నేను పదో తరగతి కూడా పాస్ కానని మా నాన్న తిట్టేవాడు : ధోని

First Published Oct 11, 2022, 3:51 PM IST

MS Dhoni: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఎన్నో ఘనతలను సాధించిన ధోని పదో తరగతి కూడా పాస్ కాలేడని తన తండ్రి ఎప్పుడూ తిట్టేవాడట. 

భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న సారథుల్లో మొదటివరుసలో ఉండే  నాయకుడు మహేంద్ర సింగ్ ధోని. మరెవరకీ సాధ్యం కాని రీతిలో రెండు ప్రపంచకప్పులు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ, మరెన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్న ధోని.. చదువులో మాత్రం అంత మెరుగైన విద్యార్థి కాదట. 

ఈ విషయాన్ని స్వయంగా ధోనినే వెల్లడించాడు. తన స్కూలింగ్ టైమ్ నుంచే క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన ధోని.. చదువులో యావరేజ్ స్టూడెంట్ గానే ఉండేవాడట. ధోని చదువు చూసిన తర్వాత అతడి తండ్రి (పాన్ సింగ్ ధోని)..  ‘నువ్వు పదో తరగతి కూడా పాస్ కాలేవు’ అని తిట్టేవాడట. 
 

Latest Videos


తమిళనాడులోని హోసూర్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు సంబంధించిన అంతర్జాతీయ క్రికెట్ అకాడమీని ప్రారంభించిన సందర్భంగా ధోని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్కూల్ కు ఎప్పుడు వెళ్లినా తనకు గత జ్ఞాపకాలు గుర్తొస్తాయని తెలిపాడు. 

ధోని మాట్లాడుతూ.. ‘నేను ఏడో తరగతి నుంచే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. అప్పట్నుంచే  స్కూల్ లో నా అటెండెన్స్ తగ్గుతూ వచ్చేది. టెన్త్ కు వచ్చేటప్పటికీ కూడా ఇదే కొనసాగింది. నా చదువు చూసిన మా నాన్న  అసలు నువ్వు పదో తరగతి పాస్ అవుతావా..? అని  తిట్టేవాడు. పరీక్షలు అయిపోయాక.. ఇక కతం.. నువ్వు మళ్లీ వచ్చే ఏడాది కూడా పరీక్ష్క్షలు రాయాలి అనేవాడు. 

కానీ పదో తరగతిలో నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేసరికి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.  టెన్త్ క్లాస్ లో నాకు 66 శాతం మార్కులు వచ్చాయి. ఇంటర్ లో నేను 56 శాతం మార్కులు సాధించాను. దాంతో ఆయన చాలా ఆనందించాడు..’ అని తెలిపాడు. 

స్కూల్ లైఫ్ బాగుంటుందని.. తానెప్పుడూ  పాఠశాలకు వెళ్లినా టైమ్ మిషన్ కు వెళ్లినట్టు అనిపిస్తుందని ధోని చెప్పుకొచ్చాడు. స్కూల్ కు వెళ్లగానే తనకు తన పాఠశాల రోజులు గుర్తుకొస్తాయని,  అవన్నీ మధుర జ్ఞాపకాలని చెప్పాడు. స్కూల్ లో అయ్యే స్నేహాలు జీవితాంతం కొనసాగుతాయని ధోని అన్నాడు. 

కాగా ధోని తన చదువును బీకాం వరకు కొనసాగించాడు.  తర్వాత రైల్వేలలో టికెట్ కలెక్టర్ గా ఉద్యోగం సంపాదించి అనంతరం రంజీలు, దేశవాళీలో మెరిసి జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. ధోని ఇండియా టీమ్ లోకి వచ్చినాక జరిగిందంతా చరిత్రే.. 

click me!