కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుని సరిగ్గా ఏడాది... విరాట్ లాంటి టెస్టు కెప్టెన్‌ మళ్లీ దొరుకుతాడా?...

First Published Jan 15, 2023, 12:30 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ నుంచి విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నప్పుడు టీమిండియా... ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉంది. ఏడేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీని వదులుకునే సమయంలో టీమిండియా టాప్ ర్యాంకులో కొనసాగుతోంది. టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ భారత జట్టుపై ఎలాంటి ముద్ర వేశాడో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు...

అత్యధిక విజయాలు అందుకున్న టెస్టు కెప్టెన్లలో నాలుగో స్థానంలో నిలిచిన విరాట్ కోహ్లీ, మరోక్క విజయం అందుకుని ఉంటే టాప్ 3లోకి ఎంట్రీ ఇచ్చేవాడు. జనవరి 2022లో సౌతాఫ్రికా టూర్‌లో కేప్‌టౌన్ టెస్టు ఓడిన తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు విరాట్ కోహ్లీ...

రవిశాస్త్రి హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాక రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో సరిగ్గా మూడంటే మూడే టెస్టులు ఆడాడు విరాట్ కోహ్లీ. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో మనస్థాపం చెంది, కేప్‌టౌన్ టెస్టు తర్వాత మూడు ఫార్మాట్ల కెప్టెన్సీని వదులుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు...
 

2014లో ఎమ్మెస్ ధోనీ నుంచి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ, ఐదేళ్ల పాటు వరుసగా భారత జట్టును ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెం.1 టెస్టు టీమ్‌గా నిలిపాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అద్భుతమైన విజయాలు అందుకున్న భారత టెస్టు జట్టు, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2019-21 ఫైనల్‌కి అర్హత సాధించింది...

68 టెస్టు మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ, 40 విజయాలు అందించి, అత్యధిక విజయాలు అందించిన భారత కెప్టెన్‌గా టాప్‌లో నిలిచాడు. విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక భారత జట్టు ఆటతీరు కూడా పూర్తిగా మారిపోయింది. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌కి రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించాడు...

ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టుకి జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. బంగ్లాదేశ్ పర్యటనలో రెండు టెస్టులకు కెఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచుల్లో టీమిండియా గెలిచినా టాప్ క్లాస్ పర్ఫామెన్స్ అయితే చూపించలేకపోయింది...
 

విరాట్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక టీమిండియా టాప్ ర్యాంకు కూడా చేజారింది. ఆస్ట్రేలియా వరుస విజయాలతో టాప్ ప్లేస్‌కి చేరుకోగా భారత జట్టు, ఆరేళ్ల తర్వాత రెండో స్థానానికి పడిపోయింది. టీమిండియా ప్లేయర్లలో నరానరాన గెలుపు కసిని నింపిన సారథి  కోహ్లీ, కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక భారత జట్టు ఆటతీరు ఏదో టైమ్‌పాస్‌కి ఆడుతున్నట్టుగా ఉందనే ట్రోల్స్ కూడా వినిపిస్తున్నారు విరాట్ ఫ్యాన్స్..
 

రోహిత్ శర్మ, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియాని ఓడించి టైటిల్ గెలవచ్చమో కానీ టీమిండియా టెస్టు టీమ్‌పై విరాట్ కోహ్లీ వేసిన ముద్రను మాత్రం ఎన్నటికీ చెరపలేరని అంటున్నారు కింగ్ కోహ్లీ వీరాభిమానులు.. 2021 లార్డ్స్ టెస్టు చూసిన క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఈ అభిప్రాయానికి తలూపాల్సిందే.. 

click me!