IND vs NZ : 29 పరుగులకే 5 వికెట్లు.. వాంఖ‌డేలో కుప్ప‌కూలిన టీమిండియా టాపార్డ‌ర్

First Published | Nov 3, 2024, 11:27 AM IST

IND vs NZ : భారత్ vs న్యూజిలాండ్ మూడో టెస్టులో 147 పరుగుల స్వ‌ల్ప ల‌క్ష్య‌ ఛేదనలో భారత్ ఆరంభంలోనే తమ స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (11), శుభ్‌మన్ గిల్ (1), విరాట్ కోహ్లీ (1)లను కోల్పోయింది. 29 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయి భార‌త జ‌ట్టు క‌ష్టాల్లో ప‌డింది. 

IND vs NZ : ముంబైలోని వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న భారత్ - న్యూజిలాండ్ మూడో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో స్టార్ బ్యాట‌ర్లు అలా క్రీజులోకి వ‌చ్చి ఇలా పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. ఏ బ్యాట‌ర్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిల‌బ‌డ‌లేక‌పోయారు. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్ ల‌ను గెలుచుకున్న న్యూజిలాండ్ సిరీస్ ను కైవ‌సం చేసుకుంది. ఇక మూడో మ్యాచ్ లో కూడా త‌న జోరును చూపిస్తోంది. భార‌త జ‌ట్టు కేవ‌లం 29 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. 

ఈ సిరీస్ లో మూడవ, చివరి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి న్యూజిలాండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు ఆలౌట్ చేశారు. ఈ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (51) మాత్రమే తన జట్టు తరఫున హాఫ్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్. గ్లెన్ ఫిలిప్స్ 26 పరుగులు, డెవాన్ కాన్వే 22, డారిల్ మిచెల్ 21 పరుగులు చేశారు. భారత్ తరఫున జడేజా 5 వికెట్లు తీయగా, అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. వాషింగ్టన్‌ సుందర్‌, ఆకాశ్‌దీప్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 235 పరుగులకు సమాధానంగా, రెండో రోజు భారత్ తన ఇన్నింగ్స్‌ను 263 పరుగుల వద్ద ముగించి, 28 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. భారత్ తరఫున శుభ్‌మన్ గిల్ (90) సెంచరీ మిస్ కాగా, రిషబ్ పంత్ 60 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్‌ తరఫున అజాజ్‌ పటేల్‌ 103 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.

Latest Videos


న్యూజిలాండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు ఆలౌట్ కావ‌డంతో భార‌త జ‌ట్టు ముందు 147 పరుగుల స్వ‌ల్ప‌ విజయలక్ష్యాన్ని ఉంచింది.  ఈజీగానే భార‌త్ విజ‌యాన్ని అందుకుంటుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, కీవీస్ బౌల‌ర్ల ముందు భార‌త బ్యాట‌ర్లు ఎక్క‌వ సేపు నిల‌బ‌డ‌లేక‌పోయారు. కేవ‌లం 29 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయి భార‌త క‌ష్టాల్లో ప‌డింది.   

యంగ్ ప్లేయ‌ర్  య‌శ‌స్వి జైస్వాల్  5 ప‌రుగుల వ‌ద్ద గ్లెన్  ఫిలిప్స్ బౌలింగ్ లో ఎల్బీడ‌బ్ల్యూగా పెవిలియ‌న్ కు చేరాడు. మ‌రోసారి కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కూడా నిరాశ‌ప‌రిచాడు. 11 ప‌రుగుల వ‌ద్ద మాట్ హెన్రీ బౌలింగ్ లో గ్లెన్ ఫిలిప్స్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. స్టార్ సీనియ‌ర్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ ఫ్లాప్ షో కొన‌సాగుతూనే ఉంది. ఈ ఇన్నింగ్స్ లోనూ విరాట్ కోహ్లీ పెద్ద‌గా ప‌రుగులు చేయ‌లేదు. 

కింగ్ కోహ్లీ అజాజ్ ప‌టేల్ బౌలింగ్ లో ఒక్క ప‌రుగు వ‌ద్ద డిరిల్ మిచెల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ కూడా సింగిల్ డిజిట్ కే ప‌రిమితం అయ్యాడు. ప్ర‌స్తుతం రిష‌బ్ పంత్, వాషింగ్టన్ సుందర్ భారత ఇన్నింగ్స్ ను కొన‌సాగిస్తున్నారు. భార‌త్ విజ‌యానికి ఇంకా 66 ప‌రుగులు కావాలి. ప్రస్తుతం భారత్ 81/6 పరుగులతో ఆటను కొనసాగిస్తుంది.

రవీంద్ర జడేజా 10 వికెట్లుముంబై టెస్టు మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన చేసి 10 వికెట్లు పడగొట్టాడు. ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 65 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసి 55 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా టెస్టుల్లో మూడోసారి 10 వికెట్లు తీశాడు.

పిచ్ నుంచి స్పిన్నర్ల‌కు సాయం 

వాంఖడే స్టేడియంలోని పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు 150 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడం భారత్‌కు సవాలుగా మారనుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంట‌న్నారు. భారత్‌ క్లీన్‌స్వీప్‌ నుంచి తప్పించుకోవాలంటే బ్యాట్స్‌మెన్‌ సంయమనంతో కూడిన దూకుడు ప్రదర్శించాల్సి ఉంటుందని చెబుతున్నారు. 

వాంఖ‌డే టెస్టుకు ఇరు జ‌ట్లు : 

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్.

న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్క్.

click me!