 3:08 PM IST

పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో మరోసారి హైడ్రామా సాగుతోంది. టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి జట్టును ప్రకటించింది పాకిస్తాన్. నేటి ఉదయం 12 గంటలకు టీ20 వరల్డ్‌కప్‌కి జట్టును ప్రకటిస్తే, మధ్యాహ్నం 12:30 ని.లకు హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్‌ పదవులకు రాజీనామాలు సమర్పించాడు మిస్బావుల్ హక్, వకార్ యూనిస్...

టీ20 వరల్డ్‌కప్ 2021లో పాకిస్తాన్ జట్టుకి బాబర్ ఆజమ్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. అతనితో పాటు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది పాక్ క్రికెట్ బోర్డు...

ఈ జట్టులో సీనియర్ బ్యాట్స్‌మెన్ ఫకార్ జమాన్, మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్‌లకు చోటు దక్కలేదు. టీ20 వరల్డ్‌కప్‌తో పాటు న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లతో సిరీస్‌లకు కూడా ఇదే జట్టు ఉంటుందని ప్రకటించింది పీసీబీ...

టీ20 వరల్డ్‌కప్‌కి పాక్ జట్టు ఇది: బాబర్ ఆజమ్ (కెప్టెన్), అసిఫ్ ఆలీ, కుష్‌దిల్ షా, మహ్మద్ హఫీజ్, సాహిబ్ మక్సూద్, ఆజమ్ ఖాన్, మహ్మద్ రిజ్వాన్, ఇమాద్ వసీం, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, షాదబ్ ఖాన్, హరీస్ రౌఫ్, హసన్ ఆలీ, మహ్మద్ హుస్సేన్, షాహీన్ షా ఆఫ్రిదీ

ప్రధాన జట్టులో చోటు దక్కించుకోకపోయినా సీనియర్ బ్యాట్స్‌మెన్ ఫకార్ జమాన్‌కి రిజర్వు ప్లేయర్‌గా యూఏఈకి వెళ్లనున్నాడు. అతనితో పాటు షానవాజ్ దహనీ, ఉస్మాద్ ఖాదీర్‌లను రిజర్వు ప్లేయర్‌లుగా ఎంపిక చేసింది పీసీబీ...

టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీకి జట్టును ప్రకటించిన కొద్దిసేపటికే పాక్ ప్రధాన కోచ్ మిస్బా వుల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు...

సెప్టెంబర్ 2019 నుంచి పాక్ క్రికెట్ జట్టు కోచ్‌లుగా వ్యవహరిస్తున్న ఈ ఇద్దరికీ ఇంకో ఏడాది కాంట్రాక్ట్ ఉంది. వీరి స్థానంలో సక్లైన్ ముస్తాక్, అబ్దుల్ రజాక్‌లను న్యూజిలాండ్ టూర్‌కి తాత్కాలిక కోచ్‌లుగా ఎంపిక చేసింది పీసీబీ...

క్వారంటైన్, బయో బబుల్ లైఫ్‌తో విసిగిపోయానని, వీటన్నింటికీ దూరంగా కొంతకాలం గడపాలనే ఉద్దేశంతోనే పాక్ హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు మిస్బా వుల్ హక్...

మిస్బా వుల్ హక్‌తో కలిసి పనిచేసిన తాను, అతను లేక ఈ భారాన్ని మోయలేనంటూ వకార్ యూనిస్ చెప్పుకొచ్చాడు. ప్రత్యక్షంగా చెప్పకపోయినా, టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపిక చేసిన జట్టుపై అసంతృప్తితోనే ఈ ఇద్దరూ అర్ధాంతరంగా తప్పుకున్నారని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

click me!