Sanjiv Goenka: ఎవరీ సంజీవ్ గోయెంకా.. ఆటలపై ఆయనకు ఎందుకంత ప్రేమ..? లక్నో టీమ్ ఓనర్ గురించి ఆసక్తికర విషయాలు

First Published Oct 26, 2021, 11:10 AM IST

IPL New Teams: వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ లో రెండు కొత్త జట్లు రాబోతున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ- BCCI) వీటి వివరాలు నిన్న దుబాయ్ లో వెల్లడించింది. కొత్త జట్లలో ఒకదాన్ని దక్కించుకున్న ఓనర్ సంజీవ్ గొయెంకా. 

ఐపీఎల్-15 (IPL-15) సీజన్ లో ఫ్యాన్స్ కు మరింత ఆనందాన్ని పంచేందుకు మరో రెండు కొత్త జట్లు రాబోతున్నాయి. దీంతో ఇప్పటికే 8 జట్లు ఉండగా.. వచ్చే ఏడాది నుంచి  లక్నో (Lucknow), అహ్మదాబాద్ (ahmedabad) కూడా చేరబోతున్నాయి. దీంతో ఫ్యాన్స్ కు ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. అయితే ఈ రెండు కొత్త జట్లలో ఒకటి సొంతం చేసుకున్న ఆర్పీఎస్జీ గ్రూప్ అధినేత సంజీవ్ గొయెంకా (sanjiv goenka). లక్నో జట్టుకు ఆయన ఓనర్ (Lucknow owner). ఏకంగా ఏడు వేల కోట్లు పెట్టి మరీ దానిని సొంతం చేసుకున్నాడు. అసలు ఎవరీ సంజీవ్ గొయెంకా..? క్రీడలపై ఆయనకు ఎందుకింత ఆసక్తి.. ఇలాంటి వివరాలన్నీ కూలంకశంగా..

రాంప్రసాద్ సంజీవ్ గొయెంకా.. క్లుప్తంగా చెప్పాలంటే ఆర్పీఎస్జీ (RPSG). ప్రముఖ వ్యాపారవేత్త రాంప్రసాద్ గొయెంకా కుమారుడే సంజీవ్ గొయెంకా. 1961 జనవరి 29న కోల్కతా లో జన్మించారు. సెయింట్ జేవియర్స్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు.

చదువు పూర్తయ్యాక సంజీవ్ కూడా తండ్రి బాటలోనే వ్యాపారాన్ని తన వృత్తిగా మలుచుకున్నాడు. తండ్రి రాంప్రసాద్ గొయెంకా.. బ్రిటిష్ వాళ్ల హయాంలోనే వ్యాపారాలు చేసి అప్పట్లోనే భారతదేశం గర్వించే వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆయననే స్పూర్తిగా తీసుకున్న సంజీవ్.. 2011 లో బిజినెస్ లోకి దిగారు. 

అప్పటికే ఉన్న ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ను విస్తరించడంలో సంజీవ్ ది కీలక పాత్ర. రాంప్రసాద్ గొయెంకాకు ఇద్దరు కొడుకులు. సంజీవ్ తో పాటు హర్ష్ గొయెంకా. హర్ష్ గొయెంకా ఆర్పీజీ గ్రూప్ చూసుకుంటుండగా.. సంజీవ్ కొత్త వ్యాపారాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన పవర్, ఇంజినీరింగ్, విద్య, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, ఐటీ, రిటైల్, ఎఫ్ఎంసీజీ, ప్లాంటేషన్స్, ఫుడ్ వ్యాపారాల్లో  రాణిస్తున్నారు. ఆర్పీఎస్జీ గ్రూప్ కింద 23 కంపెనీలను నడుపుతున్నారు. 

కోల్కతా హెడ్ క్వార్టర్స్ గా ఉన్న  ఆర్పీఎస్జీ లో సుమారు 50 వేల ఉద్యోగులు పనిచేస్తున్నారు. విద్యుత్ రంగంలో ఉన్న సీఈఎస్సీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇంట్లోనే వ్యాపార సూత్రాలు ఒంటబట్టించుకున్న సంజీవ్ గొయెంకా.. 2001 లోనే కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ సంస్థకు అత్యంత చిన్న వయస్కుడిగా పనిచేసిన అధ్యక్షుడు ఆయనే.

ఈ ఏడాది మార్చి నాటికి సంజీవ్ గొయెంకా ఆస్తుల విలువ 1.9 బిలియన్ డాలర్లు. ఆర్పీఎస్జీ కి సంబంధించి సీఈఎస్సీ, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, స్పెన్సర్స్ రిటైల్ లిమిటెడ్, సరిగమ ఇండియా లిమిటెడ్, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ పెద్ద సంస్థలుగా ఉన్నాయి.భారత్ లో అగ్రశ్రేణి వ్యాపారవేత్తలలో సంజీవ్ ఒకరు.  సంగీతంపై కూడా గొయెంకాకు మక్కువ ఎక్కువ.  బాలీవుడ్ జనాలకు సంగీతం వీనుల వింధును అందించే సరిగమ (సరిగమ ఇండియా) కూడా ఆయనదే. 

ఇక ఆటల విషయానికొస్తే.. క్రీడల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఎన్నడూ వెనుకంజ వేయలేదు. ఇండియన్ సూపర్ లీగ్ లో ఆడే ప్రముఖ ఏటీకే మోహన్ బగాన్ ఫుట్బాల్ క్లబ్ మెహన్ బగల్ క్లబ్ కు ఆయనే ఓనర్. 2016,2017 సీజన్ లో ఐపీఎల్ లో ఆడిన రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ యజమాని కూడా ఆయనే. 

ఐపీఎల్ లో భారీ పెట్టుబడులు పెట్టడంపై సంజీవ్ స్పందిస్తూ.. ‘ఇప్పుడు మేం కొనుగోలు చేసిన ఫ్రాంచైజీ విలువ వచ్చే పదేళ్లలో డబుల్ అవుతుందని నమ్ముతున్నాం. కొంతకాలం నుంచి  జట్టును సొంతం చేసుకోవాలని భావిస్తున్నాం. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. మళ్లీ ఐపీఎల్ లోకి రావడం బాగుంది. మంచి జట్టును నిలుపుతాం’అని అన్నారు. 

click me!