లాల్‌‌చంద్ నుంచి బౌచర్ దాకా.. ముంబై హెడ్‌కోచ్‌ల జాబితా ఇదే..

First Published Sep 16, 2022, 3:52 PM IST

Mumbai Indians: ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన  జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ కు తాజాగా మార్క్ బౌచర్ ను హెడ్‌కోచ్‌ గా ప్రకటించింది. అయితే ఐపీఎల్ ప్రారంభం నుంచి హెడ్‌కోచ్‌ ల  జాబితాను ఓసారి చూస్తే.. 

ఐపీఎల్ లో మరెవరికీ సాధ్యం కాని విధంగా ఏకంగా ఐదు ట్రోఫీ (2013, 2015, 2017, 2019, 2020)లను గెలుచుకుంది. అంతేగాక 2010లో రన్నరప్ గా  నిలిచిన ముంబై.. మూడు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరింది. చెన్నైసూపర్ కింగ్స్ తప్ప మిగిలిన ఫ్రాంచైజీలు ముంబై దరిదాపుల్లో లేవు.

ముంబై ఇండియన్స్ విజయాలలో ఆ జట్టు  హెడ్‌కోచ్‌ లది కీలక పాత్ర. తాజాగా ఆ జట్టు 2023 సీజన్  నుంచి కొత్త హెడ్‌కోచ్‌ తో బరిలోకి దిగుతున్నది.  దక్షిణాఫ్రికా  మాజీ వికెట్ కీపర్, ప్రస్తుతం  సౌతాఫ్రికా  హెడ్‌కోచ్‌ మార్క్ బౌచర్ బాధ్యతలు చేపట్టాడు. మరి  ఐపీఎల్ ప్రారంభం నుంచి  ఆ జట్టు హెడ్‌కోచ్‌ ల  జాబితా చూస్తే.. 

2008లో ప్రారంభమైన ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు మొదటి  హెడ్‌కోచ్‌ గా వ్యవహరించింది లాల్‌చంద్ రాజ్‌పుత్.  ఈ సీజన్ లో ముంబైకి సచిన్ సారథిగా ఉన్నాడు.  2008 లో  ముంబై లీగ్ స్టేజ్ కే పరిమితమైంది. 

2009లో ముంబైకి దక్షిణాఫ్రికా దిగ్గజ పేసర్ షాన్ పొలాక్  హెడ్‌కోచ్‌ గా ఉన్నాడు. ఈ సీజన్ లో కూడా ముంబై లీగ్ స్టేజ్ దాటలేకపోయింది.  

2010 నుంచి 2012 వరకు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ రాబిన్ సింగ్ ముంబై ఇండియన్స్ కు హెడ్‌కోచ్‌ గా పనిచేశాడు.  అతడి మార్గదర్శకత్వంలో ముంబై మెరుగైన ఫలితాలు సాధించింది.  2010లో ముంబై.. రన్నరప్ గా నిలవగా 2011, 2012లో  ప్లేఆఫ్స్ చేరింది.

ఇక 2013 నుంచి  ముంబై కథ మారింది. టీమిండియా మాజీ కోచ్ జాన్ రైట్..  2013, 2014 సీజన్లకు హెడ్‌కోచ్‌ గా ఉన్నాడు.  2013లోనే ఆ జట్టు  తొలి ఐపీఎల్ ట్రోఫీని నెగ్గింది. ఇదే సీజన్ లో రోహిత్ శర్మ ముంబైకి కెప్టెన్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 2014లో ముంబై ప్లేఆఫ్స్ చేరింది. 

2015, 2016 సీజన్లలో ముంబైకి  ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ హెడ్‌కోచ్‌ గా పనిచేశాడు. ఈ సీజన్లలో 2015లో ట్రోఫీ నెగ్గగా 2016లో లీగ్ స్టేజ్ కూడా  దాటలేదు. 
 

ఇక 2017 నుంచి  2022 సీజన్ వరకు ముంబై ఇండియన్స్ కు  శ్రీలంక  బ్యాటింగ్ దిగ్గజం మహేళ జయవర్దెనే హెడ్‌కోచ్‌ గా పనిచేశాడు.   మహేళ  నేతృత్వంలో ముంబై.. 2017, 2019, 2020లలో ట్రోఫీలను గెలుచుకుంది.  కానీ  2018,  2021, 2022లలో లీగ్ స్టేజ్ లలోనే వెనుదిరిగింది. 

మరి ఇప్పుడు ముంబైకి హెడ్‌కోచ్‌ గా ఎంపికైన బౌచర్.. ముంబై వారసత్వాన్ని కొనసాగిస్తాడా..? దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టును బలమైన జట్టుగా  రూపొందించిన  బౌచర్.. రోహిత్ అండ్ కో కు  ఎటువంటి విజయాలు అందిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరం.

click me!