టీమిండియా మొట్టమొదటి టీ20 మ్యాచ్‌కి 16 ఏళ్లు... పొట్టి ఫార్మాట్‌లో మనోళ్ల రికార్డులు...

First Published Dec 1, 2022, 12:06 PM IST

వన్డే ఫార్మాట్‌కి ఆదరణ లేకుండా పోవడానికి టీ20ల రాకే కారణం. 20-20 ఓవర్ల ఫార్మాట్ వచ్చినప్పుడు అసలు ఈ మ్యాచ్‌లను జనాలు చూస్తారా? ఆదరిస్తారా? అని అనేక మంది అనుమానించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మోస్ట్ క్రేజీయెస్ట్ ఫార్మాట్‌గా మారిపోయాయి టీ20లు. టీమిండియా ఆడిన మొట్టమొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌కి నేటితో 16 ఏళ్లు...

16 ఏళ్ల కిందట సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా 2006, డిసెంబర్ 1న జోహన్‌బర్గ్‌లో మొట్టమొదటి టీ20 మ్యాచ్ ఆడింది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్ రెండేసి వికెట్లు తీయగా శ్రీశాంత్, సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్ తలా ఓ వికెట్ తీశారు...

127 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది భారతజట్టు. సెహ్వాగ్ తన స్టైల్‌లో 29 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేయగా సచిన్ టెండూల్కర్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సచిన్ టెండూల్కర్ కెరీర్‌లో ఆడిన ఏకైక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఇదే...

దినేశ్ మోంగియా 45 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేయగా ఎంఎస్ ధోనీ డకౌట్ అయ్యాడు. దినేశ్ కార్తీక్ 28 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి టీమిండియా తరుపున మొట్టమొదటి ‘టీ20 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు..

టీ20ల్లో టీమిండియా తరుపున మొదటి పరుగు, మొదటి ఫోర్, మొదటి సిక్సర్ బాదింది వీరేంద్ర సెహ్వాగ్. మొదటి టీ20 హాఫ్ సెంచరీ రాబిన్ ఊతప్ప నమోదు చేయగా, సురేష్ రైనా బ్యాటు నుంచి మొట్టమొదటి టీ20 సెంచరీ వచ్చింది...

జహీర్ ఖాన్, టీమిండియా తరుపున టీ20ల్లో మొట్టమొదటి వికెట్ తీయగా, మొదటి క్యాచ్ సచిన్ టెండూల్కర్ అందుకున్నాడు. టీ20ల్లో మొట్టమొదటి ఐదు వికెట్ల ప్రదర్శన యజ్వేంద్ర చాహాల్ దక్కించుకోగా మొట్టమొదటి టీ20కి వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు..

Image credit: Getty

16 ఏళ్లల్లో టీ20ల్లో 66.48 శాతం విజయాలు అందుకున్న భారత జట్టు, అత్యధిక విజయాల శాతం ఉన్న జట్టుగా టాప్‌లో ఉంది. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా, అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు...
 

Image credit: PTI

టీ20ల్లో అత్యధిక మ్యాచులు ఆడిన ప్లేయర్, అత్యధిక సెంచరీలు (నాలుగు) చేసిన ప్లేయర్ రోహిత్ శర్మ. అత్యధిక బౌండరీలు బాదిన ప్లేయర్ కూడా రోహిత్ శర్మే. అయితే అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు మాత్రం విరాట్ కోహ్లీ దక్కించుకున్నాడు...

click me!