ఆడిందే ఒక్క టెస్టు.. అంతలోనే గాయం.. పాకిస్తాన్ టూర్‌లో ఇంగ్లాండ్‌కు గాయాల బెడద

First Published Dec 5, 2022, 4:02 PM IST

PAKvsENG: ఇంగ్లాండ్ టెస్టు జట్టు ప్రస్తుతం   పాకిస్తాన్ పర్యటనలో ఉంది.   పరిమిత ఓవర్లలో ఆ జట్టులో కీలక ఆల్ రౌండర్ గా ఉన్న  లియామ్ లివింగ్‌స్టోన్ గాయంతో సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. 
 

రాక రాక టెస్టు జట్టులో అవకాశం వచ్చినా ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ లియామ్  లివింగ్‌స్టోన్ కు మాత్రం అదృష్టం కలిసిరాలేదు.  పరిమిత ఓవర్లలో మెరుపులు మెరిపించే  ఆ  ఇంగ్లీష్ క్రికెటర్  పాకిస్తాన్ పర్యటనలో భాగంగా తన తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు.  

బ్యాటింగ్ తో పాటు లెగ్ స్పిన్ కూడా చేయగలిగే  లివింగ్‌స్టోన్.. పాక్ పిచ్ లపై రాణిస్తాడనే  నమ్మకంతో టీమ్ మేనేజ్మెంట్ పాక్ కు పంపింది. కానీ  తొలి టెస్టులో  లియామ్ అనుకున్నస్థాయిలో రాణించలేదు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు సెంచరీల  వరద పారిస్తుంటే  అతడు మాత్రం  9 పరుగులే చేసి  ఔటయ్యాడు.  

రెండో రోజు లియామ్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు.   అతడికి మోకాలికి గాయం కావడంతో పాక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో  అతడు ఫీల్డ్ లోకి రాలేదు.  కానీ ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చాడు.  సెకండ్ ఇన్నింగ్స్ లో లియామ్..  8 బంతుల్లో 7 పరుగులు చేసి  నాటౌట్ గా నిలిచాడు.  అప్పటికే బెన్ స్టోక్స్  ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు.  

అయితే గాయం కారణంగా మళ్లీ పాక్ రెండో ఇన్నింగ్స్ లో లియామ్ పీల్డింగ్ కు రాలేదు. దీంతో అతడు  పాక్ తో తర్వాత జరుగబోయే రెండు టెస్టులకు అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. అతడి స్థానంలో  ఇప్పటివరకు  మరో ఆటగాడిని  ప్రకటించలేదు. అంతేగాక  రావల్పిండి టెస్టు కంటే ముందు  ఇంగ్లాండ్ పేసర్  మార్క్  వుడ్ కూడా   గాయం కారణంగా  తొలి టెస్టు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.  తాజాగా ఆ జాబితాలో లియామ్ కూడా చేరాడు. 

కానీ  లియామ్ ప్లేస్  లో రెండో టెస్టులోకి లెగ్ స్పిన్  ఆల్ రౌండర్ రెహ్మాన్ అహ్మద్  కు తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది. ఇదే  జరిగితే మాత్రం  ఇంగ్లాండ్ తరఫున అతి తక్కువ వయసులో  టెస్టులకు ఎంపికైన క్రికెటర్ గా రెహ్మాన్ రికార్డులలోకెక్కుతాడు. రెహ్మాన్ 2004లో జన్మించాడు. ఇప్పుడతడి వయసు 18 ఏండ్లే కావడం గమనార్హం. 

ఇక పాకిస్తాన్ - ఇంగ్లాండ్ మధ్య  జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ నిర్దేశించిన  343 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్.. 80 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి మరో 84 పరుగులు కావాలి.  ఇంగ్లాండ్ విజయానికి 5 వికెట్లు కావాలి.  మరి విజయం వరించేది ఎవరినో..? అన్నది ఆసక్తికరంగా మారింది. 

click me!