ఐపీఎల్‌కు చిన్న తాల గుడ్ బై.. ఫారెన్ లీగ్స్‌లో ఆడేందుకు మార్గం సుగమం చేసుకుంటున్న రైనా

First Published Sep 6, 2022, 12:05 PM IST

Suresh Raina: ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సుదీర్ఘకాలం సేవలందించిన  సురేశ్ రైనా త్వరలోనే ఈ మెగా లీగ్ నుంచి  వైదొలగనున్నాడు.   

టీమిండియా మాజీ ఆటగాడు, ఐపీఎల్ లో మహేంద్ర సింగ్ ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ‘చిన్న తాల’ అని పిలుచుకునే సురేశ్ రైనా  ఈ క్యాష్ రిచ్ లీగ్ కు గుడ్ బై చెప్పనున్నాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి 2021 వరకు  చెన్నైకి ప్రాతినిథ్యం వహించిన  రైనా.. ఇక ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్ కూ వీడ్కోలు పలకనున్నాడు.

ఈ మేరకు రైనా తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) తో పాటు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కి కూడా విషయాన్ని చేరవేశాడు.  దీనిని రైనా కూడా ధృవీకరించడం గమనార్హం. 

ఇదే విషయమై రైనా  ఓ జాతీయ పత్రికతో మాట్లాడుతూ.. ‘నా నిర్ణయంపై ఇదివరకే యూపీసీఏ తో పాటు  బీసీసీఐ సెక్రటరీ జై షాకు సమాచారం అందించాను. ఇప్పుడు నేను స్వేచ్ఛా జీవిని.  నేనిప్పుడు ఫారెన్ లీగ్స్ ఆడుకోవచ్చు..’ అని అన్నాడు. 

2021 వరకు చెన్నై తరఫున ఆడిన రైనాను 2022 మెగా వేలంలో చెన్నై కొనుగోలు చేయలేదు.  అతడిని  తీసుకోవడానికి మిగతా జట్లు కూడా ఆసక్తి చూపలేదు.దీంతో రైనా స్టార్ స్పోర్ట్స్ లో ఐపీఎల్  హిందీ కామెంట్రీ చెప్పాడు.  అయితే ఇటీవలే తిరిగి  ప్రాక్టీస్ మొదలుపెట్టిన రైనా.. మళ్లీ ఫీల్డ్ లోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నాడు. 

ఐపీఎల్ లో తనకు స్థానం లేదని గ్రహించిన  రైనా.. ఫారెన్ లీగ్స్ లో ఆడేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు. త్వరలోనే దక్షిణాఫ్రికా వేదికగా సౌతాఫ్రికా టీ20 వేలం జరగాల్సి ఉంది. ఈ లీగ్ లో ఆడాలని రైనా భావిస్తున్నాడు.  దీంతో పాటు  దుబాయ్ వేదికగా వచ్చే ఏడాది నుంచి ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ప్రారంభం కానుంది. ఇందులో ఆడాలని రైనా అనుకుంటున్నాడు. 

అయితే భారత క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం.. దేశవాళీ, ఐపీఎల్, జాతీయ జట్టు తరఫున ఆడుతున్న  ఇండియా క్రికెటర్ విదేశీ లీగ్ లలో ఆడే అవకాశం లేదు.  ఒకవేళ అలా ఆడాల్సి వస్తే  సదరు క్రికెటర్.. బీసీసీఐతో  బంధాన్ని తెంచుకుని  వెళ్లాల్సి ఉంటుంది. తాజాగా రైనా చేసిందీ అదే. 

click me!