Virat Kohli, RCB, IPL 2025, IPL
IPL 2025 RCB : అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు 2025 మెగా వేలానికి ముందు తమ జట్టులో రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించాయి. అందరి దృష్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( ఆర్సీబీ ) పైనే ఉన్న సమయంలో రిటెన్షన్ లిస్ట్‌లో మొదటి పేరుగా విరాట్ కోహ్లిని రూ. 21 కోట్లకు జట్టుతోనే నిలుపుకుంది. దీంతో ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా కూడా కోహ్లీ తిరిగి వస్తాడని అనేక పుకార్లు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఆర్సీబీ టీమ్ స్పందించింది. ఇంకా కెప్టెన్ విషయంలో నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. అలాగే, కెప్టెన్సీకి ఎంపికగా వేలంలో టీమిండియా స్టార్‌ని టార్గెట్ చేసేందుకు అంతా సిద్ధమైనట్లు సూచనలు పంపింది. దీంతో రాబోచే ఐపీఎల్ 2025 సీజన్ లో ఆర్సీబీని మరో టీమిండియా స్టార్ ముందుకు నడిపిస్తాడని సమాచారం. అయితే, ఆ ప్లేయర్ ఎవరు?
ఐపీఎల్ 2025 : ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కాదు
ఐపీఎల్ 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( RCB ) కి విరాట్ కోహ్లి నాయకత్వం వహిస్తాడని ఊహాగానాలు రావడానికి ప్రధాన కారణం ఆ జట్టు ఐపీఎల్ 2021 తర్వాత కోహ్లి RCB కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో ఫ్రాంచైజీ ఫాఫ్ డు ప్లెసిస్‌ను కెప్టెన్సీని అప్పగించింది. ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు డుప్లెసిస్ ను ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదు. దీంతో విరాట్ కెప్టెన్ అవుతాడని పుకార్లు వచ్చాయి.
కోహ్లీ ఇదివరకు ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్నాడు. అతను ధోని (226), రోహిత్ శర్మ (158) తర్వాత 143 మ్యాచ్‌లతో ఐపీఎల్ లో ఎక్కువ కాలం సేవలందించిన మూడవ కెప్టెన్‌గా నిలిచాడు. కోహ్లి ఆర్సీబీకీ 66 విజయాలు అందించాడు. ఇందులో 2016 ఐపీఎల్ ఫైనల్ చేరడం కూడా ఉంది. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) చేతిలో ఓడిపోయింది. ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్, కోహ్లీ కెప్టెన్‌గా తిరిగి వస్తాడని పుకార్లు ప్రస్తావిస్తూ, ఫ్రాంచైజీ ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మెగా వేలంలో నాయకుడి కోసం వేచి చూస్తామని అన్నారు.
కెప్టెన్సీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: RCB క్రికెట్ డైరెక్టర్ బోబాట్
ఐపీఎల్ రిటెన్షన్, ఆటగాళ్ల విడుదల నేపథ్యంలో JioCinemaతో జరిగిన ఇంటరాక్షన్‌లో RCB క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ మాట్లాడుతూ.. ఫ్రాంచైజీ కెప్టెన్సీపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. "వింటున్న ప్రతి ఒక్కరినీ నిరాశపరిచినందుకు నన్ను క్షమించండి. కెప్టెన్సీ లేదా దాని గురించి మేము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మేము ఎంపికలకు సిద్ధంగా ఉన్నాము. మేము తీసుకున్న ఏకైక స్పష్టమైన నిర్ణయం ఫాఫ్‌ను కొనసాగించడం కాదు. అతను గత సంవత్సరం గొప్ప పని చేసాడు. గతంలో పోలిస్తే ఇప్పుడు మేము వేలానికి వెళ్లినప్పుడు చాలా ఓపెన్ మైండ్‌తో ఉంటామని చెప్పారు.
కేఎల్ రాహుల్ పై కన్నేసిన ఆర్సీబీ
పీటీఐ నివేదిక ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 వేలంలో భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ ను దక్కించుకోవడానికి వ్యూహాలు సిద్ధం చేస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ విడుదల చేసిన తర్వాత అతన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. అతను జట్టు వికెట్ కీపర్-బ్యాటర్‌కు గొప్ప ఎంపిక మాత్రమే కాదు, కెప్టెన్‌గా కూడా ఆర్సీబీకి పెద్ద ఎంపికగా చూస్తున్నట్టు పలు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.
KL Rahul Virat Kohli
ఇప్పుడు విరాట్ కోహ్లీకి కెప్టెన్సీని అప్పగించే విషయంలో ఆర్సీబీ నిర్ణయం తీసుకోలేదని చెప్పడంతో రాబోయే సీజన్ లో కోహ్లీ కాకుండా ఆర్సీబీకి కొత్త కెప్టెన్ రావడం పక్కగా కనిపిస్తోంది. ఇక కేఎల్ రాహుల్ ను జట్టు సొంతం చేసుకుంటే అతనికి కెప్టెన్సీని అప్పగించాలని భావిస్తోందని క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
కేఎల్ రాహుల్ రాహుల్ స్థానంలో లక్నో టీమ్ లోకి వచ్చేది ఎవరు?
పీటీఐ నివేదికల ప్రకారం లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ప్రాధమిక వికెట్ కీపర్-బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ స్థానంలో ముంబై ప్లేయర్ ఇషాన్ కిషన్‌ను తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ఇషాన్ కిషన్ ను ముంబై టీమ్ కూడా రిటైన్ చేసుకోకుండా వదులుకుంది. అయితే, ముంబై ఇండియన్స్ వద్ద RTM కార్డ్ మిగిలి ఉంది కాబట్టి మళ్లీ దానిని ఉపయోగించి ఇషాన్ కిషన్ ను తీసుకునే ఛాన్స్ కూడా లేకపోలేదు.