కెప్టెన్ గా ఫాస్ట్ బౌలరా..? భారత్ లో అయితే అస్సలు కుదరదు.. వాళ్లకు అది ఉండదు : రవిశాస్త్రి

First Published Jan 28, 2022, 11:30 AM IST

Ravi Shastri Opines  On Fast Bowler Captain:  భారత తదుపరి టెస్టు సారథిపై  సర్వత్రా చర్చ నడుస్తున్నది.  ఇదే క్రమంలో ఫాస్ట్ బౌలర్  జస్ప్రీత్ బుమ్రాకు ఆ బాధ్యతలు అప్పజెప్పాలనే వాదన కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి వైదొలగడంతో భారత జట్టుకు రెడ్ బాల్ కు  సారథి అవసరం పడింది. పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మకే ఆ బాధ్యతలు అప్పజెప్పుతారని వార్తలు వస్తున్నా..  జాబితాలో కెఎల్ రాహుల్,  రిషభ్ పంత్ ల పేరు కూడా వినిపిస్తున్నది.

వీళ్లే గాక భారత  పేసర్ జస్ప్రీత్ బుమ్రా  లో కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అతడిని సారథిని చేయాలని గత కొన్నాళ్లుగా భారత  సీనియర్  బౌలర్లు చెబుతున్నారు. తాజాగా ఇదే విషయమై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా  స్పందిస్తూ..  రోహిత్ కాకుంటే ఆ అవకాశం బుమ్రాకే ఇవ్వాలని అన్నాడు. 
 

ఇక గురువారం ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  మరో భారత పేసర్  మహ్మద్ షమీ కూడా.. కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించాడు. 
 

ఈ నేపథ్యంలో టీమిండియా  మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. భారత జట్టుకు  ఫాస్ట్ బౌలర్లు సారథులుగా పెద్దగా సక్సెస్ కాలేరని, అది టీమిండియాలో కుదరదని  వ్యాఖ్యానించాడు. 
 

పాకిస్థాన్ క్రికెటర్ షోయభ్ అక్తర్ యూట్యూబ్ ఛానెల్ వేదికగా అడిగిన  పలు ప్రశ్నలకు రవిశాస్త్రి సమాధానమిచ్చాడు. శాస్త్రి స్పందిస్తూ... ‘లేదు.. నేను దాని (కెప్టెన్ గా బౌలర్) గురించి ఆలోచించడం లేదు.  భారత్ లో ఫాస్ట్ బౌలర్ సారథిగా ఉండటమనేది చాలా కష్టం.  ఒక ఫాస్ట్ బౌలర్ కెప్టెన్ కచ్చితంగా ఆల్ రౌండర్ అయి ఉండాలి...
 

లేదంటే అతడు ఏ పరిస్థితుల్లో అయినా రాణించే బాబ్ విల్లీస్ తరహా ఆటగాడు అయినా అయి ఉండాలి.  కెప్టెన్ ఎప్పటికీ గేమ్ లోనే ఉండాలి.  అతడికి అగ్రెసివ్ నెస్ (దూకుడు) ఉండాలి.  మ్యాచులను గెలిపించేలా అతడి గేమ్ ప్లాన్ ఉండాలి.  కానీ ఒక ఫాస్ట్  బౌలర్ లో ఇవన్నీ చూడటం కొంచెం కష్టమే. 
 

అలాంటి వాళ్లను చాలా అరుదుగా చూస్తాం. ఒకవేళ  అతడు (ఫాస్ట్ బౌలర్ కెప్టెన్)  కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్, సర్ గ్యారీఫీల్డ్ వంటి ఆల్ రౌండర్ అయితే తప్ప  ఫాస్ట్ బౌలర్ లు  సారథులుగా నిలదొక్కుకోవడం  సవాళ్లతో కూడుకున్నది...’ అని శాస్త్రి అన్నాడు.

భారత జట్టు విషయాన్ని కాసేపు పక్కనబెడితే ఆస్ట్రేలియా ఈ దిశగా ఒక ప్రయోగం చేస్తున్నది. ఈ క్రమంలో అది విజయవంతమైంది కూడా.. ఇటీవలే ముగిసిన యాషెస్ కు ముందు జరిగిన పరిణామాలతో  ఆ జట్టు  ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ను  ఆసీస్ కెప్టెన్ గా నియమించింది.  అతడు సారథిగా తొలి సిరీస్ లోనే అదరగొట్టాడు. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించి ఆసీస్ కు యాషెస్ అందించాడు. ఫాస్ట్  బౌలర్లు కూడా సారథులుగా రాణించగలరని నిరూపించడం గమనార్హం. 
 

click me!