ధోనీ కెరీర్‌ని మార్చేసిన సచిన్ టెండూల్కర్ రనౌట్... మాహీకి రనౌట్లతో విడదీయలేని అనుబంధం..

First Published Jul 7, 2023, 11:47 AM IST

మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ గ్రాఫ్‌ చాలా విచిత్రంగా ఉంటుంది. మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో తొలి బంతికే రనౌట్ అయిన ధోనీ, ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌లో కూడా రనౌట్ రూపంలోనే పెవిలియన్ చేరాడు..
 

2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి రనౌట్ అయ్యాడు ధోనీ. అయితే అప్పటికే ఓటమి అంచున ఉన్న భారత జట్టు, మాహీ రనౌట్‌తో 18 పరుగుల తేడాతో ఓడింది..

అయితే ఈ రెండు రనౌట్ల మధ్య ఎవ్వరూ గుర్తించని మరో రనౌట్ కూడా ధోనీ, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంత సక్సెస్ సాధించడానికి కారణమైంది. అదే సచిన్ టెండూల్కర్ రనౌట్..

Latest Videos


2005 ఇండియా, పాకిస్తాన్ వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ధోనీ 7 బంతుల్లో 3 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు..

అప్పటికే పేలవ ఫామ్‌తో ‘మ్యాగీ’ ట్రోల్స్ ఎదుర్కొంటున్న సౌరవ్ గంగూలీ, విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో తనను తాను నాలుగో స్థానానికి డిమోట్ చేసుకుని, మాహీని వన్‌డౌన్‌లోకి బ్యాటింగ్‌కి పంపించాడు..

8 బంతుల్లో 2 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్‌తో సమన్వయ లోపంతో రనౌట్ కావడంతో జులపాల జుట్టు ఉన్న ఓ కుర్రాడు... వన్‌డౌన్‌లో బ్యాటు తీసుకుని క్రీజులోకి రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అప్పటికి 4 మ్యాచులు ఆడినా ఆ కుర్రాడి గురించి ఎవ్వరికీ పెద్దగా తెలీదు కూడా..

అయితే అనుకోకుండా వన్‌డౌన్‌లో వచ్చిన మాహీ, 123 బంతుల్లో 15 ఫోర్లు,  4 సిక్సర్లతో 148 పరుగులు చేసి పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 40 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేసిన వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి రెండో వికెట్‌కి 96 పరుగుల భాగస్వామ్యం జోడించాడు ధోనీ..

ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్, ధోనీ కలిసి నాలుగో వికెట్‌కి 149 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఒక్క ఇన్నింగ్స్ కారణంగా అప్పటికి పార్థివ్ పటేల్, దినేశ్ కార్తీక్ వంటి చాలామంది కుర్రాళ్లను వికెట్ కీపర్లుగా ప్రయత్నించిన టీమిండియా మేనేజ్‌మెంట్.. ధోనీకి ఫిక్స్ అయ్యింది..

ఓ రకంగా ధోనీ కెరీర్‌ని మార్చింది సచిన్ టెండూల్కర్ రనౌటే. మూడో వన్డేలో వన్‌డౌన్‌లో వచ్చి 28 పరుగులు చేసిన ధోనీ, నాలుగో వన్డేలో 47 పరుగులు చేశాడు. 

ఐదో వన్డేలో 11 పరుగులకే అవుటైన ధోనీ, ఆఖరి వన్డేలో 24 పరుగులు చేశాడు. మొత్తంగా సిరీస్‌లో 261 పరుగులు చేసి, రాహుల్ ద్రావిడ్ (308), షోయబ్ మాలిక్ (269) తర్వాతి స్థానంలో నిలిచాడు. 

click me!