శిఖర్ ధావన్ కెరీర్ ముగిసినట్టేనా... శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ బాదుడుతో గబ్బర్‌కు గడ్డుకాలం...

First Published Dec 11, 2022, 5:15 PM IST

టీమిండియాలో స్టార్ ప్లేయర్‌గా ఎదగాల్సిన అన్ని అర్హతలు ఉన్న సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్. ఐసీసీ టోర్నీల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వడం శిఖర్ ధావన్ స్పెషాలిటీ. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కారణంగా స్టార్ ఇమేజ్ దక్కించుకోలేకపోయాడు శిఖర్ ధావన్. కొన్నాళ్లుగా వరుసగా విఫలమవుతూ వస్తున్న ధావన్ కెరీర్ ఇప్పుడు సందిగ్ధంలో పడింది...

Image credit: Getty

కొత్త టీవీ వచ్చాక పాత టీవీ అటకెక్కినట్టు, కొత్త ప్లేయర్ల రాకతో శిఖర్ ధావన్‌... టీమ్‌లో చోటు కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీతో పాటు 2022 టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోలేకపోయిన శిఖర్ ధావన్... వచ్చే వన్డే వరల్డ్ కప్ 2023 అయినా ఆడతాడా? అనేది అనుమానంగా మారింది..

Image credit: PTI

ఐసీసీ టోర్నీల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ ‘మిస్టర్ ఐసీసీ టోర్నీమెంట్స్’గా పేరు తెచ్చుకున్న శిఖర్ ధావన్.. గత 11 వన్డేల్లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. ఆరంగ్రేటం టెస్టులోనే సెంచరీ చేసిన శిఖర్ ధావన్, 34 మ్యాచుల్లో 7 సెంచరీలు బాదాడు. అయితే ధావన్‌, ఆఖరి టెస్టు ఆడి నాలుగేళ్లు దాటిపోయింది. టీ20ల్లో ధావన్‌ని సెలక్ట్ చేయడం ఆపేసి ఏడాది దాటింది...

Image credit: PTI

ఖర్ ధావన్ సెంచరీ చేసి మూడేళ్లు దాటేసింది. చివరిగా 2019 జూన్‌లో వన్డే శతకం బాదిన శిఖర్ ధావన్, ఆ తర్వాత హాఫ్ సెంచరీలు కొడుతున్నా సెంచరీని చేరుకోలేకపోతున్నాడు. సెంచరీ మార్కు చేరుకోలేకపోతున్న శిఖర్ ధావన్‌కి వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌లో చోటు ఉండాలా? వద్దా? అనే ప్రశ్న రేగుతోంది...

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 72, 3, 28 పరుగులు చేసిన శిఖర్ ధావన్... బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో 7, 8, 3 పరుగులు చేసి  చెత్త రికార్డు నెలకొల్పాడు. ధావన్ ఫెయిల్ అవుతున్న సమయంలో శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ అదిరిపోయే పర్ఫామెన్స్‌తో సీనియర్‌కి చెక్ పెడుతున్నారు...

14 వన్డేల్లో 61.27 సగటుతో 674 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, ఇప్పటికే ఓ సెంచరీ, నాలుగు వన్డే హాఫ్ సెంచరీలతో దుమ్మురేపాడు. జింబాబ్వేపై సెంచరీ బాదిన గిల్, శిఖర్ ధావన్‌తో కలిసి నాలుగు సార్లు సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు...
 

రోహిత్ శర్మ గాయం కారణంగా తప్పుకోవడంతో రాక రాక టీమ్‌లోకి వచ్చిన ఇషాన్ కిషన్.. డబుల్ సెంచరీతో రికార్డుల దుమ్ము దులిపాడు. ఇప్పుడు శిఖర్ ధావన్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. వన్డే ఫార్మాట్‌లో అయినా గబ్బర్‌కి ప్లేస్ ఉంటుందా? లేదా? అనేది త్వరలో తేలిపోనుంది...

Shikhar Dhawan

త్వరలో బీసీసీఐ నియమించే కొత్త సెలక్షన్ కమిటీ, శిఖర్ ధావన్ భవిష్యత్తుని నిర్ణయించనుంది... శిఖర్ ధావన్‌ని కొనసాగించాలా? లేక శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ లాంటి కుర్రాళ్లకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలా? అనేది సెలక్షన్ కమిటీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది...

37 ఏళ్ల శిఖర్ ధావన్, 166 వన్డేల్లో 44.4 సగటుతో 6790 పరుగులు చేశాడు. 100+ స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసిన గబ్బర్ కెరీర్‌ దాదాపు ముగిసినట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. మాజీ వికెట్ కీపర్ సబా కరీం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు...

‘ఇప్పటికీ వన్డేల్లో 275-300 పరుగులు చేస్తే చాలనుకుంటే శిఖర్ ధావన్ లాంటి క్లాస్ ప్లేయర్ అవసం. అయితే అతను ఈ సిరీస్‌లో సరిగ్గా ఆడలేదు. ఒకవేళ టీమిండియా 350+ స్కోరు చేయాలనుకుంటే ధావన్‌కి టీమ్‌లో ప్లేస్ ఉండదు...

Image Credit: Getty Images

140 స్ట్రైయిక్ రేటుతో భారీ షాట్లు ఆడడం శిఖర్ ధావన్‌కి అయ్యే పని కాదు. పృథ్వీ షా, ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి కొత్త కుర్రాళ్లు, భవిష్యత్తులో వైట్ బాల్ క్రికెట్‌ని ఏలబోతున్నారు. వీరిని దాటుకుని ధావన్ నిలబడడం కష్టమే...’ అంటూ కామెంట్ చేశాడు సబా కరీం...

click me!