ధోనీ చెప్పినట్టే ఓరియో ‘బిస్కెట్ సెంటిమెంట్’ వర్కవుట్ అవుతోందా... 2011 వన్డే వరల్డ్‌ కప్‌లోనూ...

First Published Nov 6, 2022, 12:03 PM IST

మహేంద్ర సింగ్ ధోనీకి మాస్‌లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రేజ్‌ని కమర్షియల్‌గా ఎలా వాడుకోవాలో ధోనీకి బాగా తెలుసు. 2022 టీ20 వరల్డ్ కప్‌కి ముందు ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చి ధోనీ చేసిన ఓరియో ‘బిస్కెట్’ అనౌన్స్‌మెంట్... సోషల్ మీడియాలో రచ్చ చేసింది...

Image credit: MS DhoniFacebook

2011లో ఇండియాలో ‘ఓరియో’ బిస్కెట్ లాంఛ్ అయ్యిందని, టీమిండియా వరల్డ్ కప్ గెలిచిందని.. 2022లో ఇక్కడ ఓరియో బిస్కెట్లు రీలాంఛ్ అవుతుండడంతో ఈసారి భారత జట్టు ప్రపంచకప్ గెలవబోతుందని పలుమార్లు చెప్పాడు మహేంద్ర సింగ్ ధోనీ...

ms dhoni

2011 వన్డే వరల్డ్ కప్‌ విజయంలో యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్‌తో పాటు భారత జట్టు సమిష్టి కృషి ఉంది. అయితే వాటన్నింటినీ పక్కనబెట్టి ఓరియో బిస్కెట్‌ లాంఛ్ అవ్వడం వల్లే టీమిండియాకి వరల్డ్ కప్ గెలిచిందన్నట్టు మాహీ చేసిన కామెంట్లను ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు నెటిజన్లు...

ఓరియో బిస్కెట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ, ఇలా ప్రమోట్ చేసినా... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో జరుగుతున్న చాలా సంఘటనలు, పరిణామాలు, ట్విస్టులు... 2011 వన్డే వరల్డ్ కప్‌ని గుర్తు చేస్తున్నాయి. 2011లో ఇంగ్లాండ్ జట్టు, ఐర్లాండ్‌ చేతుల్లో పరాజయం పాలైంది. 2022లోనూ ఇదే జరిగింది...

Team India

అంతేకాకుండా 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. 2022లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. 2011 వన్డే వరల్డ్ కప్‌లో 2 బంతులు మిగిలి ఉండగా సౌతాఫ్రికా గెలిస్తే... 2022 టీ20 వరల్డ్ కప్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ సరిగ్గా 2 బంతులు మిగిలి ఉండగానే టీమిండియాపై విజయాన్ని అందుకుంది సఫారీ జట్టు...

2011 వన్డే వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా సెమీ ఫైనల్ చేరలేకపోయింది. న్యూజిలాండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో చిత్తుగా ఓడి ఇంటిదారి పట్టింది. అలాగే మరో క్వార్టర్ ఫైనల్‌లో భారత జట్టు చేతుల్లో ఓడిన ఆస్ట్రేలియా కూడా సెమీ ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్కమించింది.

Australia

2022 టీ20 వరల్డ్ కప్‌లోనూ సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ రేసు నుంచి తప్పుకున్నాయి. సౌతాఫ్రికా, పాక్ చేతుల్లో పరాజయం తర్వాత పసికూన నెదర్లాండ్స్‌పై ఘోర పరాభవాన్ని చవిచూడగా... నెట్ రన్ రేట్ కారణంగా ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజీకే పరిమితం కావాల్సి వచ్చింది...

world cup

ఇవన్నీ చూస్తుంటే 2011 వన్డే వరల్డ్ కప్ సీన్స్ రిపీట్ అవ్వబోతున్నాయని మహేంద్ర సింగ్ ధోనీ చెప్పిన ఓరియో ‘బిస్కెట్’ సెంటిమెంట్ వర్కవుట్ అవుతోందా? అని మీమ్స్ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. మరోసారి మాహీని ట్రెండ్ చేస్తున్నారు.. 

click me!