IPL: బెంగళూరు, ఇస్తాంబుల్ ఔట్.. ఈసారి వేలం నిర్వహించేది ఇక్కడే.. బీసీసీఐ కీలక నిర్ణయం

First Published Nov 10, 2022, 12:36 PM IST

IPL 2023 Auction: ప్రస్తుతం టీ20  ప్రపంచకప్ ఫీవర్ లో ఉన్న క్రికెట్ అభిమానులకు మరో రెండు మూడు నెలల్లో అతి  పెద్ద క్రికెట్ పండుగ రానుంది. మార్చి చివరివారం నుంచి మొదలుకాబోయే ఐపీఎల్-2023 కోసం  బీసీసీఐ సన్నాహకాలు మొదలుపెట్టింది. 
 

వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఇప్పటికే సన్నాహకాలు మొదలుపెట్టిన బీసీసీఐ.. మరో కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ ఏడాది డిసెంబర్ లో జరుగబోయే ఐపీఎల్-2023 వేలం వేదికను ఖరారు చేసింది. వేలాన్ని ఎప్పటిలాగే బెంగళూరు లోనే నిర్వహించనున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వత  ఇస్తాంబుల్ (టర్కీ), ముంబై, హైదరాబాద్ లు కూడా ఆప్షన్ లుగా ఉన్నాయి. 

చివరికి ఇవేవీ రేసులో లేవని తెలుస్తున్నది. 2023 ఐపీఎల్ వేలాన్ని  ఈసారి కొచ్చి (కేరళ) లో నిర్వహించనున్నట్టు సమాచారం. డిసెంబర్ 23న  ఈ కార్యక్రమం ఉండే అవకాశమున్నట్టు  ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో నివేదిక వెల్లడించింది. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో  నిర్వహించిన భారీ వేలం మాదిరిగా కాకుండా ఈసారి మినీ వేలం నిర్వహిస్తారు. ఒక్కరోజులోనే వేలం ప్రక్రియ ముగుస్తుంది. డిసెంబర్ 16న వేలాన్ని నిర్వహిస్తారని వార్తలు వచ్చినా  తర్వాత దీనిని 23వ తేదీకి మార్చినట్టు తెలుస్తున్నది. దీనిపై పూర్తి వివరాలు టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత తెలియనున్నాయి. 

మినీ వేలం కోసం ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు వెళ్లాయని సమాచారం.  వేలానికంటే ముందే  పది ఫ్రాంచైజీలు  తాము రిటైన్  చేసుకునే ఆటగాళ్లు, వేలానికి వదిలేసేవారి గురించిన సమాచారాన్ని నవంబర్ 15వరకు  బీసీసీఐకి అందజేయాలి. ఆ తర్వాత బీసీసీఐ వేలం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల పని మొదలుపెట్టనుంది. 

ఐపీఎల్ -2023 వేలం కోసం  ఫ్రాంచైజీల పర్స్ వాల్యూ  రూ. 90 కోట్ల నుంచి రూ. 95 కోట్లకు పెంచిన విషయం తెలిసిందే. తద్వారా  పలు జట్లు తమకు నచ్చిన ఆటగాళ్లను దక్కించుకునే విషయంలో  ధర మరింత పెరిగే అవకాశముంది. ఈసారి  వేలానికి సంబంధించిన నియమాలు, విధి విధానాలకు సంబంధించిన విషయాలు  త్వరలోనే వెల్లడికానున్నాయి. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఐపీఎల్ చైర్మెన్ బ్రిజేష్ పటేల్ ల ఆధ్వర్యంలో వేలం జరిగింది. కానీ ఇప్పుడు ఈ రెండు పదవులలో వ్యక్తులు మారారు.  బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎంపికవగా ఐపీఎల్ చైర్మెన్ గా అరుణ్ ధుమాల్ ఉన్నారు. ఇప్పటికే వరల్డ్ రిచెస్ట్ లీగ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఐపీఎల్ భవిష్యత్ లో మరెన్ని సంచలనాలను సృష్టించనుందో.. 

click me!