రిజ్వాన్‌కు గాయం.. కోలుకోకుంటే పాకిస్తాన్‌కు షాకే..

First Published Sep 5, 2022, 3:23 PM IST

Mohammed Rizwan: ఆసియా కప్-2022లో పాకిస్తాన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆ జట్టు వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ గాయపడ్డాడు. ఇప్పటికే గాయాలతో సతమతమవుతున్న ఆ జట్టుకు ఇది మరో ఎదురుదెబ్బ. 

సూపర్-4లో  భాగంగా ఇండియాతో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో  పాకిస్తాన్ విజయం సాధించింది. పాకిస్తాన్ విజయంలో ఆ జట్టు వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో 71 పరుగులు చేశాడు.  అయితే  రాబోయే మ్యాచ్ లకు అతడు అందుబాటులో ఉండేది అనుమానంగానే ఉంది. 

భారత్ తో మ్యాచ్ లో వికెట్ కీపింగ్ చేస్తూ రిజ్వాన్ గాయపడ్డాడు.  తనకంటే ఎక్కువ ఎత్తులో వచ్చిన బంతిని అందుకునే క్రమంలో రిజ్వాన్ కు గాయమైంది. బంతికోసం పైకి ఎగిరి కింద పడేప్పుడు రిజ్వాన్ కాలు నిటారుగా భూమికి  బలంగా తాకింది. దీంతో అతడు  అక్కడే కిందపడిపోయి నొప్పితో విలవిల్లాడాడు.  

రిజ్వాన్ గాయపడటంతో టీమ్ ఫిజియోలు వచ్చి గ్రౌండ్ లోనే అతడికి  ప్రాథమిక వైద్యం అందించారు. నొప్పి వేధిస్తున్నా రిజ్వాన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు.   పాకిస్తాన్ బ్యాటింగ్  చేసేప్పుడు రిజ్వాన్ పరుగెత్తడానికి ఇబ్బందిపడ్డా  పోరాటం మాత్రం ఆపలేదు.  

అయితే మ్యాచ్ ముగిశాక రిజ్వాన్ ను  హాస్పిటల్ కు తరలించినట్టు తెలుస్తున్నది. రిజ్వాన్ గాయం తీవత్ర ఎక్కువే అని.. అతడికి ఎంఆర్ఐ స్కాన్ చేయించిన తర్వాత  వచ్చే ఫలితాలను బట్టి  రాబోయే మ్యాచ్ లలో  రిజ్వాన్ ను ఆడించాలా..? లేదా..? అనేది పాకిస్తాన్ జట్టు నిర్ణయించనుంది. 
 

ఒకవేళ రిజ్వాన్ గాయం పెద్దదైతే మాత్రం అది ఆ జట్టుకు భారీ షాకే. పాక్ బ్యాటింగ్ లో బాబర్ ఆజమ్  ఫామ్ లేక అలా వచ్చి ఇలా వెళ్తున్నాడు.  ఆసియా కప్ లో ఆడిన మూడు ఇన్నింగ్స్ లలో కూడా  అతడు తన మార్కును చూపలేదు.   

కానీ రిజ్వాన్ మాత్రం పాక్ బ్యాటింగ్ కు వెన్నెముకలా నిలుస్తున్నాడు.  భారత్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 43 పరుగులు చేసిన  రిజ్వాన్.. తర్వాత హాంకాంగ్ తో  78 పరుగులు చేశాడు. ఇక భారత్ తో సూపర్-4లో 71 పరుగులు చేశాడు. దీంతో 3 మ్యాచుల్లో  192 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

పాకిస్తాన్ ఇప్పటికే గాయాలతో సతమతమవుతున్నది. ఈ టోర్నీకి ముందు ఆ జట్టు ప్రధాన పేసర్ షహీన్ షా అఫ్రిది గాయంతో తప్పుకున్నాడు. వసీం జూనియర్ కూడా  గాయం కారణంగా దూరమయ్యాడు.  సూపర్-4కు ముందు ఆ జట్టు మరో పేసర్ షహన్వాజ్ దహానీ  గాయపడి భారత్ తో మ్యాచ్ ఆడలేదు. ఇప్పుడు రిజ్వాన్ గాయం పెద్దదని తేలితే అతడు కూడా వీళ్ల జాబితాలో చేరనున్నాడు. 

click me!