INDvsENG 4th Test: మెరుపులు మెరిపించిన భారత బ్యాట్స్‌మెన్... ఇంగ్లాండ్ ముందు టార్గెట్ ఎంతంటే..

First Published Sep 5, 2021, 9:01 PM IST

నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 466 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ ముందు నాలుగో ఇన్నింగ్స్‌లో 367 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో చివరి మూడు వికెట్లను 1 పరుగు తేడాలో కోల్పోయిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగులు జోడించడం విశేషం. శార్దూల్ ఠాకూర్ అద్భుత సెంచరీకి రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ, బుమ్రా, ఉమేశ్ యాదవ్ మెరుపులు తోడవడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయగలిగింది భారత జట్టు. 

రోహిత్ శర్మ 127 పరుగులు, ఛతేశ్వర్ పూజారా 61, కెఎల్ రాహుల్ 46 పరుగుల చేసి అవుట్ కావడంతో ఓవర్‌నైట్ స్కోరు 260/3 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా జడేజా వికెట్ త్వరగా కోల్పోయింది.

59 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసి జడేజా అవుట్ కాగా అజింకా రహానే 8 బంతులాడి డకౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు... 

వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయిన దశలో శార్దూల్ ఠాకూర్, రిషబ్ పంత్ కలిసి 8వ వికెట్‌కి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన శార్దూల్ ఠాకూర్, రెండో ఇన్నింగ్స్‌లో 65 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ అందుకున్నాడు...

ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీ చేసిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన శార్దూల్ ఠాకూర్... భారత జట్టు తరుపున నాలుగో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...

ఇంతకుముందు హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్ వృద్ధిమాన్ సాహా కూడా 8వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి... రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు చేయగలిగారు... వీరిలో భువీ 2014 ఇంగ్లాండ్ టూర్‌లో ఈ ఫీట్ సాధించాడు.

ఇంగ్లాండ్‌లోని ది ఓవల్ స్టేడియంలో రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారత బ్యాట్స్‌మెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు శార్దూల్ ఠాకూర్...

రిషబ్ పంత్ రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రాబిన్‌సన్ ఓవర్‌లో సింగిల్ తీసేందుకు ముందుకొచ్చిన రిషబ్ పంత్, ఫీల్డర్ త్రో వేసేలోపు వెనక్కి వెళ్లలేకపోయాడు... అయితే మొయిన్ ఆలీ డైరెక్ట్ హిట్ కొట్టేందుకు వేసిన త్రో వికెట్లకు తగలకపోవడం, ఆ తర్వాత అటువైపు ఎండ్‌లో ఉన్న జో రూట్ ఆ బంతిని అందుకుని, కీపర్‌కి ఇచ్చేందుకు లేటు చేయడంతో రిషబ్ పంత్ బతికిపోయాడు...

72 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 60 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్, జో రూట్ బౌలింగ్‌లో ఓవర్టన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 412 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది టీమిండియా.

రిషబ్ పంత్ తన స్టైల్‌కి విరుద్దంగా నెమ్మదిగా ఆడుతూ సింగిల్స్ తీయడానికే ప్రాధాన్యం ఇచ్చాడు. 105 బంతుల్లో 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు పంత్. రిషబ్ పంత్‌కి ఇది ఏడో హాఫ్ సెంచరీ.

హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న తర్వాత భారీ షాట్‌కి ప్రయత్నించిన రిషబ్ పంత్, మొయిన్ ఆలీకి రివర్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 414 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది టీమిండియా.

ఆ తర్వాత ఉమేశ్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా కలిసి 9వ వికెట్‌కి 36 పరుగులు జోడించారు. 38 బంతుల్లో 4 ఫోర్లతో 24 పరుగులు చేసిన బుమ్రా, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో అవుట్ కాగా... ఉమేశ్ యాదవ్ 23 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

click me!