ఇషాన్ ను చూసి నేర్చుకోండి.. వన్దే క్రికెట్ అంటే ఇలా ఆడాలి.. టీమిండియాకు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ సూచన

First Published Dec 11, 2022, 4:34 PM IST

భారత జట్టులోకి రాక రాక వచ్చిన అవకాశాన్ని  ఇషాన్ కిషన్ సద్వినియోగం చేసుకున్నాడు.  బంగ్లాదేశ్ తో రెండో వన్డేలో రోహిత్ శర్మ గాయపడటంతో టీమిండియా మేనేజ్మెంట్ మూడో వన్డేలో ఇషాన్ ను ఆడించింది. 

టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్  బంగ్లాదేశ్ తో  శనివారం ముగిసిన మూడో వన్డేలో దుమ్మురేపాడు.   126 బంతుల్లోనే  డబుల్ సెంచరీ చేసి  సరికొత్త రికార్డులు సృష్టించాడు.  కిషన్ వీరవిహారం చేయడంతో  ఈ మ్యాచ్ లో భారత్.. 400 ప్లస్ స్కోరు చేయగలిగింది.  

విరాట్ కోహ్లీతో కలిసి   290 పరుగుల భాగస్వామ్యం జోడించిన  ఇషాన్ కిషన్ పై  ప్రశంసలు కురుస్తున్నాయి.  తాజాగా ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ కూడా  ఇషాన్ ఆటను మెచ్చుకున్నాడు. వన్డే క్రికెట్ అంటే ఇలా ఆడాలని   ప్రశంసించాడు. అతడిని చూసి టీమిండియా నేర్చుకోవాలని  సూచించాడు. 

ఇషాన్ డబుల్ సెంచరీ చేసిన తర్వాత  వాన్ తన ట్విటర్ ఖాతా ద్వారా స్పందిస్తూ... ‘ఇదిగో.. వన్డే క్రికెట్ అంటే ఇలా ఆడాలి. ఈ కాలంలో  ఇలా ఆడితేనే  క్రికెట్ కు ఆదరణ ఉంటుంది..’ అని   ట్వీట్ చేశాడు.  గతంలో ఇదే వాన్ భారత క్రికెట్ పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.  

టీ20 ప్రపంచకప్  సెమీస్ లో ఇంగ్లాండ్  చేతిలో భారత్ దారుణ పరాజయం తర్వాత వాన్ భారత క్రికెట్ గురించి స్పందిస్తూ.. ‘భారత జట్టు 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఏం సాధించింది. ద ఏమీ లేదు. పరిమితి ఓవర్ల క్రికెట్ ను ఆడటంలో టీమిండియా తడబడుతోంది. 

క్రికెట్ చరిత్రలో వన్డేలలో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్టు టీమిండియానే. ప్రపంచంలో  క్రికెటర్లంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు వెళ్లి అక్కడ ఆడి  నేర్చుకుంటున్నామని చెబుతున్నారు. మరి ఇండియా ఆటగాళ్లు ఈ లీగ్ ద్వారా ఏం  నేర్చుకుంటున్నారో అర్థం కావడం లేదు..’ అని  కామెంట్స్ చేశాడు. 

Ishan Kishan

ఇక  డబుల్ సెంచరీ చేయడం ద్వారా  ఇషాన్..  భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి  లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. ఇంతకుముందు  సచిన్ టెండూల్కర్,  రోహత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్ లు ముగ్గురూ రైట్  హ్యాండ్ బ్యాటర్లే కావడం గమనార్హం.  

ఈ మ్యాచ్ లో ద్విశతకం బాదడం ద్వారా ఇషాన్ మరో ఘనత అందుకున్నాడు.  ఇప్పటివరకు డబుల్ సెంచరీలు చేసిన రోహిత్, సచిన్, సెహ్వాగ్ లు భారత్ లోనే  స్వదేశంలోనే ఈ ఘనత అందుకున్నారు. సచిన్ గ్వాలియర్ లో డబుల్ సెంచరీ చేయగా రోహిత్ (మొహాలీ, బెంగళూరు, ఈడెన్ గార్డెన్) లో   సాధించాడు. వీరేంద్ర సెహ్వాగ్ ఇండోర్ లో  డబుల్ అందుకున్నాడు.    ఇషాన్  కిషన్  బంగ్లాదేశ్ లో ఈ ఘనత సాధించడం విశేషం. 

click me!