ఐపీఎల్ 2021 సీజన్ సమయంలో డేవిడ్ వార్నర్‌కీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌కీ మధ్య విభేదాలు వచ్చాయి. టీమ్ సెలక్షన్‌పై వార్నర్, బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడంతో అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించి... తుది జట్టులో చోటు కూడా లేకుండా చేసింది సన్‌రైజర్స్...
Kane Williamson
డేవిడ్ వార్నర్ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్. ఐపీఎల్ 2018 సీజన్‌లో డేవిడ్ వార్నర్ గైర్హజరీలో ఆరెంజ్ ఆర్మీకి కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్ మామ, టీమ్‌ని ఫైనల్ చేర్చాడు. అదే అంచనాలతో కేన్‌కి కెప్టెన్సీ అప్పగించింది సన్‌రైజర్స్..
అయితే కేన్ విలియంసన్, ఐపీఎల్ 2022 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 13 మ్యాచులు ఆడిన కేన్ విలియంసన్, 19.64 సగటుతో 216 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది. స్ట్రైయిక్ రేటు 93.51 మాత్రమే..
డేవిడ్ వార్నర్ 2014 నుంచి 2020 వరకూ ప్రతీ సీజన్‌లోనూ 500+ పరుగులు చేసి బ్యాటర్‌గానూ సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కేన్ విలియంసన్ మాత్రం ఐపీఎల్ 2018 సీజన్ మినహాయిస్తే... మిగిలిన సీజన్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు...
Kane Williamson
అదీకాక టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు కేన్ విలియంసన్. ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇంగ్లాండ్‌లతో జరిగిన మ్యాచుల్లో టీ20ల్లో టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన కేన్ మామ, ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చినట్టే అనిపించాడు...
Rohit Sharma-Kane Williamson
అయితే పాకిస్తాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 42 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు కేన్ విలియంసన్. టీ20ల్లో టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడుతున్న కేన్ విలియంసన్‌ని ఐపీఎల్ 2023 సీజన్‌లో జట్టు నుంచి తప్పించాలని చూస్తోందట సన్‌రైజర్స్ హైదరాబాద్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. మరో మూడు మ్యాచుల్లో గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుతుందనగా మళ్లీ వరుసగా 5 మ్యాచుల్లో ఓడి.. ఓవరాల్‌గా 6 విజయాలు, 8 పరాజయాలతో 8వ స్థానానికి పరిమితమైంది ఆరెంజ్ ఆర్మీ...
ఐపీఎల్ 2022 సీజన్‌లో జరిగిన ఆఖరి మ్యాచ్‌కి కేన్ విలియంసన్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌కి భువనేశ్వర్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. మరి కేన్ మామని మినీ వేలానికి విడుదల చేస్తే... ఐపీఎల్ 2023 సీజన్‌కి ఎవరు కెప్టెన్సీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.